ముంచుకొస్తున్న చమురు ముప్పు
ABN , Publish Date - Mar 02 , 2026 | 04:33 AM
మరోసారి చమురు ముప్పు ముంచుకొస్తోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడితో ఊహించినట్టే ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో మన దేశం రోజూ దిగుమతి చేసుకునే 50 లక్షల బ్యారళ్ల చమురు...
రిఫైనరీల వద్ద 15 రోజులకు సరిపడా నిల్వలు
మూసుకుపోయిన హోర్ముజ్ జల సంధి
సగం భారత చమురు దిగుమతులకు బ్రేక్
రెండు నెలలకు సరిపడా క్రూడాయిల్
100 డాలర్ల దిశగా బ్యారల్ చమురు!
న్యూఢిల్లీ: మరోసారి చమురు ముప్పు ముంచుకొస్తోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడితో ఊహించినట్టే ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో మన దేశం రోజూ దిగుమతి చేసుకునే 50 లక్షల బ్యారళ్ల చమురు సరఫరాలో సగానికి బ్రేక్ పడింది. ఇదే సమయంలో సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్, ఇరాక్, యూఏఈ, ఖతార్ దేశాలకు జరిగే మన ఎగుమతులకూ బ్రేక్ పడనుంది.
భారీగా నిల్వలు
తాజా పరిస్థితుల నేపథ్యంలో మన దేశ చమురు అవసరాలకు ఇప్పటికిప్పుడు పెద్దగా వచ్చే మప్పేమీ కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, పాడూరుల్లోని వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రాల్లో రెండు నెలల దేశ అవసరాలకు సరిపడా ముడి చమురు (క్రూడాయిల్) నిల్వలు ఉన్నాయి. దీనికి తోడు దేశంలోని పెట్రోలియం రిఫైనరీల వద్ద 15 రోజుల అవసరాలకు సరిపడా పెట్రో ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి. దీంతో ఈ ఉద్రిక్తతలు ఎంత తీవ్రమైనా మరో రెండు నెలల వరకు మన దేశ ముడి చమురు, పెట్రో ఉత్పత్తుల అవసరాలకు ఢోకా ఉండదని భావిస్తున్నారు. అయితే ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ సరఫరాలకు మాత్రం బ్రేక్ పడి వాటి ధరలు చుక్కలంటే ప్రమాదం కనిపిస్తోంది.
ధరలకు రెక్కలు?
ప్రస్తుతం బ్రెంట్ రకం బ్యారల్ ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్లో 73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సోమవారం ఇది 15 డాలర్ల వరకు ఎగిసిపడే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ ఉద్రిక్తతలకు ఇప్పట్లో తెరపడకపోతే బ్యారల్ ముడి చమురు ధర త్వరలో 100 డాలర్లకు చేరినా ఆశ్చర్యం లేదని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది.
ప్రత్యామ్నాయాలు
భారత ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 45 శాతం పశ్చిమాసియా దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ దేశాల నుంచి వస్తోంది. అమెరికా ఆంక్షలతో ఇరాన్ నుంచి దిగుమతుల దాదాపుగా ఆగిపోయా యి.అయితే ఇప్పుడు ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ నుంచి వచ్చే దిగుమతులకూ బ్రేక్ పడింది. దీంతో మన దేశంలో తప్పనిసరిగా ప్రత్యామ్నాయాలు చూసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా, రష్యా, వెనెజువెలా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ దేశాల నుంచి కొనుగోలు చేసే ముడి చమురు మన దేశానికి చేరేందుకు ఎంత లేదన్నా 30 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. అదే గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే 5 నుంచి 7 రోజుల్లో భారత రేవులకు చేరుతుంది. అయితే ఈ దేశాలు మన రోజువారీ చమురు దిగుమతులైన 50 లక్షల బ్యారళ్ల సగం మొత్తాన్ని భర్తీ చేయగలవా? అన్నది పెద్ద ప్రశ్న.
ముందున్న మార్గం?
వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్ సర్కారు ఒత్తిడికి లొంగి మన దేశం ఇప్పటికే రష్యా చమురు దిగుమతులను భారీగా తగ్గించింది. ఇప్పుడు ఒట్టు తీసి గట్టు మీద పెట్టి రష్యాను ఆశ్రయించడం ఒక్కటే సరైన మార్గంగా కనిపిస్తోంది. దీనికి తోడు పెద్దమొత్తంలో చమురు నిల్వలతో అనేక రష్యా నౌకలు కొనుగోలుదారుల కోసం అరేబియా, హిందూ మహాసముద్రంలో వేచి చూస్తున్నాయి. అయితే ట్రంప్ సర్కారు ఇందుకు మన దేశాన్ని అనుమతిస్తుందా? లేదా? అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ అనుమతించక పోతే మోదీ సర్కారు కత్తి మీద సాము చేయక తప్పదు.
బియ్యం ఎగుమతులపై జరజాగ్రత్త
తాజా పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు మన దేశం నుంచి జరిగే బియ్యం ఎగుమతులూ ప్రమాదంలో పడ్డాయి. కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్ (సీఐఎఫ్) పద్దతిలో ఈ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య (ఐఆర్‌ఈఎఫ్) తన సభ్యులను కోరింది. రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిపోయే ప్రమాదం ఉన్నందున ఈ ఆప్షన్‌ను అసలు ఎంచుకోవద్దని హెచ్చరించింది. సీఐఎఫ్ పద్దతిలో ఎగుమతి చేసే వస్తువుల ఖర్చులు, నౌకా రవాణ, బీమా ప్రీమియం ఖర్చులు ఎగుమతిదారుడే భరించాలి.
బులియన్ ధరలు మరింత పైకి!
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతలతో బంగారం, వెండి ధరలు ఈ వారం 3 నుంచి 6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ఆదివారం రాత్రి ఔన్స్ మేలిమి బంగారం అంతర్జాతీయ మార్కెట్లో 5,280 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ సమస్యకు ఏదైనా సత్వర దౌత్య పరిష్కారం లభిస్తే వారాంతంలో లాభాల స్వీకరణకూ అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు
ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం