Share News

‘తయారీ’కి పీఎల్‌ఐ కిక్‌

ABN , Publish Date - Sep 26 , 2026 | 01:43 AM

కీలకమైన 14 రంగాల్లో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 2020లో రూ.1.91 లక్షల కోట్ల బడ్జెట్‌తో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలు ఫలిస్తున్నాయి

‘తయారీ’కి పీఎల్‌ఐ కిక్‌
pli

  • ఏపీలో రెండు ప్లాంట్లు

  • రూ.24 లక్షల కోట్ల ఉత్పత్తి.. రూ.15.53 లక్షల కోట్ల ఎగుమతులు

న్యూఢిల్లీ: కీలకమైన 14 రంగాల్లో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 2020లో రూ.1.91 లక్షల కోట్ల బడ్జెట్‌తో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలు ఫలిస్తున్నాయి. ఈ పథకాల కింద ఈ ఏడాది జూన్‌ నాటికి కేంద్ర ప్రభుత్వం రూ.36,754 కోట్ల మొత్తాన్ని ఆయా ఉత్పత్తి ఆధారిత తయారీ కంపెనీలకు విడుదల చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ఈ పీఎల్‌ఐ పథకాల ద్వారా లబ్ది పొందిన 14 రంగాలకు చెందిన కంపెనీలు ఈ ఏడాది జూన్‌ నాటికి రూ.2.58 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగాయి. దీంతో ఈ రంగాల్లో కొత్తగా 14.57 లక్షల మందికి కొత్తగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. అంతేగాక ఈ కంపెనీల ద్వారా రూ.23.79 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి, రూ.15.53 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు సాధ్యమయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

దేశీయంగా కొన్ని కీలక బల్క్‌ డ్రగ్స్‌, వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో రూ.6,490 కోట్ల నిధులతో ప్రకటించిన ఫార్మా పీఎల్‌ఐ పథకం కూడా మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ పథకం కింద ఈ ఏడాది జూన్‌ నాటికి రూ.5,210 కోట్ల పెట్టుబడితో 28 కీలక యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) ఉత్పత్తి కోసం దేశంలో 39 ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. ఈ పథకం కిందే అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ లిఫియస్‌ ఫార్మా.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సెజ్‌లో రూ.2,270 కోట్ల పెట్టుబడితో ఏటా 1,500 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న పెన్సిలిన్‌ జీ ప్లాంటు ఏర్పాటు చేసింది.


విర్కో ల్యాబ్స్‌ అనుబంధ సంస్థ ఆంధ్ర ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ (ఏఓఎల్‌) అనే మరో కంపెనీ.. సల్ఫాడియాజిన్‌, టెల్మిసార్టాన్‌, ఓల్మెసార్టాన్‌ అనే కీలక ఏపీఐ ఉత్పత్తి కోసం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం వద్ద రూ.151.47 కోట్లతో ప్రత్యేక ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు చెప్పాయి.

ఈ వార్తలు కూడా చదవండి

ఎన్‌ఎస్‌ఈ @ నం.7

Updated Date - Sep 26 , 2026 | 01:46 AM