హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:31 AM
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం మెక్రోసాఫ్ట్.. భారత్‌లో తన నాలుగో క్లౌడ్ రీజియన్‌ను హైదరాబాద్‌లో సోమవారం అధికారికంగా ప్రారంభించింది. భారత్‌లో డిజిటల్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక వసతుల...
అధికారికంగా ప్రారంభించిన సంస్థ
భారత్‌లో కంపెనీకిది నాలుగో కేంద్రం
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం మెక్రోసాఫ్ట్.. భారత్‌లో తన నాలుగో క్లౌడ్ రీజియన్‌ను హైదరాబాద్‌లో సోమవారం అధికారికంగా ప్రారంభించింది. భారత్‌లో డిజిటల్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక వసతుల అభివృద్ధి కోసం కంపెనీ గతంలో ప్రకటించిన 2,050 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.95 లక్షల కోట్లు) పెట్టుబడుల ప్రణాళికలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కంపెనీకి భారత దక్షిణ మధ్య క్లౌడ్ రీజియన్ అయిన ఈ కేంద్రం.. గత నెల 6వ తేదీనే అందుబాటులోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పుణె, చెన్నై, ముంబైలో క్లౌడ్ రీజియన్‌లను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ క్లౌడ్ రీజియన్‌లో కూలింగ్ కోసం నీటికి బదులు ఎయిర్ కూల్డ్ చిల్లర్స్‌పై ఆధారపడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. దేశంలో అతిపెద్ద హైపర్‌స్కేల్ క్లౌడ్ సేవల కేంద్రం ఇదేనని ఆయన అన్నారు.
మూడు జోన్లుగా నిర్మాణం
హైదరాబాద్ క్లౌడ్ రీజియన్‌ను మైక్రోసాఫ్ట్ మూడు జోన్ల ఆర్కిటెక్చర్‌తో అభివృద్ధి చేసింది. మిషన్ క్రిటికల్, ఏఐ వర్క్‌లోడ్స్‌కు మద్దతిచ్చేలా డిజైన్ చేసింది. భారత్‌లోని తమ అన్ని డేటా సెంటర్లు ఏఐ ఎనేబుల్డ్, ఏఐ క్యాపబుల్ హార్డ్‌వేర్, అధిక సామర్థ్యంతో కూడిన కూలింగ్ వ్యవస్థలను కలిగి ఉండటంతో పాటు ఆధునిక ఏఐ వర్క్‌లోడ్స్ నిర్వహణకు అనుకూలంగా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. హైదరాబాద్ కేంద్రంలో అదనంగా అజుర్, ఏఐ సేవలందించే ఆలోచన ఉందని సంస్థ వెల్లడించింది.
విద్యుత్ కేంద్రాలకు దగ్గర్లో డేటా సెంటర్లు
భారత్‌లో భవిష్యత్ డేటా సెంటర్లను విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సమీపంలో ఏర్పాటు చేయాలని మైక్రోసా్‌ఫ్టను కేంద్ర ప్రభుత్వం కోరింది. తద్వారా కంపెనీతో పాటు ప్రభుత్వానికి ఖర్చులు తగ్గుతాయని హైదరాబాద్ క్లౌడ్ రీజియన్‌ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు.
మానవ సేవ కోసమే ఏఐ అభివృద్ధి..
కృత్రిమ మేధ సాంకేతికత భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ చందోక్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ సేవ కోసం మాత్రమే ఏఐని అభివృద్ధి చేయాలని, ఈ సాంకేతికతపై నియంత్రణ ఎల్లప్పుడూ మన చేతుల్లోనే ఉండాలని మైక్రోసాఫ్ట్ గట్టిగా నమ్ముతుందన్నారు.
2035 నాటికి 12-14 గిగావాట్లకు డేటా సెంటర్ల సామర్థ్యం
ప్రస్తుతం భారత్ 2 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లను కలిగి ఉందని.. 2035 నాటికిది 12-14 గిగావాట్లకు చేరుకోవచ్చని పునీత్ చందోక్ అన్నారు. ఆసియాతో పాటు దక్షిణార్ధ గోళానికి భారత్ ఏఐ మౌలిక వసతు ల హబ్‌గా అవతరించనుందని పేర్కొన్నారు. ప్రపంచ డేటాలో 20 శాతం భారత్ నుంచే ఉత్పన్నమవుతుండగా.. ప్రపంచ డేటా సెంట ర్ల సామర్థ్యంలో ఇండియా వాటా కేవలం 3 శాతమేనని చందోక్ వెల్లడించారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే, భారత్‌లో డేటా సెంటర్ల సామర్థ్య విస్తరణకు భారీగా అవకాశాలున్నాయన్నారు. కాగా, భారత పబ్లిక్ క్లౌడ్ సేవల వ్యయాలు 2030 నాటికి 4,570 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని, ఏటేటా 22.2 శాతం వృద్ధి చెందవచ్చని పరిశోధన సంస్థ ఐడీసీ అంచనా వేసింది. ఏఐ వ్యయాలు ఇంతకు రెట్టింపు స్థాయిలో పెరగవచ్చని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..
హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..