Share News

ఫార్మా ఎగుమతులు రూ.2.6 లక్షల కోట్లు

ABN , Publish Date - Apr 05 , 2026 | 03:26 AM

గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) ఫిబ్రవరి ముగిసే నాటికి భారత ఫార్మా ఎగుమతులు 2,800 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.2.6 లక్షల కోట్లు) నమోదైనట్లు...

ఫార్మా ఎగుమతులు రూ.2.6 లక్షల కోట్లు

ఫార్మెక్సిల్‌ డీజీ రాజ భాను

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) ఫిబ్రవరి ముగిసే నాటికి భారత ఫార్మా ఎగుమతులు 2,800 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.2.6 లక్షల కోట్లు) నమోదైనట్లు ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మెక్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ కే రాజ భాను వెల్లడించారు. శనివారం నాడిక్కడ ఫార్మా ఎగుమతుల పెంపు కోసం నిర్వహించిన చింతన్‌ శివిర్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఎగుమతుల్లో 5.6 శాతానికి పైగా వృద్ధి నమోందన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరం ఎగుమతుల వివరాలు వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. 2024-25లో ఫార్మా ఎగుమతులు 9.4 శాతం వృద్ధి చెంది 3,047 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కాగా ప్రస్తుతం ఫార్మా పరిశ్రమ విలువ 6,000 కోట్ల డాలర్లుగా ఉందని, 2030 నాటికి ఇది 13,000 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఫార్మా వృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నుంచి ఫార్మా పరిశ్రమ ఎలాంటి ఆటంకాలు ఎదుర్కొనకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. చింతన్‌ శివిర్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కీలక ముడి పదార్దాల దిగుమతులపై దేశీయ ఫార్మా కంపెనీలు ఆధారపడకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏపీఐలు, బల్క్‌ డ్రగ్స్‌, ఇంటర్మీడియెట్స్‌ దేశీయంగా 80-90 శాతం వరకు తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందుకనుగుణంగానే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ)ను ఇస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 03:26 AM