Share News

Startup India 2026: డీప్‌ టెక్‌పై దృష్టి పెట్టండి..

ABN , Publish Date - Jan 17 , 2026 | 06:15 AM

భారత స్టార్ట్‌పలు తయారీ, డీప్‌ టెక్నాలజీ, ప్రపంచ నాయకత్వంపై దృష్టిసారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్టార్టప్‌ ఇండియా వచ్చే దశాబ్ద కాలంలో...

Startup India 2026: డీప్‌ టెక్‌పై దృష్టి పెట్టండి..

  • భారత్‌ను ఆవిష్కరణల్లో అగ్రస్థానంలో నిలబెట్టాలి..

  • దేశీయ స్టార్ట్‌పలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ: భారత స్టార్ట్‌పలు తయారీ, డీప్‌ టెక్నాలజీ, ప్రపంచ నాయకత్వంపై దృష్టిసారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్టార్టప్‌ ఇండియా వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌ను ఆవిష్కరణల్లో అగ్రస్థానంలో నిలబెట్టాలన్నారు. ఢిల్లీలోని భారత మండపం వేదికగా శుక్రవారం జరిగిన స్టార్టప్‌ ఇండియా 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ.. దేశ ఆర్థిక, సాంకేతిక భవిష్యత్‌ను మలచడంలో స్టార్ట్‌పలు కీలకపాత్ర పోషించనున్నాయన్నారు. స్టార్టప్‌ ఇండియా మిషన్‌ ఒక విప్లవమని, ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్ట్‌పల ఆవరణ వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దిందని అన్నారు. 2014లో దేశంలో 500లోపు అంకురాలుండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 2 లక్షలు దాటిందని, అందులో 125 యూనికార్న్‌లు కూడా ఉన్నాయన్నారు. కనీసం 100 కోట్ల డాలర్ల (రూ.9,000 కోట్లు) విలువైన స్టార్ట్‌పలను యూనికార్న్‌లుగా పిలుస్తారు.

స్టార్ట్‌పలకు అండగా

ఉంటాం..

భారత యువత, వ్యవస్థాపకులు సమాజ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టారని, రిస్క్‌ తీసుకునేవారికి సమాజంలో ప్రోత్సాహం, గౌరవం లభిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. స్టార్టప్‌లు ఉద్యోగాల కల్పన, ఆవిష్కరణలు, ప్రపంచ పోటీతత్వాన్ని పెంచుతున్నాయని ఆయన అన్నారు. ‘‘మీ ప్రయత్నాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. మీ ధైర్యం, విశ్వాసం, ఆవిష్కరణలు దేశ భవిష్యత్‌ను మారుస్తాయి’’ అని స్టార్టప్‌ ప్రతినిధులనుద్దేశించి ఆయన అన్నారు.


కృత్రిమ మేధకు ఊతం

దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను పెంపొందించేందుకు కేంద్రం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘కొత్త ఆలోచనలపై పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పలు కొత్త టెక్నాలజీ డొమైన్లు పుట్టుకొస్తున్నాయి. భవిష్యత్‌లో అవి ఆర్థిక భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిలో కీలక పాత్ర పోషించగలవు. అందుకు ఉదాహరణ ఏఐ. దేశం ఏఐ విప్లవంలో ఎంత ముందంజలో ఉంటే అంత ప్రయోజనకరం’’ అని అన్నారు. ఏఐ అభివృద్ధిలో అధిక కంప్యూటింగ్‌ వ్యయం సవాలును పరిష్కరించేందుకు ఇండియాఏఐ మిషన్‌ ఇప్పటికే 38,000 జీపీయూలను సమకూర్చుకుందన్నారు.

నేషనల్‌ స్టార్టప్‌ డే సందర్భంగా ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని

ఇవీ చదవండి:

30 వాట్స్ లేదా 60 వాట్స్ చార్జర్.. బ్యాటరీ మన్నికకు ఏది బెటర్?

వైద్య కళాశాలల అవసరం భవిష్యత్తులో ఉండదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్య

Updated Date - Jan 17 , 2026 | 06:15 AM