Share News

మారుతి లాభం 26శాతం డౌన్‌

ABN , Publish Date - Oct 28 , 2026 | 02:25 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026-27)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం(క్యూ2)లో మారుతి సుజుకీ ఇండియా ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 26.36 శాతం తగ్గి రూ.2,466.1 కోట్లకు పరిమితమైంది

మారుతి లాభం 26శాతం డౌన్‌
maruthi

క్యూ2లో రూ.2,466 కోట్లకు పరిమితం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026-27)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం(క్యూ2)లో మారుతి సుజుకీ ఇండియా ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 26.36 శాతం తగ్గి రూ.2,466.1 కోట్లకు పరిమితమైంది. రికార్డు స్థాయిలో వాహనాల అమ్మకాలతో కంపెనీ రాబడి గణనీయంగా పెరిగినప్పటికీ పశ్చిమాసియా ఘర్షణల మూలంగా పెరిగిన ముడిసరుకుల వ్యయాలు లాభం తగ్గుదలకు కారణమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ ఆటో దిగ్గజం రూ.3,349 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కాగా, ఈ క్యూ2లో కంపెనీ రాబడి రూ.53,355.5 కోట్లకు పెరిగింది

ఇదే కాలంలో మొత్తం వ్యయాలు రూ.50,619 కోట్లకు ఎగబాకాయి. రెండో త్రైమాసికంలో వినియోగించిన ముడిసరుకుల వ్యయం రూ.37,488.5 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.25,324.2 కోట్లుగా ఉంది. సెప్టెంబరు త్రైమాసికంలో నిర్వహణ లాభం రూ.2,803.7 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన నిర్వహణ లాభం (రూ.3,382 కోట్లు)తో పోల్చితే బాగానే తగ్గింది. కంపెనీ సెప్టెంబరు త్రైమాసికంలో తన చరిత్రలోనే అత్యధికంగా మొత్తం 6,96,654 యూనిట్ల త్రైమాసిక అమ్మకాలను సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే అమ్మకాలో వృద్ధి 26.5 శాతంగా ఉంది. దేశీయ మార్కెట్‌ వాటా 40.8 శాతానికి చేరుకున్నట్టు మారుతి సుజుకీ వెల్లడించింది.


బజాజ్‌ ఆటో లాభం రూ.3,354 కోట్లు: సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి బజాజ్‌ ఆటో రూ.3,354 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన లాభం రూ.2,480 కోట్లతో పోల్చితే ఇది 35 శాతం ఎక్కువ. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి రాబడి 34 శాతం వృద్ధితో రూ.14,922 కోట్ల నుంచి రూ.20,003 కోట్లకు చేరింది.

ఎల్‌ అండ్‌ టీ లాభంలో 33 శాతం వృద్ధి: ఇంజనీరింగ్‌ దిగ్గజం లార్సన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) ఏకీకృత నికర లాభం సెప్టెంబరు త్రైమాసికంలో 32.5 శాతం పెరిగి రూ.5,202.10 కోట్లకు చేరింది. అధిక ఆదాయాలు ఇందుకు దోహదపడ్డాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.3,926.09 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షా త్రైమాసికంలో ఎల్‌ అండ్‌ టీ ఏకీకృత రాబడి వార్షిక ప్రాతిపదికన 16 శాతం పెరిగి రూ.78,750 కోట్లకు చేరుకుంది. వివిధ వ్యాపారాల్లో వేగవంతమైన పురోగతి ఇందుకు దోహదపడింది. ఈ త్రైమాసికంలో 28 శాతం వృద్ధితో కంపెనీ రూ.1,47,665 కోట్ల విలువైన ఆర్డర్లను పొందింది

ఇవి కూడా చదవండి..

భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య

రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు

Updated Date - Oct 28 , 2026 | 04:09 AM