Share News

వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్ను మార్పులివే..

ABN , Publish Date - Feb 08 , 2026 | 02:19 AM

2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అనేక పన్ను మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్య తరగతికి ఎలాంటి ఉపశమనం లేకపోయినా, పన్నుల విధానంలో పలు మార్పులు చేశారు....

వచ్చే ఆర్థిక సంవత్సరంలో  పన్ను మార్పులివే..

2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అనేక పన్ను మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్య తరగతికి ఎలాంటి ఉపశమనం లేకపోయినా, పన్నుల విధానంలో పలు మార్పులు చేశారు. ముఖ్యంగా ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను (ఐటీ) చట్టం, 2025 అమల్లోకి వస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌, వివాదాల పరిష్కారం మరింత సులభం అవుతుందని మంత్రి తెలిపారు. దీనికి తోడు ఈ బడ్జెట్‌లో పేర్కొన్న పది ప్రధాన అంశాలు వ్యక్తిగత, వ్యాపార పన్ను చెల్లింపుదారులను ప్రభావితంచేయనున్నాయి. అవేంటంటే.. ?

విదేశాల్లో విద్య, వైద్యం

ఏటా లక్షలాది మంది భారతీయులు విద్య, వైద్యం కోసం విదేశాలకు వెళుతున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చవుతోంది. ఈ మొత్తాలపై ప్రభుత్వం 5 శాతం టీసీఎస్‌ వసూలు చేస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి పన్నును 2 శాతానికి కుదిస్తున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్‌ తెలిపారు. డాలర్‌తో రూపాయి మారకం రేటు రోజురోజుకు పతనమవుతున్న ప్రస్తుత తరుణంలో విదేశాల్లోని తమ పిల్లల చదువులు, వైద్య ఖర్చుల కోసం డబ్బులు పంపే వారికి ఇది పెద్ద ఊరటనే చెప్పాలి.

ఎఫ్‌ అండ్‌ ఓపై బాదుడు

స్టాక్‌ మార్కెట్లో స్పెక్యులేషన్‌ ట్రేడింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చిన్న, రిటైల్‌ మదుపరులు సైతం ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌లోకి ప్రవేశించి భారీగా నష్టపోతున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు బడ్జెట్‌లో ఈక్విటీ ఫ్యూచర్స్‌ లావాదేవీలపై విధించే సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ)ను 0.02 శాతం నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్‌పై విధించే ఎస్‌టీటీని 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెంచేశారు. దీంతో ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ భారంగా మారి రిటైల్‌ మదుపరులు దీనికి దూరమవుతారని ఆర్థిక మంత్రి ఆశ.


ఎన్‌ఆర్‌ఐల నుంచి ఆస్తుల కొనుగోలు

ఇప్పటివరకు దేశ పౌరులు ఎవరైనా ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) నుంచి ఆస్తులు కొనాలంటే ట్యాక్స్‌ డిడక్షన్‌ అండ్‌ కలెక్షన్‌ అకౌంట్‌ నంబర్‌ (టీఏఎన్‌) పొందాల్సి వచ్చేది. ఇందుకు చాలా సమయం పట్టి ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కూడా ఆలస్యమయ్యేది. బడ్జెట్‌లో చేసిన మార్పులతో ఇక కొనుగోలుదారు తమ పాన్‌ నంబరు ద్వారానే ఈ మొత్తాన్ని మినహాయించుకోవచ్చు. ఎన్‌ఆర్‌ఐల ఆస్తులు కొనేవారికి ఈ కొత్త నిబంధన చాలా మేలు చేయనుంది.

విదేశీ ఆస్తుల వెల్లడి

విదేశీ ఆస్తులు, ఆదాయాల వివరాలను బయట పెట్టేందుకు ఆర్థిక మంత్రి తన కొత్త బడ్జెట్‌లో ఆరు నెలల గడువు ఇచ్చారు. చిన్న పన్ను చెల్లింపుదారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్‌ఆర్‌ఐలే లక్ష్యంగా ఆర్థిక మంత్రి ఈ వెసులుబాటు కల్పించారు. వెల్లడించని ఆస్తులు లేదా ఆదాయాల విలువ రూ.కోటి లోపు ఉంటే 30 శాతం ట్యాక్స్‌, 30 శాతం పెనాల్టీ కట్టి ప్రాసిక్యూషన్‌ నుంచి తప్పించుకోవచ్చు. పన్ను చెల్లించినప్పటికీ, రిటర్నుల్లో వెల్లడించని ఆస్తులు లేదా ఆదాయాల విలువ రూ.5 కోట్ల వరకు ఉంటే రూ.లక్ష చెల్లించి వాటిని క్రమబద్దీకరించుకోవచ్చు.

ఐటీఆర్‌ డెడ్‌లైన్‌

ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2 ఫైలింగ్‌ డెడ్‌లైన్లలో ఎలాంటి మార్పు లేదు. ఏటా జూలై నెలాఖరు కల్లా ఈ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి. ఆడిట్‌ అవసరం లేని చిన్న చిన్న వ్యాపార సంస్థలు, ట్రస్టులు మాత్రం ఆగస్టు నెలాఖరు వరకు ఫైల్‌ చేయవచ్చు.

సవరించిన ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌

చాలా మంది తమ ఐటీ రిటర్న్‌లు ఆలస్యంగా లేదా తప్పులతో ఫైల్‌ చేస్తుంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇలాంటి పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌ ఫైలింగ్‌ గడువు ముగిసిన 9 నెలల(డిసెంబరు)లోపు తమ రిటర్న్‌లను లేదా సవరించిన రిటర్న్‌లను కొద్దిపాటి పెనాల్టీ చెల్లించి ఫైల్‌ చేయవచ్చు. కొత్త ఐటీ చట్టంతో తప్పుల తడకలతో రిటర్న్‌ ఫైల్‌ చేసిన వారు ఇక 12 నెలల్లోపు(ఆపై ఏడాది మార్చిలోగా) సవరించిన రిటర్న్‌ ఫైల్‌ చేయవచ్చు. ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసేవారికి మాత్రం ఎలాంటి ఊరట లేదు. వీరు గడువు ముగిసిన తొమ్మిది నెలల్లోగా పెనాల్టీతో కలిపి రిటర్నులను ఫైల్‌ చేయాల్సిందే.


షేర్ల బైబ్యాక్‌లు

షేర్ల బైబ్యాక్‌ల కోసం కంపెనీలు ఖర్చు చేసే మొత్తాన్ని మూలధన లాభాలుగా పరిగణించి కార్పొరేట్‌ ప్రమోటర్ల మీద 22 శాతం, నాన్‌-కార్పొరేట్‌ ప్రమోటర్ల మీద 30 శాతం పన్ను విధించనున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో వ్యక్తిగత ఇన్వెస్టర్లకు బైబ్యాక్‌లపై వచ్చే లాభాలను వారు ఆ షేర్లను ఉంచుకున్న గడువును బట్టి స్వల్ప లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధించనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో బైబ్యాక్‌ ఆఫర్లు తగ్గి పుష్కలంగా లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు ఆ మొత్తాన్ని డివిడెండ్‌లు లేదా కంపెనీల వ్యాపార విస్తరణ కోసం ఖర్చు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పన్ను చెల్లింపుదారులకు ఊరట

తక్కువ లేదా నిల్‌ డిడక్షన్‌ సర్టిఫికెట్‌ కోసం ప్రస్తుతం కొద్ది మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తులు అసెసింగ్‌ అధికారులకు అప్లికేషన్‌ పెట్టి వారి చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ బడ్జెట్‌లో దీనికి ఫుల్‌ స్టాప్‌ పెట్టారు. పన్ను చెల్లింపుదారులు ఇక ఈ సర్టిఫికెట్‌ను కొన్ని నిబంధనలకు లోబడి ఆటోమేటెడ్‌ పద్దతిలో తీసుకోవచ్చు. వివిధ కంపెనీలలో షేర్లు, డిబెంచర్లు ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఫామ్‌-15జీ, ఫామ్‌-15 హెచ్‌ తీసుకొచ్చారు.

క్రిప్టో కరెన్సీల

క్రిప్టో కరెన్సీల లావాదేవీలను ప్రభుత్వం మరింత కఠినం చేసింది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ట్రేడింగ్‌ సంస్థలు ప్రభుత్వానికి తెలియజేయాలి. లేకపోతే రోజు రూ.200 చొప్పున జరిమానా పడుతుంది. తప్పుడు వివరాలు సమర్పిస్తే రూ.50,000 వరకు జరిమానా తప్పదు. క్రిప్టో ఆదాయం లెక్కల్లోకి రావడం లేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇటీవల హెచ్చరించింది.

ఎస్‌జీబీ రూల్స్‌

సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) లాభాలనూ ఆర్థిక మంత్రి మూలధన లాభాల పన్ను పరిధిలోకి తెచ్చారు. ఇక నుంచి ఆర్‌బీఐ జారీ చేసినప్పుడు ఎస్‌జీబీలు కొని, గడువు ముగిసే (మెచ్యూరిటీ) వరకు అలాగే ఉంచుకున్న మదుపరులకు మాత్రమే మూలధన లాభాల ప న్ను మినహాయింపు లభిస్తుంది. సెకండరీ మార్కెట్లో కొని లాభాలు పొందిన వారు మాత్రం.. వారు ఆ పెట్టుబడులను ఉంచుకున్న గడువును బట్టి 20 లేదా 12.5 శాతం చొప్పున మూలధన లాభాల పన్ను చెల్లించక తప్పదు.

Also Read:

రెపో.. లేదు మార్పు

మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Updated Date - Feb 08 , 2026 | 02:19 AM