Share News

రెపో.. లేదు మార్పు

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:32 AM

బ్యాంకు రుణాలకు ప్రామాణికమైన రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. దాంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం లేకుండా పోయింది.

రెపో.. లేదు మార్పు

  • 5.25 శాతంగా కొనసాగింపు.. రేట్లపై తటస్థ వైఖరి అలాగే..

  • ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన ఆర్‌బీఐ

  • ఏప్రిల్‌ 6-8 తేదీల్లో తదుపరి సమీక్ష

ముంబై: బ్యాంకు రుణాలకు ప్రామాణికమైన రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. దాంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం లేకుండా పోయింది. ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతేకాదు, పరపతి విధానంపై తటస్థ వైఖరిని కూడా కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించింది. తద్వారా కమిటీ వడ్డీ రేట్లు మరికొంత కాలం కనిష్ఠ స్థాయిలోనే కొనసాగనున్నాయని సంకేతాలిచ్చింది.

వాణిజ్య ఒప్పందాలతో ఆర్థికానికి ఊతం: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నెల 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టాక ఆర్‌బీఐ నిర్వహించిన మొదటి పరపతి సమీక్ష ఇది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో వాణిజ్య ఒప్పందాలు కుదిరిన తర్వాత జరిగిన తొలి సమీక్ష కూడా. అంతర్జాతీయ ప్రతికూలతలు మరింత పెరిగినప్పటికీ, అమెరికా, ఈయూతో వాణిజ్య ఒప్పందాలు కుదరడం మన ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా పరిణమించనుందని ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా అన్నారు.

క్యూ1, క్యూ2 వృద్ధి అంచనాలు పెంపు: జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు, పంట దిగుబడి భారీగా పెరగడంతో పాటు అమెరికా, ఈయూతో వాణిజ్య ఒప్పందాలు కుదరిన నేపథ్యంలో ఆర్‌బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో మొదటి త్రైమాసికం (క్యూ1) జీడీపీ వృద్ధి అంచనాను 6.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. రెండో త్రైమాసిక (క్యూ2) వృద్ధి అంచనాను కూడా 6.8ు నుంచి 7 శాతానికి పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదు కావచ్చని అంచనా.


ద్రవ్యోల్బణం అంచనా కూడా పైకి: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరాని (2025-26)కి రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం అంచనాను డిసెంబరులో ప్రకటించిన 2 శాతం నుంచి 2.1 శాతానికి పెంచింది. ఈ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్న 2026 -27 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి (క్యూ1) అంచనాను 3.9 శాతం నుంచి 4 శాతానికి, రెండో త్రైమాసికానికి (క్యూ2) అంచనాను 4 శాతం నుంచి 4.2 శాతానికి పెంచింది.

రీట్స్‌కు బ్యాంక్‌ రుణాలు: రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌)లకు కూడా బ్యాంక్‌లు రుణాలిచ్చేందుకు అనుమతించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఇది రీట్స్‌ నిర్వహణ సంస్థలకు నిధుల సమీకరణ అవకాశాలను మరింత విస్తృతం చేయనుంది. తాము దీర్ఘకాలిక మూలధన నిధుల సమీకరించేందుకు ఆర్‌బీఐ తాజా ప్రతిపాదన దోహదపడనుందని రీట్స్‌ నిర్వహణ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.

చిన్న ఎన్‌బీఎ్‌ఫసీలకు ఊరట: రూ.1,000 కోట్లలోపు ఆస్తులు, ప్రజా నిధులు లేని చిన్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎ్‌ఫసీ)ను తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ నుంచి మినహాయించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఈ నిర్ణయం చిన్న ఎన్‌బీఎ్‌ఫసీలపై నిబంధనల భారాన్ని తగ్గించనుంది. సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు మార్గదర్శకాల సవరణ ముసాయిదాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు, కొన్ని ఎన్‌బీఎ్‌ఫసీలకు 1,000కి పైగా శాఖల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధనను తొలగించనున్నట్లు తెలిపింది.


బంగారం రుణాలపై ఆందోళన అక్కర్లేదు..

