స్టాక్ మార్కెట్లో లాభాల తగ్గుదల అందుకే: మంత్రి నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:25 AM
ద్రవ్యలభ్యత పెరగడం, సులువుగా మార్కెట్ నుంచి తప్పుకోగలిగే అవకాశం ఉండటంతో భారత స్టాక్ మార్కెట్లో కొంత వరకూ లాభాలు తగ్గుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: స్టాక్ మార్కెట్లో లాభాల తగ్గుదలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యలభ్యత పెరగడం, మార్కెట్ నుంచి మదుపర్లు సులువుగా తప్పుకోగలిగే అవకాశం ఉండటంతో కొంత వరకూ లాభాలు తగ్గుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. మార్కెట్లో లాభాలు తగ్గినా దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు మాత్రం బలంగానే ఉన్నాయని చెప్పారు.
ఈ ఏడాది ప్రామాణిక సూచీలు ఇప్పటివరకూ 12 శాతం మేర పడిపోయిన విషయం తెలిసిందే. విదేశీ మదుపర్లు దేశీ మార్కెట్ల నుంచి నిధులు భారీగానే వెనక్కు తీసుకున్నారు. ఇది ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద రిస్క్ల్లో ఒకటని మంత్రి సీతారామన్ తెలిపారు. ‘ఏఐ వల్ల యూఎస్ వైపు పెట్టుబడులు మళ్లుతున్నాయి. లేకపోతే ఇవి వివిధ దేశాల్లోని వివిధ రంగాల వైపు మళ్లేవి. ఇది కాస్త ఆందోళన కలిగించేదే’ అని అన్నారు. ఒక వేళ ఏఐ బూమ్‌లో ఒడుదొడుకులు వస్తే భారత్ మార్కెట్ భద్రంగా ఉంటుందని చెప్పారు. సెమీకండక్టర్ వంటి అత్యాధునిక రంగాల్లో భారత్ ఎంతమాత్రం వెనుకంజలో లేదని మంత్రి చెప్పారు. ఈ రంగంలో భారత్ భారీగా పెట్టుబడులు పెడుతోందని అన్నారు.
విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నప్పటికీ దేశీ మదుపర్లు మాత్రం తమ పెట్టుబడులను మార్కెట్లలోకి మళ్లిస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ప్రకారం, 2021 మొదలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నెలనెలా నికరంగా పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏఐలోకి పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. అయితే, ఏఐయేతర మార్కెట్స్‌లో భారత్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఇక ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా ఉన్న తైవాన్, దక్షిణ కొరియాలో కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
పండుగ వేళ ధరల యూటర్న్.. ఎంత పెరిగాయంటే..