గ్యాస్‌తోనే మా భవిష్యత్ అభివృద్ధి
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:29 AM
ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) స్వరూపం మారిపోతోంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ ఉత్పత్తిలో మెజారిటీ వాటా ముడి చమురుదే. ఇప్పుడు...
చమురును మించిపోయిన గ్యాస్ ఉత్పత్తి
ఓఎన్‌జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) స్వరూపం మారిపోతోంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ ఉత్పత్తిలో మెజారిటీ వాటా ముడి చమురుదే. ఇప్పుడు ఈ స్థానాన్ని గ్యాస్ ఆక్రమించినట్టు కంపెనీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ చెప్పారు. దీంతో ఓఎన్‌జీసీని ఇక చమురు, గ్యాస్ కంపెనీగా కాకుండా గ్యాస్, ఆయిల్ కంపెనీగా చూడాలన్నారు. కంపెనీ భవిష్యత్ అభివృద్ధికి కూడా గ్యాస్ ఉత్పత్తే ప్రధాన చోదక శక్తి అవుతుందన్నారు. దేశంలో గ్యాస్‌కు పెరుగుతున్న గిరాకీ, గ్యాస్ ధరలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు, అందుబాటులోకి రానున్న కొత్త సహజ వాయు క్షేత్రాలు ఇందుకు ప్రధాన కారణమని సింగ్ చెప్పారు. కొత్త చమురు నిక్షేపాలు ఏమీ కనుగొనకపోతే చమురు ఉత్పత్తిలో ఓఎన్‌జీసీ ఎదుగూబొదుగు ఏ మాత్రం ఉండదన్నారు. ఇప్పటికే గ్యాస్ నిక్షేపాలు కనుగొన్న కొన్ని క్షేత్రాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం (2027-28) నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని అరుణ్ కుమార్ తెలిపారు. సముద్ర గర్భంలో చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కోసం తమ సంస్థ దాదాపు రూ.33,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సింగ్ చెప్పారు.
రష్యా, యూఏఈ నుంచి మరింత చమురు
రష్యా, యూఏఈ నుంచి భారత్ చమురు దిగుమతులు మరింత పెంచింది. గత నెల (మే)లో రష్యా నుంచి రోజుకు సగటున 19.1 లక్షల బ్యారళ్లుగా ఉన్న చమురు దిగుమతి ఈ నెల 19వ తేదీ నాటికి 26.6 లక్షల బ్యారళ్లకు చేరింది. ఇదే సమయంలో యూఏఈ నుంచి దిగుమతయ్యే రోజువారీ సగటు దిగుమతులు స్వల్పంగా 6.44 లక్షల బ్యారళ్ల నుంచి 6.36 లక్షల బ్యారళ్లకు తగ్గింది. రవాణా నౌకల రాకపోకలను పర్యవేక్షించే కెప్లర్ అనే సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. ఈ నెల 19 వరకు సౌదీ అరేబియా నుంచి రోజుకు సగటున 3.84 లక్షల బ్యారళ్లు, వెనెజువెలా నుంచి 2.09 లక్షల బ్యారళ్ల చమురు మన దేశానికి దిగుమతైంది. ఇదే సమయంలో అమెరికా నుంచి రోజూ దిగుమతయ్యే చమురు మాత్రం 2.52 లక్షల బ్యారళ్ల నుంచి 91,000 బ్యారళ్లకు పడిపోయింది.
ఇవి కూడా చదవండి..
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..