Share News

ఆ బాధ్యత కంపెనీలదే.. లేఆఫ్స్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఆందోళన

ABN , Publish Date - Apr 05 , 2026 | 09:16 PM

ఐటీ రంగంలో లేఆఫ్స్‌పై ఉద్యోగుల సంఘం NITES ఆందోళన వ్యక్తం చేసింది. లేఆఫ్స్‌కు బదులు కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాలు పెంచడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

ఆ బాధ్యత కంపెనీలదే.. లేఆఫ్స్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఆందోళన
NITES IT layoffs India

ఇంటర్నెట్ డెస్క్: టెక్ రంగంలో లేఆఫ్స్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆందోళన వ్యక్తం చేసింది. లేఆఫ్స్‌కు బదులు కంపెనీలు తమ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని కోరింది. వైట్ కాలర్ ఉద్యోగాలకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు తప్పనిసరిగా పరిహారాలు చెల్లించి, ఇతర రక్షణలు కల్పించాలని సూచించింది. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ ఐటీ రంగంలో అనిశ్చితి, లేఆఫ్స్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో NITES ఈ మేరకు సూచించింది.

‘ముందు కంపెనీలు తమ బాధ్యతలను తెలుసుకోవాలి. ఏఐపై పెట్టుబడి పెట్టేటప్పుడు ఉద్యోగుల రీస్కిల్లింగ్‌‌పై కూడా దృష్టిసారించాలి’ అని సంఘం ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా మీడియాతో అన్నారు. చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే లేఆఫ్స్‌ను ఎంచుకోవాలని కంపెనీలకు సూచించారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో త్వరగా జోక్యం చేసుకోవాలని అన్నారు. లేఆఫ్స్‌కు సంబంధించి పని ప్రదేశాల్లో పక్కాగా నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తప్పనిసరిగా నోటీస్ పీరియడ్స్, న్యాయమైన పరిహారాలు దక్కేలా చర్యలు ఉండాలని అన్నారు.


‘భారత్‌లో ప్రైవేటు రంగంలోని వైట్ కాలర్ ఉద్యోగులకు రక్షణ లేదు. లేఆఫ్స్, నోటీస్ పీరియడ్స్, పరిహారం తదితర అంశాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేవు’ అని అన్నారు. ఉద్యోగులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. అన్యాయమైన లేఆఫ్స్ నుంచి ఉద్యోగులకు రక్షణ కల్పించే విధివిధానాల రూపకల్పన కోసం తమ సంఘం కృషి చేస్తోందని అన్నారు.

గత కొన్ని నెలలుగా అనేక బడా ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో లేఆఫ్స్‌కు దిగిన విషయం తెలిసిందే. ఒరాకిల్, గూగుల్, మెటా వంటి సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. ముఖ్యంగా ఉద్యోగులను తొలగించే సమయంలో కంపెనీలు కఠినంగా వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.


ఈ వార్తలూ చదవండి:

కార్పొరేట్‌ ఎఫ్‌డీ.. రిస్కే.. కానీ రిటర్ను అధికం

ఫార్మా ఎగుమతులు రూ.2.6 లక్షల కోట్లు

Updated Date - Apr 05 , 2026 | 09:24 PM