ప్రపంచ దిగ్గజాలుగా భారత కంపెనీలు
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:41 AM
భారత కంపెనీలు ప్రపంచ దిగ్గజాలుగా ఎదగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రసంగించారు...
ఫార్చూన్ 500 జాబితాలో 50 దేశీయ కంపెనీలుండాలి జూకనీసం ఒక బ్యాంకింగ్, ఫార్మా సంస్థ ప్రపంచ టాప్-5 స్థాయికి ఎదగాలి..
దేశీయ టెక్నాలజీ కంపెనీలు అంతర్జాతీయంగా కీలకంగా మారాలి..
80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో దేశీయ కార్పొరేట్ రంగానికి లక్ష్యాలను నిర్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: భారత కంపెనీలు ప్రపంచ దిగ్గజాలుగా ఎదగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ఆదాయపరంగా ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీలతో కూడిన ‘ఫార్చూన్ 500’ జాబితాలో కనీసం 50 భారత కంపెనీలుండాలని కార్పొరేట్ రంగానికి సవాలు విసిరారు. అలాగే, దేశీయ బ్యాంకింగ్, ఫార్మా రంగాల నుంచి కనీసం ఒక్క కంపెనీ అయినా ‘ప్రపంచ టాప్-5’ స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. ‘‘ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ వర్ధిల్లుతోంది. భారత బ్యాంక్ కూడా ప్రపంచ అగ్రశ్రేణి బ్యాంక్‌గా ఎదగాలి. టాప్-5 బ్యాంక్‌ల్లో ఒకటి మనదై ఉండాల’’ని ప్రధాని పేర్కొన్నారు. దేశీయ ఔషధ రంగం నుంచి కూడా ఒకటి లేదా రెండు కంపెనీలు వరల్డ్ టాప్-5లో చోటు దక్కించుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. దేశీయ ఫార్మా రంగం చౌకగా ఔషధాలు సరఫరా చేసే స్థాయి నుంచి సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదగాలన్నారు. అంతేకాదు, భారత టెక్నాలజీ, లీగల్, రేటింగ్ ఏజెన్సీలు, కన్సల్టింగ్, అకౌంటింగ్ సంస్థలు సైతం అంతర్జాతీయంగా అగ్రశ్రేణి కంపెనీలుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన భారత బ్రాండ్లను నిర్మించాలని కార్పొరేట్ రంగాన్ని ప్రధాని కోరారు.
గత ఏడాదికి విడుదలైన ఫార్చూన్ 500 జాబితాలో భారత్ నుంచి కేవలం 9 కంపెనీలకు చోటు దక్కింది. అందులో 5 ప్రభుత్వ రంగ సంస్థలే. మిగతా నాలుగు ప్రైవేట్ కంపెనీలు. కాగా, ప్రపంచంలోని టాప్-3 బ్యాంక్‌లు చైనావే. భారత్‌కు చెందిన ఎస్‌బీఐ ప్రస్తుతం టాప్-50 బ్యాంక్‌ల్లో ఒకటిగా ఉంది. ఇక భారత ఫార్మా పరిశ్రమ విలువపరంగా ప్రపంచంలో 11వ స్థానంలో, పరిమాణపరంగా 3వ స్థానంలో ఉంది. దేశంలో 3,000కు పైగా ఔషధ కంపెనీలు 10,500 తయారీ ప్లాంట్లను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం 6,000 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న దేశీయ ఫార్మా మార్కెట్.. 2030 నాటికి 13,000 కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. ప్రపంచ ఔషధ సరఫరాల్లో 20 శాతం వాటా మన కంపెనీలదే. 191 దేశాలకు మన కంపెనీలు ఔషధాలను ఎగుమతి చేస్తున్నాయి.
ఇంధన భద్రత, చిప్‌లు భవిష్యత్ వృద్ధికి కీలకం
భారత్ తదుపరి దశ ఆర్థిక వృద్ధికి ఇంధన భద్రత, సెమీకండక్టర్ల (చిప్) తయారీ, ఆధునిక సాంకేతికత కీలకమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే సంస్కరణలను వేగవంతం చేయాలన్నారు. అంతేకాదు, భారత కంపెనీలు ప్రపంచ దిగ్గజాలుగా ఎదగాలని సవాలు విసిరారు. ఇంధన భద్రత, ఆధునిక సాంకేతికత లేకుండా భారత్ వృద్ధి లక్ష్యాలను చేరుకోలేదన్నారు. వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థకు కీలక ఖనిజాలు మరింత బలాన్ని చేకూర్చగలవన్నారు. ‘‘ఇంధన భద్రత అత్యవసరంగా మారింది. చిప్‌లు, కృత్రిమ మేధ(ఏఐ), డేటా సెంటర్లతో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింద’’ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కొన్ని దేశాలకు ఆయుధంగా సహజ వనరులు
పశ్చిమాసియాలో సంక్షోభంతో ప్రపంచం ఇంధన సరఫరా కొరత ను ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఇంధన స్వీయసమృద్ధికి పిలుపునిచ్చారు. కొన్ని దేశాలు సహజ వనరులను, కీలక సముద్ర రవాణా మార్గాలను ఆయుధాలుగా మల్చుకుంటున్నాయని అన్నారు. అది భారత ఇంధన భద్రతకు ముప్పుగా మారిందని, విదేశీ సరఫరాలపై ఆధారాన్ని తగ్గించుకునేందుకు దేశీయంగా ముడిచమురు, సహజ వాయువు ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సముద్ర అంతర్భాగాల్లో చమురు అన్వేషణ కోసం కేంద్రం రూ.85,000 కోట్లతో సముద్ర మంథన్ కార్యక్రమాన్ని ఈ మధ్యనే ప్రకటించింది.
