కోట్లకు పడగలెత్తిన ఓపెన్ ఏఐ ఉద్యోగులు! సిలికాన్ వ్యాలీలో అరుదైన ఘటన
ABN , Publish Date - May 11 , 2026 | 01:20 PM
ఓపెన్ ఏఐ షేర్ల విక్రయం ద్వారా సంస్థ ఉద్యోగులు కోట్లకు పడగలెత్తినట్టు అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. సంస్థ స్టాక్ మార్కెట్‌లో కాలుపెట్టకముందే ఉద్యోగులకు ఈ స్థాయిలో లాభాలు రావడం అరుదైన ఘటన అని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ రంగంలోని కొందరు ఉద్యోగులు అసాధారణ స్థాయిలో మిలియనీర్లుగా మారిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన పలువురు ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఒక్క రోజులో 6.6 బిలియన్ డాలర్ల విలువైన సంస్థ షేర్లను సెకండరీ మార్కెట్‌లో విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతేడాది అక్టోబర్‌లో పలువురు సంస్థ అనుమతితో షేర్లను విక్రయించినట్టు సమాచారం. ఈ లావాదేవీల్లో ఓపెన్ ఏఐ మార్కెట్ విలువ 400 బిలియన్ డాలర్లుగా తేలింది.
సిలికాన్ వ్యాలీలో ఇదో అత్యంత అసాధారణ ఘటన అని కూడా పరిశీలకులు చెబుతున్నారు. సంస్థ స్టాక్ మార్కెట్‌లోకి కాలుపెట్టకమునుపే ఉద్యోగులకు వ్యక్తిగత స్థాయిలో ఇంతటి సంపద సమకూరడం అరుదైన విషయమని అంటున్నారు. మీడియా కథనాల ప్రకారం, ఒక్కొక్కరు తమ వద్ద ఉన్న షేర్లను 30 మిలియన్ డాలర్ల విలువ వరకూ విక్రయించేందుకు అనుమతి లభించిందని తెలుస్తోంది. దాదాపు 75 మంది ఉద్యోగులు ఈ గరిష్ఠ పరిమితి వరకూ షేర్లను విక్రయించి భారీగా సంపదను సొంతం చేసుకున్నారు. ఈ సొమ్ములో కొంత మొతాన్ని వారు పన్ను ప్రయోజనాలు కల్పించే లాభాపేక్ష రహిత ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు కూడా వెలుగులోకి వచ్చింది.
ఓపెన్ ఏఐ సంస్థ ప్రారంభమయ్యాక తొలినాళ్లల్లో చేరిన అనేక మంది ఈ ఆఫర్‌ను వినియోగించుకున్నారు. ఓపెన్ ఏఐ మార్కెట్ విలువ పెరగడంతో ఉద్యోగుల స్టాక్ గ్రాంట్స్ విలువ కూడా అంతే మొత్తంలో పెరిగింది. మీడియా కథనాల ప్రకారం, ఓపెన్ ఏఐ సుమారు ఏడేళ్ల క్రితం ఉద్యోగులకు ఈక్విటీ షేర్లను కేటాయించడం ప్రారంభించింది. ఆ సమయంలో వీటిని దక్కించుకున్న వారి వాటా విలువ 100 రేట్ల మేర పెరిగినట్టు సమాచారం. సెకండెరీ మార్కెట్‌లో షేర్ల విక్రయానికి సంబంధించి ఒక్కో ట్రాన్సాక్షన్‌పై 10 మిలియన్ డాలర్ల పరిమితిని ఓపెన్ ఏఐ గతంలో విధించింది. అయితే, ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ పరిమితిని 30 మిలియన్ డాలర్లకు పెంచింది.
ఇక ఏఐ నిపుణుల కోసం టెక్ సంస్థల మధ్య పోటీ పెరగడంతో జీతాలు కూడా అసాధారణ స్థాయిలో పెరిగాయి. కొన్ని టెక్నికల్ బాధ్యతలు నిర్వహించే ఉద్యోగుల కోసం ఓపెన్ ఏఐ ఏటా 5 లక్షల డాలర్ల చెల్లించేందుకు కూడా రెడీగా ఉన్నట్టు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత