టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియ షురూ
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:04 AM
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియను టాటా ట్రస్టులు గురువారం ప్రారంభించాయి. ఎందుకంటే, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ వీడ్కోలు...
ముంబై: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియను టాటా ట్రస్టులు గురువారం ప్రారంభించాయి. ఎందుకంటే, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ వీడ్కోలు పలికారు. 2027 ఫిబ్రవరి 20తో ముగియనున్న ప్రస్తుత పదవీకాలం తర్వాత పునర్నియామకాన్ని కోరుకోవట్లేదని ఆయన బుధవారం ప్రకటించారు. ‘‘చంద్రశేఖరన్ నిర్ణయాన్ని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (ఎస్‌డీటీటీ) గౌరవిస్తుంది. గడిచిన దశాబ్దకాలంలో టాటా సన్స్‌తోపాటు టాటా గ్రూప్‌నకు ఆయన అందించిన సేవలకు, నాయకత్వానికి మా ప్రగాఢ ప్రశంసలను తెలియజేస్తున్నాం’’ అని టాటా ట్రస్టులు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. ముఖ్యంగా గ్రూప్ అత్యంత కీలక మార్పు, వృద్ధి, పరివర్తనం చెందుతున్న సమయంలో చంద్రశేఖరన్ అందించిన సహకారానికి ట్రస్ట్‌లు కృతజ్ఞతలు తెలిపాయి. టీసీఎస్, టాటా మోటార్స్, ఎయిరిండియా సహా టాటా గ్రూప్‌లోని 30 కీలక కంపెనీల ప్రమోటరే టాటా సన్స్. ఈ సంస్థలో టాటా ట్రస్ట్‌లు మొత్తం 66 శాతం వాటా కలిగి ఉన్నాయి.
కమిటీ ఏర్పాటు
టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఓఏ) ప్రకారంగా కొత్త చైర్మన్ నియామకం కోసం వీలైనంత త్వరగా ఎంపిక కమిటీని ఏర్పాటు చేయాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు చెందిన ట్రస్టీలు తీర్మానించినట్లు టాటా ట్రస్ట్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. రతన్ టాటా మరణాంతరం 2024లో టాటా ట్రస్టుల చైర్మన్‌గా నోయల్ టాటా బాధ్యతలు చేపట్టారు. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు సైతం ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. ‘‘టాటా సన్స్, టాటా గ్రూప్ విలువలు, దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుగుణంగా టాటా సన్స్‌లో నాయకత్వ పరివర్తనం సాఫీగా, సకాలంలో, పద్ధతి ప్రకారంగా జరిగేందుకు మేము పూర్తి మద్దతిస్తాం’’అని టాటాట్రస్ట్‌లు పేర్కొన్నాయి.
రేసులో టీవీ నరేంద్రన్..?
టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియలో భాగంగా టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ పేరు తప్పక చర్చకు రావచ్చని వినిపిస్తోంది. 1988లో టాటా స్టీల్‌లో చేరిన నరేంద్రన్ గత 38 ఏళ్లుగా కంపెనీకి సేవలందిస్తున్నారు. 2013లో కంపెనీ ఎండీగా పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ఈ కంపెనీకి చంద్రశేఖరన్ చైర్మన్‌గా, నోయల్ టాటా వైస్ చైర్మన్‌గా ఉన్నారు.
నోయల్‌కు నో చాన్స్
టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా నోయల్ టాటా నియామకానికి ప్రస్తుతానికైతే అవకాశాల్లేవు. ఎందుకంటే, టాటా సన్స్ తన ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్(ఏఓఏ)ను 2022లో సవరించింది. దాని ప్రకారం.. టాటా ట్రస్ట్‌లకు చైర్మన్‌గా ఉన్న వ్యక్తి అదే సమయంలో టాటా సన్స్‌కు సైతం చైర్మన్‌గా ఉండటానికి వీల్లేదు. గతంలో రతన్ టాటా మాత్రమే టాటా ట్రస్ట్‌లతో పాటు టాటా సన్స్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. గ్రూప్ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలతో 2016లో సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అర్థంతరంగా తప్పించిన రతన్ టాటా.. ట్రస్ట్‌లతోపాటు టాటా సన్స్‌కు సైతం తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించాల్సి వచ్చింది. 2017 జనవరిలో టాటా సన్స్ పగ్గాలను చంద్రశేఖరన్ చేతుల్లో పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..