Microsoft Layoffs: మళ్లీ లేఆఫ్స్ భయాలు.. మైక్రోసాఫ్ట్ వివరణ
ABN , Publish Date - Jan 08 , 2026 | 08:41 PM
ఈ జనవరిలో మరో 22 వేల మంది ఉద్యోగుల వరకూ మైక్రోసాఫ్ట్ తొలగించనుందన్న వార్తలు వైరల్ కావడంతో సంస్థ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఏడాదిలో మళ్లీ మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్ మొదలవుతాయన్న వార్త ప్రస్తుతం ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. అయితే, పరిస్థితి అదుపు తప్పక ముందే మైక్రోసాఫ్ట్ స్పందించింది. కంపెనీకి చెందిన చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఎక్స్ వేదికగా ఈ వార్తలపై స్పందించారు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. లేఆఫ్స్‌కు సంబంధించి ఎలాంటి చర్చలు ప్రస్తుతానికి లేవని స్పష్టం చేశారు (Microsoft Reacts to LayOffs Claims).
ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతున్న వార్తల ప్రకారం, మైక్రోసాఫ్ట్ జనవరిలో 11 వేల మంది నుంచి 22 వేల మంది ఉద్యోగుల వరకూ తొలగించే అవకాశం ఉంది. సంస్థకు చెందిన పలు విభాగాల్లో లేఆఫ్స్ ఉంటాయని వార్తలు వెలువడ్డాయి. అజూర్ క్లౌడ్ సర్వీసెస్ విభాగం, ఎక్స్ బాక్స్ గేమింగ్ డివిజన్, గ్లోబల్ సేల్స్ యూనిట్‌లో తొలగింపులు ఉంటాయన్న వార్త వైరల్‌గా మారింది. కృత్రిమ మేధపై భారీగా వెచ్చిస్తున్న సంస్థ ఖర్చులను తగ్గించుకునేందుకు లేఆఫ్స్‌కు సిద్ధమైందనేది వార్త సారాంశం. లేఆఫ్స్ భయాలు టెక్ రంగంలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తారన్న వార్త విని అనేక మంది కంగారు పడ్డారు. దీంతో, కలకలం రేగింది. ఈ నేపథ్యంలో చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ రంగంలోకి దిగి లేఆఫ్స్ వార్తలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.
గతేడాది జులైలో మైక్రోసాఫ్ట్ 9 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. గేమ్ బిజినెస్ సహా పలు విభాగాల్లో తొలగింపులు చోటుచేసుకున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు సంస్థ అప్పట్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మరోసారి లేఆఫ్స్ వార్త కలకలం రేపుతుండటంతో మైక్రోసాఫ్ట్ అధికారి ఎక్స్ వేదికగా వదంతులకు చెక్ పెట్టారు.
ఇవీ చదవండి:
ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7.4 శాతం
Indian Silver Policy: వెండి దిగుమతుల విధానం మారాలి