బడ్జెట్ 2026.. స్వీట్ కాకుండా.. పెరుగు, చక్కెర ఎందుకు తినిపించినట్లు?
ABN , Publish Date - Feb 01 , 2026 | 10:50 AM
పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 01: పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఆదివారం) ప్రవేశపెట్టనున్నారు. ఈ రోజు ఉదయం పార్లమెంట్‌కు వెళ్లే ముందు రాష్ట్రపతి భవన్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెళ్లారు. బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్రమంత్రి అందచేశారు. ఈ సందర్భంగా పెరుగుతో పంచదార(దహి-చీనీ) కలిపి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్రపతి ముర్ము స్వయంగా తినిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే పార్లమెంట్‌లో బడ్జెట్ పత్రాలు సమర్పించే ముందు రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి వెళ్లడం.. వారికి రాష్ట్రపతి స్వీట్ తినిపించడం దశాబ్దాలుగా ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం నిర్మలా సీతారామన్‌కు రాష్ట్రపతి పంచదార కలిపిన పెరుగు తినిపించడం వెనుక ఏమైనా ఆంతర్యం ఉందా? అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే.. పెరుగు, చక్కెర రెండు శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతిరూపాలే. ఇంకా చెప్పాలంటే.. శుభకార్యాలు చేపట్టే సమయంలో కానీ.. మంచి విషయాలు విన్న సందర్భంలోనూ తీపి పదార్థాలను తినిపిస్తారు. అంటే అదృష్టం కలగాలని.. శుభం జరగాలని ఆశీస్సులు అందిస్తూ వీటిని తినిపిస్తుంటారు.
పెరుగు.. మహాలక్షీకి ప్రతిరూపంగా భావిస్తారు. పెరుగు తెలుపు వర్ణంలో ఉంటుంది. ఇది సాత్వికతకు, లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. పెరుగు.. పాల నుంచి వస్తుంది. పాలు లక్ష్మీదేవి స్థిర నివాసంతో పాటు సంపదను సూచిస్తుంది. లక్ష్మీ పూజలో పెరుగును నైవేద్యంగా సమర్పించడం అనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. చక్కెర.. చెరకుగడ నుంచి వస్తుంది. తీపి, వ్యవసాయ అభివృద్ది, సమృద్దికి చెరకుగడ ప్రతీకగా నిలుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. లక్ష్మీదేవికి గుర్తుగా చెరకుగడను సూచిస్తారు.
అంటే అష్టలక్ష్మిల్లో ఒకరైన ధాన్యలక్ష్మి చేతిలో చెరకుగడ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే.. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అలాంటి దేశంలో వ్యవసాయం, దానిపై ఆధారపడిన అన్ని రంగాలతో పాటు పాడి పరిశ్రమ స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో చక్కెరతో పెరుగును కలిపి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తినిపించడం వెనుక ఉద్దేశమని చెబుతున్నారు.
మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లో వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్‌ను కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెడుతున్నారు. ఒక మహిళగా నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. ఇదే వేగంతో.. ఇదే ఉత్సాహంతో.. దేశ పురోగతిలో కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తూ.. రాష్ట్రపతి ఈ పదార్థాలను తినిపించినట్లు భావించవచ్చు.