గడిచిన కొన్ని రోజులుగా విలువైన లోహాల ధరలు తీవ్ర ఊగిసలాటలకు లోనవుతున్నప్పటికీ, బంగారం తనఖా రుణ బకాయిల విషయంలో ఆందోళన అక్కర్లేదని మల్హోత్రా అన్నా రు. బంగారం ధరలు శరవేగంగా పెరుగుతూ వచ్చిన సమ యంలో గోల్డ్‌ లోన్స్‌ వ్యాపారం అదే స్థాయిలో వృద్ధి చెందుతూ వచ్చింది. 2025 నవంబరుతో ముగిసిన రెండేళ్లలో బంగారం తనఖారుణాల బకాయిలు దాదాపు రెండింతలయ్యాయి.

డిజిటల్‌ మోసాల బాధితులకు రూ.25,000 వరకు పరిహారం

దేశంలో డిజిటల్‌ మోసాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మోసపూరిత లావాదేవీ బాధిత బ్యాంక్‌ కస్టమరుకు రూ.25,000 వరకు పరిహారం చెల్లించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. మోసగాళ్లతో ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌) పంచుకున్న బాధిత కస్టమర్లకూ పరిహారం చెల్లించడం జరుగుతుందని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. రూ.85,000 కోట్ల డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ఫండ్‌ నుంచి ఈ పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. డిజిటల్‌ మోసాల బాధితులకు జీవితంలో ఒక్కసారే ఈ పరిహారం లభిస్తుందని, ఇందులో ఎలాంటి దురుద్దేశం కనబడని పక్షంలోనే పరిహారానికి అర్హులని ఆర్‌బీఐ అధికారులు స్పష్టం చేశారు. మెజారిటీ డిజిటల్‌ మోసాల బాధితులు ఈ ప్రతిపాదనతో లబ్ధి పొందనున్నారని ఆర్‌బీఐ అంటోంది. ఎందుకంటే, మూడింట రెండొంతుల డిజిటల్‌ మోసాల విలువ రూ.50,000 లోపేనని పేర్కొంది. ఒకవేళ మోసపోయిన మొత్తం రూ.25,000 లోపే అయినప్పటికీ, అందులో 15 శాతం బ్యాంక్‌ ఖాతాదారే భరించాల్సి ఉంటుందని, అధిక మొత్తంలో మోసపోయిన వారికి మాత్రం గరిష్ఠంగా రూ.25,000 పరిహారం చెల్లించడం జరుగుతుందని ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాల ముసాయిదాను త్వరలోనే విడుదల చేసి, ప్రజాభిప్రాయాలను కోరనున్నట్లు ఆయన చెప్పారు. డిజిటల్‌ మోసాలను అరికట్టేందుకు అదనపు భద్రత సాధనాలను ప్రవేశపెట్టనున్నట్లు మల్హోత్రా తెలిపారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి నెమ్మదిగా నగదు జమ చేయడం, సీనియర్‌ సిటిజన్లు ఈ మోసాల బారిన పడకుండా ఉండేందుకు వీరు బ్యాంక్‌ లావాదేవీలు నెరిపే సమయంలో అదనపు ధ్రువీకరణను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.

ఎంఎ్‌సఎంఈలకు రూ.20 లక్షల తనఖా రహిత రుణం

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ)కు తనఖా రహిత రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ మల్హోత్రా ప్రకటించారు. ఎంఎ్‌సఎంఈ రుణగ్రహీతలకు 2026 ఏప్రిల్‌ 1న లేదా ఆ తర్వాత మంజూరైన లేదా పునరుద్ధరించబడిన అన్ని రుణాలకు ఇది వర్తిస్తుందన్నారు. ఇందు కు సంబంధించి త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.

దీర్ఘకాలంపాటు చవక రేట్లే..!

రెపో రేటు దీర్ఘకాలం పాటు కనిష్ఠ స్థాయిలోనే కొనసాగనుంది. భవిష్యత్‌లో మరింత తగ్గేందుకూ అవకాశం ఉంది. అయితే, రెపో రేటు సవరణపై మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అమెరికా, ఈయూతో కుదిరిన వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇతర సానుకూల అంశాలు 0.20 శాతం అదనపు జీడీపీ వృద్ధికి దోహదపడవచ్చు.

- సంజయ్‌ మల్హోత్రా, ఆర్‌బీఐ గవర్నర్‌

Updated Date - Feb 07 , 2026 | 03:32 AM