IMF India Growth Forecast: ఈ ఏడాది వృద్ధి 7.3 శాతం
ABN , Publish Date - Jan 20 , 2026 | 06:03 AM
IMF Raises India Growth Forecast for FY26 Amid Global Uncertainty
అంచనాలను భారీగా పెంచిన ఐఎంఎఫ్
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా విధించిన భారీ సుంకాల ప్రభావాన్ని కూడా తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కన్నా మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 2025-26 ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాలను గణనీయంగా పెంచింది. ఈ ఏడాది వృద్ధిరేటు 7.3ు ఉండవచ్చని తాజా నివేదికలో తెలిపింది. ఇది అక్టోబరులో ప్రకటించిన అంచనాల కన్నా 0.7ు అధికం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన అంచనాను కూడా 6.2ు నుంచి 6.4 శాతానికి పెంచింది. ఐఎంఎఫ్ సోమవారం ప్రకటించిన ప్రపంచ ఆర్థిక గమనం నివేదికలో ఈ అంశాలు ప్రస్తావించింది. ఆర్థిక రంగం మూడో త్రైమాసికంలో ఊహించిన దాని కన్నా మెరుగైన వృద్ధిని నమోదు చేయడంతో పాటు నాలుగో త్రైమాసికంలోకి బలంగా పురోగమిస్తోందని పేర్కొంది. అయితే తాత్కాలికంగా ఆర్థిక రంగానికి ఉత్తేజం కల్పిస్తున్న అంశాలు కనుమరుగైపోయి, కాలానుగుణంగా ఏర్పడే మార్పుల ప్రభావంతో 2026, 2027 సంవత్సరాల్లో వృద్ధి రేటు 6.4 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేసింది.
ప్రపంచ వృద్ధి 3.3%
ప్రపంచ వృద్ధి ఈ ఏడాది 3.3 శాతంగాను, 2027 సంవత్సరంలో 3.2 శాతంగాను ఉండవచ్చని ఐఎంఎఫ్ అంచ నా వేసింది. గతంలో ప్రకటించిన అంచనాలతో పోల్చితే 2026 అంచనా స్వల్పంగా పెంచి, 2027 సంవత్సరానికి మాత్రం స్థిరంగా ఉంచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆత్మరక్షణ వాణిజ్య విధానాలను సైతం లెక్క చేయకుండా ప్రపంచ ఆర్థిక రంగం స్థితి స్థాపకత ప్రదర్శిస్తోందని తాజా నివేదికలో పేర్కొంది. ప్రధానంగా ఉత్తర అమెరికా, ఆసియా దేశాల్లో కృత్రిమ మేధపై పెట్టుబడులు వృద్ధికి ఊతం ఇవ్వవచ్చని వ్యాఖ్యానించింది. అమెరికాలో వృద్ధి రేటు ఈ ఏడాది 2.4ు ఉండవచ్చని జోస్యం చెప్పింది. ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా సైతం 4.5ు వృద్ధి చెందవచ్చని అంచనా వేసింది. కాగా భారత్ ప్రపంచ వృద్ధికి కీలకమైన చోదకశక్తి అని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ జూలీ కొజాక్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..
మీ ఐక్యూకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..