Share News

ఎన్‌ఎస్ఈలో నేటి నుంచి కొత్త ప్రీ-ఓపెన్‌ సెషన్‌ నిబంధనలు

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:20 AM

ఈక్విటీ క్యాష్‌ మార్కెట్‌కు సంబంధించి నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ).. సోమవారం నుంచి ప్రీ-ఓపెన్‌ సెషన్‌కు సంబంధించి సవరించిన నిబంధనలను అమలు చేస్తోంది

ఎన్‌ఎస్ఈలో   నేటి నుంచి కొత్త ప్రీ-ఓపెన్‌ సెషన్‌ నిబంధనలు
NSE

4 దశలుగా ఆర్డర్ల విభజన

న్యూఢిల్లీ: ఈక్విటీ క్యాష్‌ మార్కెట్‌కు సంబంధించి నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ).. సోమవారం నుంచి ప్రీ-ఓపెన్‌ సెషన్‌కు సంబంధించి సవరించిన నిబంధనలను అమలు చేస్తోంది. సెబీ ప్రతిపాదించిన క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ (సీఏఎస్‌) నిబంధనలకు అనుగుణంగా వీటిని అమల్లోకి తీసుకువస్తోంది. దీంతో ఉదయం 9 గంటల నుంచి 9.15 గంటల వరకు ఉండే ప్రీ-ఓపెన్‌ సెషన్‌లో స్వీకరించే ఆర్డర్ల ఎంట్రీ సమయాల్ని నాలుగు దశలుగా విభజించారు.

ఈ కొత్త నిబంధనల ప్రకారం..

తొలి దశ: ఉదయం 9-9.05 గంటల మధ్య సమయం లో ఆర్డర్లను ఎంట్రీ చేసే మదుపరులు.. 9.05 గంటల లోపు మాత్రమే తమ పరిమిత, మార్కెట్‌ ఆర్డర్లను సవరించుకోవడం లేదా రద్దు చేసుకోవడం చేయవచ్చు.

రెండో దశ: ఉదయం 9.05-9.10 మధ్య సమయంలో పెట్టే పరిమిత ఆర్డర్లను ఎంటర్‌ చేయడానికి, సవరించడానికి, రద్దు చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది.

మూడో దశ: ఇప్పటి వరకు ఉన్న ఆర్డర్‌ మ్యాచింగ్‌, ట్రేడ్‌ కన్ఫర్మేషన్‌ సెషన్‌ను ఉదయం 9.08-9.12 గంటల నుంచి ఉదయం 9.10-9.12 గంటల మధ్యకు మార్చారు. ఈ సెషన్‌లో ఓపెనింగ్‌ ధరను ఎస్టాబ్లిష్‌ చేసి, ఆర్డర్లను మ్యాచ్‌ చేసి వాటిని కన్‌ఫర్మ్‌ చేస్తారు.

నాలుగో దశ: ఉదయం 9.12-9.15 మధ్య ఉంటుంది. ఈ సమయంలో ప్రీ-ఓపెన్‌ సెషన్‌ నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా రెగ్యులర్‌ కంటిన్యుయస్‌ ట్రేడింగ్‌కు వెసులుబాటు జరుగుతుంది.ఈ మార్పులతో రెండో దశలోనే మార్కెట్‌ ఆర్డర్లు నియంత్రించబడతాయి. దీంతో క్యాష్‌ అండ్‌ డెరివేటివ్స్‌ సెగ్మెంట్ల మధ్య సరైన సమన్వయం ఏర్పడి, మార్కెట్‌ కార్యకలాపాలు సజావుగా సాగుతాయని భావిస్తున్నారు.

Updated Date - Sep 07 , 2026 | 01:20 AM