మారుతి సుజుకీ లాభం రూ.3,659 కోట్లు
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:42 AM
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.3,659 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని...
క్యూ4 లాభంలో 6.45% తగ్గుదల 8 ఒక్కో షేరుకు రూ.140 డివిడెండ్
న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.3,659 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన లాభం రూ.3,911.1 కోట్లతో పోల్చితే 6.45 శాతం తగ్గింది. రికార్డు స్థాయిలో వాహనాల అమ్మకాలు నమోదైనప్పటికీ మార్క్-టు-మార్కెట్ ప్రభావం వల్ల లాభాలు తగ్గినట్టు కంపెనీ పేర్కొంది. నిర్వహణేతర ఆదాయం కూడా తగ్గినట్టు తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం రాబడి 28.2 శాతం పెరిగి రూ.52,462.5 కోట్లకు చేరుకుంది. మొదటిసారిగా నాలుగో త్రైమాసికంలో నికర అమ్మకాలు రూ.50,000 కోట్ల మైలురాయిని అధిగమించినట్టు కంపెనీ తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం వ్యయాలు రూ.37,585.5 కోట్ల నుంచి రూ.48,125.3 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ అత్యధిక త్రైమాసిక అమ్మకాలను (6,76,209 యూనిట్లు) నమోదు చేసింది. కాగా కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2025-26 సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.140 డివిడెండ్‌ను సిఫారసు చేసింది.
2025-26లో రూ.1.83 లక్షల కోట్ల రాబడి
మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి మారుతి సుజుకీ కన్సాలిడేటెడ్ నికర లాభం 1.24 శాతం పెరిగి రూ.14,679.5 కోట్లకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.14,500.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.1,83,316 కోట్లుగా ఉంది. 2025-26లో మొత్తం వాహనాల అమ్మకాలు 22,34,266 యూనిట్ల నుంచి 24,22,713 యూనిట్లకు పెరిగాయి. ఇందులో దేశీయ అమ్మకాలు 19,74,939 యూనిట్లు ఉన్నాయి. జీఎస్టీని తగ్గించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లో ద్వితీయార్ధంలో అమ్మకాల్లో వృద్ధి నెలకొందని కంపెనీ పేర్కొంది.
ఈ ఏడాది రూ.14,000 కోట్ల
పెట్టుబడులు
కార్లకు డిమాండ్ జోరుగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకనుగుణంగా ఉత్పత్తిని పెంచేందుకు మారుతి సుజుకీ సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.14,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఉత్పత్తి కేంద్రాల్లో సామర్థ్య వినియోగం వంద శాతాన్ని చేరుకుందని కంపెనీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ మంగళవారం తెలిపారు. సంవత్సరానికి మొత్తం 5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఖర్ఖోడా (హరియాణా), హన్సల్‌పూర్ (గుజరాత్)లలో రెండు లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఇవి చిన్న కార్ల డిమాండ్‌ను తీర్చేందుకు సహాయపడతాయన్నారు. అలాగే ఖర్ఖోడాలో యూనిట్ల ఏర్పాటును కొనసాగిస్తుండటం వల్ల పెట్టుబడుల అవసరం ఎక్కువగా ఉంటోందన్నారు. గుజరాత్‌లో కొత్త ప్రదేశంలో పని ప్రారంభిస్తున్నట్లు భార్గవ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..