ప్యూర్ ఏజెంట్..
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:38 AM
కొన్ని రకాల వృత్తి నిపుణులు.. తమ క్లయింట్లకు అందించే సర్వీ్‌సలో భాగంగా చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే, తాము వసూలు చేసే రుసుములో ఎక్కువ మొత్తం ఖర్చులకే పోతుంది. దీంతో పోలిస్తే...
కొన్ని రకాల వృత్తి నిపుణులు.. తమ క్లయింట్లకు అందించే సర్వీ్‌సలో భాగంగా చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే, తాము వసూలు చేసే రుసుములో ఎక్కువ మొత్తం ఖర్చులకే పోతుంది. దీంతో పోలిస్తే తాము సేవలను అందించినందుకు పొందే నికర రుసుము చాలా తక్కువ. అయినప్పటికీ జీఎ్‌సటీ నిబంధనల ప్రకారం వసూలు చేసిన మొత్తం మీద జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కాకుండా కేవలం సర్వీస్ రుసుము మీద మాత్రమే (అంటే అయిన ఖర్చులకు కాకుండా) జీఎ్‌సటీ చెల్లించే వెసులుబాటు ఉన్నట్లయితే చాలా సౌలభ్యంగా ఉంటుంది కదా. అయితే ఇది ‘ప్యూర్ ఏజెంట్’ విధానంలోనే సాధ్యపడుతుంది. అసలు ప్యూర్ ఏజెంట్ అంటే ఏమిటనేది ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో వ్యాపార రంగంలో ఉన్న ఒక సంస్థ తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల్లో ప్రవేశ పెట్టాలని భావించింది. దీనికి గాను తమ ఉత్పత్తులకు ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి మార్కెట్ స్టడీ చేసే బాధ్యతను ఒక కన్సల్టెన్సీకి ఇచ్చింది. దీనికి సంబంధించి రూ.20 లక్షలు ఫీజు చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది. ఆ కన్సల్టెన్సీ తమ ఉద్యోగులను వివిధ టీమ్‌లుగా విభజించి దేశంలోని కొన్ని ప్రాంతాలకు పంపించింది. వారి సర్వే ఫలితాల ఆధారంగా ఒక నివేదికను సదరు కంపెనీకి అందించింది. కంపెనీ కూడా అనుకున్న విధంగా రూ.20 లక్షలు చెల్లించింది. అయితే రూ.20 లక్షల్లో రూ.15 లక్షల వరకు తమ ఉద్యోగుల రానుపోను ప్రయాణ ఖర్చులు, వసతి, భోజనం, లోకల్ ప్రయాణ ఖర్చులు అయినట్లు తేలింది. అంటే ఆ కన్సల్టెన్సీకి ఖర్చులు పోనూ సర్వీస్ చార్జీ కింద మిగిలింది రూ.5 లక్షలు మాత్రమే. అయినప్పటికీ జీఎ్‌సటీ మాత్రం రూ.20 లక్షల మీద చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే, అదే కంపెనీ తమ ఉత్పత్తులకు సంబంధించి గిడ్డంగి నిర్వహణ బాధ్యతను ఒక వ్యక్తికి అప్పగించింది. ఒప్పందం ప్రకారం ఆ గిడ్డంగి నిర్వహణ కోసం అయిన ఖర్చు అంటే.. అద్దె, లోడింగ్, అన్ లోడింగ్, విద్యుత్ మొదలగు ఖర్చులను మొదట ఆ వ్యక్తి పెట్టుకుని నెల చివరిలో కంపెనీ నుంచి వసూలు (రీయింబర్స్‌మెంట్) చేసుకోవాలి. ఈ నిర్వహణకు గాను అతనికి సర్వీస్ చార్జీ కింద నెలకు రూ.20,000 ఇవ్వటం జరుగుతుంది. అనుకున్న విధంగా నెల చివరన ఖర్చులు రూ.80,000, సర్వీస్ చార్జీ రూ.20,000 కలుపుకుని మొత్తం రూ.లక్షకు ఆ వ్యక్తి కంపెనీకి బిల్లు ఇవ్వటం జరిగింది. అలాగే, ఆ కంపెనీ అతనికి రూ.లక్ష చెల్లించటం జరిగింది. మరి ఇక్కడ జీఎ్‌సటీ ఎంత మీద కట్టాలి అంటే.. రూ.20,000 పైన చెల్లిస్తే సరిపోతుంది.
పైన తెలిపిన రెండు ఉదాహరణల్లో కూడా సర్వీస్ చార్జీ కంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. అయినా మొదటి ఉదాహరణలో మొత్తం ఇన్వాయిస్ విలువ మీద జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉండగా రెండో ఉదాహరణలో కేవలం సర్వీస్ చార్జీ మీద మాత్రమే జీఎ్‌సటీ చెల్లిస్తే సరిపోతుంది. రెండో ఉదాహరణలో వ్యక్తి మొత్తం బిల్లు మీద ఎందుకు జీఎ్‌సటీ చెల్లించాల్సిన అవసరం ఎందుకు లేదంటే.. ఆ వ్యక్తి సదరు కంపెనీకి ప్యూర్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. అంటే తను ఖర్చుల కింద చెల్లించే మొత్తం కంపెనీ తరపున, కంపెనీ అనుమతితో చెల్లిస్తున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే కంపెనీ తాను చెల్లించాల్సిన ఖర్చును ఆ వ్యక్తి ద్వారా చెల్లిస్తున్నట్లు.
ప్యూర్ ఏజెంట్ అంటే తాను అందించే సేవల్లో భాగంగా పెట్టే ఖర్చుకు ముందుగా ఆ కంపెనీ నుంచి అనుమతి తీసుకుని ఉండాలి. అలాగే దీనికి సంబంధించిన బిల్లులు కంపెనీ పేరు మీదే తీసుకోవాలి. వాటి వివరాలను విధిగా ఇన్వాయి్‌సలో చూపాలి. ఎంత ఖర్చు అయ్యిందో అంతే చూపాలి తప్ప అంతకు మించి చూపకూడదు. ఇంకా ఆయా సర్వీసులను సొంత అవసరాలకు వాడకూడదు. ఉదాహరణకు ఆ గిడ్డంగిని కంపెనీ కోసమే వాడాలి తప్ప తాను నివసించటానికి గానీ ఇతర సొంత అవసరాలకు గానీ వాడకూడదు. ఈ నిబంధనలు అన్ని పాటిస్తూ నెలాఖరులో కంపెనీకి ఇచ్చే బిల్లులో కంపెనీ తరపును ఈ విధంగా పెట్టిన ఖర్చుల వివరాలను, తన సర్వీస్ చార్జీలను విడివిడిగా చూపాలి. అలాగే ఖర్చులకు సంబంధించిన బిల్లులను విధిగా జతపరచాలి. ఈ నిబంధనలన్నీ పాటించినప్పుడు ఖర్చులు మినహాయించి సర్వీస్ చార్జీ మీద మాత్రమే జీఎ్‌సటీ కడితే సరిపోతుంది. సర్వీస్ పొందే వ్యక్తి తరపున ఖర్చు పెడుతూ, ఆ ఖర్చుల నుంచి జీఎ్‌సటీ మినహాయింపు పొందాలనుకునే వారికి ప్యూర్ ఏజెంట్ పద్దతి బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే దీనికి సంబంధించిన నియమ నిబంధనలను జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఇవి కూడా చదవండి..
అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..