Share News

ఎన్‌ఎస్ఈ లాభంలో 23శాతం వృద్ధి

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:25 AM

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్ఈ).. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.2,578 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది

ఎన్‌ఎస్ఈ లాభంలో 23శాతం వృద్ధి
Nse

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్ఈ).. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.2,578 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గరిష్ఠ లావాదేవీల ఆదాయంతో పాటు వ్యయాలు గణనీయంగా తగ్గటం కలిసి వచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,098 కోట్ల లాభంతో పోల్చితే 23 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా 9 శాతం వృద్ధితో రూ.4,160 కోట్ల నుంచి రూ.4,554 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో లావాదేవీల చార్జీలు 9 శాతం పెరిగి రూ.3,035 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. సెప్టెంబరు త్రైమాసికంలో రోజువారీ సగటు ట్రేడెడ్‌ వాల్యూమ్‌ (ఏడీటీవీ) 24 శాతం పెరుగుదలతో రూ.1,18,377 కోట్లుగా ఉన్నట్లు ఎన్‌ఎస్ఈ వెల్లడించింది. స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.3,956 కోట్ల ఆదాయంపై రూ.2,164 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

వండర్‌లా హాలిడేస్‌ లిమిటెడ్‌.. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో లాభాల్లోకి అడుగుపెట్టింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో రూ.126 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.5.06 లక్షల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1.75 కోట్ల నికర నష్టాన్ని మూటగట్టుకుంది.

ట్రాక్టర్ల తయారీ సంస్థ జాన్‌డీర్‌.. భారత మార్కెట్లో 2025 నవంబరు నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు దేశీయంగా లక్షకు పైగా ట్రాక్టర్లను విక్రయించినట్లు ప్రకటించింది. వ్యవసాయ రంగంలో పెరుగుతున్న యంత్రాల వినియోగంతో ఈ రికార్డు అమ్మకాలను సాధించినట్లు పేర్కొంది.

Updated Date - Nov 04 , 2026 | 06:28 AM