వచ్చేస్తోంది మార్చి 31
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:42 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) త్వరలో ముగుస్తోంది. ఇంకా పది రోజుల సమయమే ఉంది. చాలా మంది ఇంకా తమ ట్యాక్స్ ప్లానింగ్ పెట్టుబడులు పూర్తి చేసి ఉండరు. ఈ పది రోజుల్లో ఈ పనులు....
ఈ పనులు పూర్తి చేశారా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) త్వరలో ముగుస్తోంది. ఇంకా పది రోజుల సమయమే ఉంది. చాలా మంది ఇంకా తమ ట్యాక్స్ ప్లానింగ్ పెట్టుబడులు పూర్తి చేసి ఉండరు. ఈ పది రోజుల్లో ఈ పనులు పూర్తి చేయక పోతే తర్వాత తిప్పలు తప్పవు. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన పనులు ఏంటంటే?
పెండింగ్ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు
జీతం కాకుండా ఫ్రీలాన్సింగ్, రెంటల్ ఆదాయం, మూలధన లాభాలు లేదా వడ్డీల రూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు అడ్వాన్స్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. నిజానికి వీరు ఈ ట్యాక్స్ ఫైనల్ ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఈ నెల 15లోగా చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా ఈ గడువులోగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించి ఉండకపోయినా లేదా తక్కువ మొత్తం చెల్లించినా పాత ఐటీ చట్టంలోని సెక్షన్ 234బీ, 234 సీ కింద వారిపై వడ్డీ బాదుడు తప్పదు. కాబట్టి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వెంటనే తమ చెల్లింపులను సమీక్షించుకుని తక్కువ చెల్లిస్తే వెంటనే చెల్లించడం మంచిది.
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడుతోంది. కాబట్టి ప్రతి వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుడు తన ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పెట్టుబడులు లేదా ఆస్తుల అమ్మకాలపై వచ్చిన లాభనష్టాలను సమీక్షించుకోవాలి. దీనివల్ల తమ పెట్టుబడులు, అమ్మకాలపై వచ్చిన స్వల్ప, దీర్ఘకాలిక మూలధన లాభాలు, వాటిపై ఎంత ట్యాక్స్ చెల్లించాలనే దానిపై స్పష్టత వస్తుంది. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడుల దీర్ఘకాలిక మూలధన లాభాలు.. పన్ను మినహాయింపు పరిధిలో ఉంటే ఈ నెలాఖరులోగా అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు.
సమీక్ష
పెట్టుబడుల రుజువులు
ఉద్యోగులైతే ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ సేవింగ్స్ కోసం చేసే పెట్టుబడుల ముందస్తు వివరాలను ఇప్పటికే కంపెనీకి తెలియజేసి ఉంటారు. ఇప్పుడు చేయాల్సిందల్లా ఆ పెట్టుబడులను రుజువు చేసే ఈ కింది పత్రాలను ఈ నెలాఖరుకల్లా కంపెనీలకు సమర్పించాలి. అవేమిటంటే?
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు రసీదులు
ఈఎల్‌ఎ్‌సఎస్ పథకాల పెట్టుబడులకు సంబంధించిన రుజువులు
పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ రికార్డులు
ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపు రసీదులు
గృహ రుణ వడ్డీ చెల్లింపుల వివరాల సర్టిఫికెట్
హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేస్తుంటే ఇంటి అద్దె చెల్లింపు రసీదులు
ఈ నెలాఖరులోగా ఈ రుజువులు సమర్పించకపోతే కంపెనీ మీ మార్చి నెల జీతం నుంచి పెద్దమొత్తాన్ని టీడీఎ్‌సగా కట్ చేసే అవకాశం ఉంది.
గృహ రుణ స్టేట్‌మెంట్స్
గృహ రుణ చెల్లింపుదారులు తమకు రుణం ఇచ్చిన బ్యాంకు లేదా గృహ ఫైనాన్స్ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ) వెబ్‌సైట్ నుంచి తమ వార్షిక లోన్ స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ స్టేట్‌మెంట్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం గృహ రుణంపై చెల్లించిన అసలు, వడ్డీపై పూర్తి స్పష్టత వస్తుంది. దీనివల్ల సెక్షన్ 24(బీ) కింద సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇంటిపై చెల్లించే హోమ్‌లోన్‌పై ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీలో రూ.2 లక్షల వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. హోమ్‌లోన్ అసలు కింద చెల్లించే మొత్తానికీ సెక్షన్ 80సీ కింద కొన్ని షరతులకు లోబడి రూ.1.5 లక్షల వరకు మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.
పెట్టుబడులు
పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వ్యక్తిగత ట్యాక్స్ చెల్లింపుదారులు ఈ నెలాఖరులోగానే తమ ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులు పూర్తి చేయాలి. వీరిలో ఇంకా ఎవరైనా తమ పెట్టుబడులు పూర్తి చేయకపోతే వారికి ఇదే ఆఖరి అవకాశం. ఈ నెలాఖరులోగానే వారు తమ పెట్టుబడులు పూర్తి చేయాలి. లేకపోతే పాత ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను ఆదా ప్రయోజనాలు కోల్పోతారు. ఇందుకోసం వీరు ఈ నెలాఖరులోగా ఈ కింది కింది పథకాల్లో ఏదో ఒక దాంట్లో లేదా కొన్నిటిలో పెట్టుబడులు పూర్తి చేయడం మంచిది.
పబ్లిక్ ప్రావిండెంట్ ఫండ్ (పీపీఎఫ్)
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్‌ఎ్‌సఎస్)
సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎ్‌సవై)
జీవిత బీమా ప్రీమియంలు
గృహ రుణాల అసలు చెల్లింపు
సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.5 లక్షల కంటే ఇంకా ఎక్కువ మొత్తం పన్ను మినహాయింపు కావాలంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎ్‌స)లో మదుపు చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో పెట్టే పెట్టుబడుల్లో సెక్షన్ 80సీసీడీ కింద మరో రూ.50,000వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులంతా ఈ విషయాలను గుర్తుంచుకుని వెంటనే తమ పెట్టుబడులను పూర్తి చేయాలి. ఇంకా టైమ్ ఉంది.. తొందర ఎందుకనుకుంటే, చివరి రెండు మూడు రోజుల్లో తీవ్ర హైరానా తప్పదు. అప్పుడు పన్ను ఆదా కోసమని దేంట్లో పడితే దాంట్లో మదుపు చేసి చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
ఈ వార్తలూ చదవండి:
ఈద్-ఉల్-ఫితర్.. నేడు బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం