‘ఎన్‌సీసీ’పై ఎన్‌హెచ్‌ఏఐ వేటు
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:22 AM
భారత జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ).. ఎన్‌సీసీ లిమిటెడ్‌కి పెద్ద షాకిచ్చింది. ఎన్‌సీసీతో పాటు అనుబంధ సంస్థ అయిన ఓబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఓబీఐఎల్)ను...
రెండేళ్ల పాటు నిషేధం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ).. ఎన్‌సీసీ లిమిటెడ్‌కి పెద్ద షాకిచ్చింది. ఎన్‌సీసీతో పాటు అనుబంధ సంస్థ అయిన ఓబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఓబీఐఎల్)ను రెండేళ్ల పాటు తనకు సంబంధించిన ఎలాంటి టెండర్లు, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా నిషేధించింది. ఈ నెల 17వ తేదీ నుంచే ఈ నిషేధం అమల్లోకి వచ్చినట్టు ఎన్‌సీసీ లిమిటెడ్ రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. తన అనుబంధ సంస్థ ఓబీఐఎల్ బీఓటీ పద్దతిలో ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన ఒక రహదారి ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిషేధం విధించినట్టు ఎన్‌సీసీ తెలిపింది.
ఎన్‌హెచ్‌ఏఐదే ఆలస్యం: ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించి ఇవ్వడంలో ఎన్‌హెచ్‌ఏఐ ఆలస్యం చేయడం వల్లే ఈ ఆలస్యం జరిగిందని ఎన్‌హెచ్‌ఏఐపై ఎన్‌సీసీ ఆర్బిట్రేషన్‌కు కూడా వెళ్లింది. ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ 2024 నవంబరులో దీనిపై ఎన్‌సీసీకి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. అయినా ఎన్‌హెచ్‌ఏఐ దీన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నా.. ఎన్‌హెచ్‌ఏఐ ఏకపక్షంగా నిషేధ నిర్ణయం తీసుకుందని ఎన్‌సీసీ రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది.
షేరు ధరలో ఆటుపోట్లు: ఈ వార్తలతో గురువారం స్టాక్ మార్కెట్లో ఎన్‌సీసీ షేరు తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. బీఎ్‌సఈలో ఇంట్రాడేలో ఒక దశలో 10 శాతం వరకు నష్టపోయింది. ఈ నిషేధం ప్రభావం తమ ఆర్థిక పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపదని కంపెనీ ప్రకటించడంతో షేరు కోలుకుని చివరికి 0.87 శాతం స్వల్ప లాభంతో రూ.150.75 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం