ప్రవాసుల నిధుల వెల్లువ
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:11 AM
విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు ఆర్‌బీఐ చేపట్టిన చర్యలు అంచనాలకు మించిన ఫలితాలిచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 31నాటితో ముగిసిన ఆర్‌బీఐ ఫారెక్స్ మార్పిడి వసతి...
ఆగస్టు 31 నాటికి రూ.12 లక్షల కోట్ల ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లు : ఆర్‌బీఐ
ముంబై: విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు ఆర్‌బీఐ చేపట్టిన చర్యలు అంచనాలకు మించిన ఫలితాలిచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 31నాటితో ముగిసిన ఆర్‌బీఐ ఫారెక్స్ మార్పిడి వసతి ద్వారా దేశంలోని బ్యాంక్‌లు ప్రవాస భారతీయుల(ఎన్నారై) నుంచి ఏకంగా 12,723 కోట్ల డాలర్ల (సుమారు రూ.12.09 లక్షల కోట్లు) విలువైన ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్(ఎ్‌ఫసీఎన్‌ఆర్‌బీ) డిపాజిట్లను ఆకర్షించాయి. ఆర్‌బీఐ స్వయంగా ఈ విషయాన్ని బుధవారం వెల్లడించింది. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో విదేశీ నిధులను ఆకర్షించేందుకు ఆర్‌బీఐ ఈ మే నెలలో నిర్వహించిన ద్రవ్యపరపతి సమీక్షలో భాగంగా కీలక నిర్ణయాలు ప్రకటించింది. మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో కూడిన ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్ల సమీకరణలో బ్యాంక్‌ల పూర్తి హెడ్జింగ్ ఖర్చులను భరించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. అలాగే, ప్రభుత్వ సంస్థల విదేశీ రుణాల సమీకరణలో ఫారెక్స్ మార్పిడిపై రాయితీని సైతం కల్పించడంతోపాటు పలు చర్యలను చేపట్టింది. జూన్ 8 నుంచి ఈ రాయితీ వసతులు అమల్లోకి వచ్చాయి. ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) నుంచి విదేశీ కరెన్సీ రూపంలోనే నిధులు సమీకరించేందుకు బ్యాంక్‌లు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకమే ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్. ఈ పథకాల ద్వారా ప్రవాసులు తమ సొమ్మును భారత కరెన్సీలోకి మార్చుకోవాల్సిన అవసరం లేకుండా విదేశీ కరెన్సీ రూపంలోనే పొదుపు చేసుకోవడంతోపాటు వడ్డీ ఆర్జించే వెసులుబాటు ఉంటుంది.
మొత్తం రూ.12.96 లక్షల కోట్ల రాక
ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లతోపాటు ఓవర్సీస్ ఫారిన్ కరెన్సీ బారోయింగ్స్(ఓఎ్‌ఫసీబీ), ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్(ఈసీబీ) ద్వారా ఈ ఆగస్టు 31 నాటికి మొత్తం 13,637.7 కోట్ల డాలర్ల (సుమారు రూ.12.96 లక్షల కోట్లు) విదేశీ నిధులు వచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది. అందులో ఓఎ్‌ఫసీబీల ద్వారా 526 కోట్ల డాలర్లు (రూ.49,970 కోట్లు), ఈసీబీల ద్వారా మరో 389.1 కోట్ల డాలర్లు (రూ.36,965 కోట్లు) వచ్చి చేరాయి. ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లకు అనూహ్య స్పందన లభించడంతో ఆర్‌బీఐ ఈ వసతి గడువును తొలుత ప్రకటించిన సెప్టెంబరు 30 నుంచి ఆగస్టు 31కి కుదించింది. ఈసీబీ, ఓఎ్‌ఫసీబీలకు ఫారెక్స్ రాయితీ వసతి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..