నవంబరు వరకు హోర్ముజ్ గండం
ABN , Publish Date - May 18 , 2026 | 03:24 AM
హోర్ముజ్ జలసంధి దిగ్బంధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించటం లేదని మూడీస్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. వచ్చే శరదృతువు (అక్టోబరు-నవంబరు) వరకు...
4.5 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
జీడీపీ వృద్ధి రేటుకూ చమురు సెగ
మూడీస్ రేటింగ్స్
న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి దిగ్బంధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించటం లేదని మూడీస్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. వచ్చే శరదృతువు (అక్టోబరు-నవంబరు) వరకు ఈ దిగ్భందం కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో భారత్‌తో పాటు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రధాన దేశాల జీడీపీ వృద్ధి రేటు కూడా 0.2 శాతం నుంచి 0.8 శాతం తగ్గే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతం నుంచి 6 శాతానికి కుదించింది. గత ఆర్థిక సంవత్సరం 3.5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతానికి ఎగబాకే ప్రమాదం ఉందని తెలిపింది. దీంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)కి ద్రవ్య పరపతి విధాన రూపకల్పన కూడా కష్టమవుతుందని మూడీస్ అంచనా వేసింది.
ద్వైపాక్షిక చర్చలతో..
అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా హోర్ముజ్ జలసంఽధిని తెరిచేలా ఒప్పించుకునే అవకాశం ఉందని మూడీస్ తెలిపింది. మార్చి నుంచి ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఆ ప్రాంతం నురచి జరిగే 90 శాతం నౌకా రవాణ ఆగిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 46 శాతం హోర్ముజ్ జలసంధి ద్వారానే వస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. హోర్ముజ్ జలసంధిని తెరిచే వరకు బ్యారల్ బ్రెంట్ రకం ముడి చమురు ధర 90 నుంచి 110 డాలర్ల మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్ కంపెనీగా టీసీఎస్
బంగారంలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్, ఈజీఆర్‌లు