అమ్మకాల హోరు సూచీలు బేజారు..
ABN , Publish Date - Jan 21 , 2026 | 02:21 AM
గ్రీన్‌లాండ్ స్వాధీనానికి సహకరించని దేశాలపై సుంకాల పోటు తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికల ప్రభావం వరుసగా రెండో రోజు కూడా...
సెన్సెక్స్ 1,066 పాయింట్లు డౌన్, 83,000 దిగువకు చేరిక
353 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. 25,232 వద్ద క్లోజింగ్
ఒక్క రోజే రూ.9.86 లక్షల కోట్ల మదుపరుల సంపద హాంఫట్
ముంబై: గ్రీన్‌లాండ్ స్వాధీనానికి సహకరించని దేశాలపై సుంకాల పోటు తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికల ప్రభావం వరుసగా రెండో రోజు కూడా ఈక్విటీ మార్కెట్‌ను కల్లోలితం చేసింది. పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడుల భద్రతపై అప్రమత్తమైన ఇన్వెస్టర్లు అమ్మకాలకు పరుగులు తీశారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల నుంచి కూడా ప్రతికూల పవనాలు వీచడం ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. దీనికి తోడు మన మార్కెట్ నుంచి తరలిపోతున్న విదేశీ నిధులు పరిస్థితిని మరింత బలహీనపరిచాయి.
ఇన్ని ప్రతికూలతల నేపథ్యంలో సెన్సెక్స్ 1065.71 పాయింట్లు నష్టపోయి 82,180.47 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా 1,235.6 పాయింట్లు దిగజారి 82,010.58 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. బీఎ్‌సఈలో 3,503 స్టాక్స్ నష్టాలతో ముగియగా కేవలం 780 స్టాక్స్ మాత్రమే లాభపడ్డాయి. 119 మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. నిఫ్టీ సైతం 353 పాయింట్లు నష్టపోయి 25,232.50 వద్ద ముగిసింది.
రెండు రోజుల్లో రూ.12 లక్షల కోట్ల నష్టం: మంగళవారం ఒక్క రోజే బీఎ్‌సఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.9,86,093.96 కోట్లు దిగజారి రూ.4,55,82,683.29 కోట్లకు (5.01 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. సోమవారం నాటి నష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే రెండు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.12 లక్షల కోట్ల మేరకు సంపదను నష్టపోయారు.
రూపాయి బలహీనత: ఫారెక్స్ మార్కెట్లో దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కూడా ఈక్విటీ మార్కెట్‌ను వెన్నాడుతోంది. మంగళవారం అమెరికా డాలర్ మారకంలో రూపాయి 7 పైసలు నష్టపోయి చారిత్రక కనిష్ఠ స్థాయి 90.97 వద్ద ముగిసింది. డిసెంబరు 16వ తేదీన రూపాయి ఇంట్రాడేలో చారిత్రక కనిష్ఠ స్థాయి 91.14ని నమోదు చేసింది. అమెరికా సామ్రాజ్య విస్తరణ కాంక్ష.. వర్థమాన మార్కెట్లపై ఒత్తిడిని పెంచిందని విశ్లేషకులంటున్నారు.
బడ్జెట్ ముందు అప్రమత్తత: ఫిబ్రవరి ఒకటో తేదీన కొత్త బడ్జెట్ ప్రతిపాదన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం కావడం కూడా మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది. బడ్జెట్‌పై ప్రజల్లో భారీ అంచనాలున్నాయని.. ప్రధానంగా ఆర్థిక వృద్ధిలో జోరును పెంచి, ఉపాధి అవకాశాలు కల్పించగల, కన్స్యూమర్ డిమాండును పెంచగల చర్యలు ప్రభుత్వం ప్రకటించాలని వారు కోరుకుంటున్నారని పరిశీలకులంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అటు వృద్ధిని, ఇటు విత్త కన్సాలిడేషన్‌ను సమతూకం చేసే చర్యలు ప్రకటించే ఆస్కారం ఉన్నట్టు వారు చెబుతున్నారు.
ఫోన్ పే ఐపీఓకి సెబీ గ్రీన్‌సిగ్నల్: వాల్‌మార్ట్ సారథ్యంలోని పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూకిమార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతించింది. ఎంతో కాలంగా కంపెనీ యాజమాన్యం పబ్లిక్ ఇష్యూ జారీ చేసే విషయం పరిశీలిస్తున్నదని, గత సెప్టెంబరులో కాన్ఫిడెన్షియల్ విధానంలో సెబీకి దరఖాస్తు పత్రాలు అందించిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇప్పటికే మర్చంట్ బ్యాంకర్లను కూడా నియమించుకుంది. ఈ ఇష్యూ ద్వారా ఫోన్‌పే రూ.11,000-12,000 కోట్లు సమీకరించే ఆస్కారం ఉన్నట్టు చెబుతున్నారు.
ఈ కల్లోలం ట్రంప్ పుణ్యమే...
పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రం అన్న చందంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ విధానంలో ప్రధాన సాధనంగా సుంకాలను వాడుతూ ఉండడమే కల్లోలానికి కారణమన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఆయన ధోరణి ప్రపంచంలోని ఆర్థిక మార్కెట్లన్నింటిలోనూ అసహనంతో కూడిన వాతావరణం సృష్టిస్తోంది. ఈ కారణంగా ఆటుపోట్లు పెరిగిపోయాయని, ఫలితంగా ఇన్వెస్టర్లు రిస్క్‌తో కూడిన అసెట్లను భారీగా విక్రయిస్తూ సురక్షిత పెట్టుబడి సాధనాల వైపు పరుగులు తీస్తున్నారని వారు విశ్లేషించారు. ఈ కారణంగానే ఇటీవల కాలంలో ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోతుంటే బంగారం, వెండి వంటి లోహాల ధరలు మాత్రం వెనుక చూపనేదే లేకుండా దూసుకుపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ ఆటుపోట్ల తీరుతెన్నులను తెలిపే ఇండియా వీఐఎక్స్ ఇండెక్స్ సుమారు 8 శాతానికి చేరింది. సమీప భవిష్యత్తులో మార్కెట్లో ఆటుపోట్లు కొనసాగుతాయనేందుకు ఇది సంకేతం.
ఇవీ చదవండి:
భారత్ వృద్ధి రేటు 7.3 శాతం.. ఐఎమ్ఎఫ్ అంచనా
మార్కెట్‌ను ముంచిన టారిఫ్ భయాలు