కాగా, స్వయం సమృద్ధి భారత్ లక్ష్యాలకు సెమీకండక్టర్లు కూడా ముఖ్యమేనన్న మోదీ.. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సాంకేతికతల సరఫరాల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కీలక ఖనిజాలు సైతం వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగినవేనని.. వీటి కోసం దేశీయంగా అన్వేషణను ముమ్మరం చేయడంతోపాటు పలు దేశాలతో సరఫరా ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు.
వచ్చే 7-8 ఏళ్లలో మరో 5-8 చిప్ తయారీ ప్లాంట్లు
భారత్‌లో ఇప్పటికే 3 సెమీకండక్టర్ల (చిప్) ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైందని ప్రధాని అన్నారు. వచ్చే 7-8 ఏళ్లలో మరో 5 నుంచి 8 చిప్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి రావచ్చన్నారు. భారత చిప్‌ల తయారీ ప్రయాణం.. సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధిని ప్రతిబింబిస్తోందన్నారు. దేశంలో చిప్‌ల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో రూ.76,000 కోట్లతో సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ (సెమికాన్ 1.0)ను ప్రకటించింది. ఈ ఏడాది జూలైలో మోదీ సర్కారు రూ.1,27,500 కోట్లతో ప్రకటించిన సెమికాన్ 2.0 ప్రోగ్రామ్‌కు సైతం ఆమోదం తెలిపింది. సెమీకాన్ 1.0లో భాగంగా రూ.1.64 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి హామీలతో కూడిన 12 చిప్ తయారీ ప్లాంట్లకు ఆమోదం లభించింది. అందులో మూడు సంస్థలు (మైక్రాన్, కేన్స్, సీజీ సెమీ) ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి.
100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం
వికసిత్ భారత్‌గా ఎదిగేందుకు 2047 నాటికి అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 గిగా వాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాన మోదీ తెలిపారు. ఈ జూలై 31 నాటికి భారత్ 8.78 గిగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2031-32 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 22.38 గిగావాట్లకు పెరగవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలుగా భారత్ ఇప్పటికే ‘శాంతి చట్టం 2025’ ద్వారా ప్రైవేట్ కంపెనీలు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించింది.
ఎఫ్‌టీఏ అవకాశాలను అందిపుచ్చుకోండి
2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) ఖరారు చేసిందని, ఇవి దేశంలోని ఎంఎ్‌సఎంఈలకు అపార అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ అవకాశాలను చిన్న తరహా పరిశ్రమలు చేజార్చుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, వస్ర్తాలు, యంత్రాలు, ఔషధాలు వంటివి అంతర్జాతీయ మార్కెట్లకు చేరాలన్నారు. దీన్ని సాధించేందుకు కచ్చితంగా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచం మన సామర్థ్యాలను గుర్తిస్తోందని, అందుకే ఎఫ్‌టీఏలను కుదుర్చుకుంటున్నామని తెలిపారు.
తయారీ రంగ వృద్ధిని పెంచాలి
దేశీయంగా తయారీ రంగంలో వృద్ధిని పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే వ్యయాలు, నాణ్యత, ఉత్పత్తి, పరిమాణం, వినియోగదారులకు అనుకూలమైన ఉత్పత్తులు, ఆకర్షణీయమైన ప్యాకేజీపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని సూచించారు. ‘సప్తధార’లో తొలి బలం తయారీ రంగ శక్తి అని మోదీ పేర్కొన్నారు. ‘‘మనం తయారీ రంగాన్ని గణనీయంగా ప్రోత్సహించాలి. ఉత్పత్తిని పెంచడంతో పాటు చిన్న భాగాలే కాకుండా పెద్ద ఉత్పత్తులనూ తయారు చేయాలి. డిజైన్ నుంచి తయారీ వరకు ప్రపంచ సప్లయ్ చెయిన్‌లో భారత్ ఒక విశ్వసనీయమైన కేంద్రంగా మారాలి’’ అని ప్రధాని అన్నారు.
యువత గొప్ప కలలు కనాలి..
దేశ యువత గొప్ప కలలు కనాలని, వారికి అవసరమైన వనరులు, మద్దతు లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో స్టార్టప్ వ్యవస్థ వృద్ధితో పాటు ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష కోట్ల ఇన్నోవేషన్ ఫండ్ గురించి ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యసాధనలో యువత ప్రధాన పాత్ర పోషించడమేకాకుండా దాని వల్ల అత్యధిక ప్రయోజనం పొందేది కూడా వారేనన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియ షురూ
హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ జీఈసీ