Share News

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:42 AM

ఆదాయ పన్ను చట్టం, 2025 నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. ‘ఆదాయ పన్ను నిబంధనలు, 2026’ పేరుతో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ...

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం

  • నిబంధనలు విడుదల చేసిన సీబీడీటీ

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చట్టం, 2025 నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. ‘ఆదాయ పన్ను నిబంధనలు, 2026’ పేరుతో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు శుక్రవారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐటీ చట్టంలో ఉన్న 47 చాప్టర్లు 23కు తగ్గనున్నాయి. సెక్షన్ల సంఖ్యను 819 నుంచి 536కు తగ్గించారు. ఈ నిబంధనలతో ఉద్యోగులకు పెద్దఊరట లభించనుంది. నగర ప్రాంతాలకు చెందిన ఆదాయ పన్ను చెల్లింపుదారులకు హౌజ్‌ రెంట్‌ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ) మినహాయింపు పరిమితి 50 శాతం వరకు పెరగనుంది. అలాగే వారి పిల్ల ల నెలవారీ ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌ను కూడా రూ.300 నుంచి రూ.3,000కు పెంచారు. కొత్త ఆదాయ పన్ను చట్టం వచ్చే నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానుంది. ప్రధాన అంశాలు

హెచ్‌ఆర్‌ఏ: కొత్త నిబంధనల ప్రకారం ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, పుణె, అహ్మదాబాద్‌, బెంగళూరు నగరాల్లోని ఉద్యోగులు పాత ట్యాక్స్‌ విధానంలో తమ జీతంలో 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇతర నగరాల్లోని ఉద్యోగులూ తమ జీతంలో 40 శాతాన్ని హెచ్‌ఆర్‌ఏ కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే ఈ మినహాయింపు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది.

పిల్లల విద్య, హాస్టల్‌, ఇతర అలవెన్సులు: కొత్త రూల్స్‌ ప్రకారం చదువుల కోసం ఒక్కో సంతానానికి క్లెయిమ్‌ చేసుకునే నెలవారీ అలవెన్స్‌ను రూ.300 నుంచి రూ. 3,000కు, వారి నెలవారీ హాస్టల్‌ ఖర్చులను రూ.300 నుంచి రూ.9,000కు పెంచారు. అయితే ఈ ప్రయోజనం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే పరిమితం.


కారు అలవెన్స్‌: ఉద్యోగులకు కంపెనీలు అందించే కారు అలవెన్స్‌ ఇంజన్‌ సామర్ధ్యాన్ని బట్టి నెలకు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఉంటుంది. డ్రైవర్‌ అలవెన్స్‌ కింద మరో రూ.3,000 క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

ఇంటి వద్ద అందించే సేవలు: ఉద్యోగి ఇంటి వద్ద పనిచేసే స్వీపర్‌, తోటమాలి లేదా వాచ్‌మెన్లకు చెల్లించే వాస్తవ జీతాల ట్యాక్సబుల్‌ వాల్యూ

బహుమతులు, వోచర్లు: ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి అందుకునే బహుమతులు, వోచర్ల విలువ రూ.15,000 మించితే సదరు ఉద్యోగే పన్ను చెల్లించాలి.

పని ప్రదేశాల్లో భోజనాలు: ఆఫీసు అవర్స్‌లో పెయిడ్‌ వోచర్ల ద్వారా కంపెనీ అందించే ఉచిత భోజనం, బేవరేజె్‌సపై ఎలాంటి పన్ను ఉండదు. అయితే ఒక్కో భోజనం ధర రూ.200 మించకూడదు.


అద్దె రూ.లక్ష మించితే: ఏటా చెల్లించే అద్దె రూ.1,00,000 మించితే ఇంటి యాజమాని పేరు, చిరునామా, పాన్‌ నంబర్‌ సబ్‌మిట్‌ చేయాలి. అలాగే ఇంటి యజమానితో ఉన్న సంబంధ, బాంధవ్యాలను కూడా వెల్లడించాలి.

ఎల్‌టీఏ: ప్రయాణ ఖర్చులకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పిస్తేనే ఎల్‌టీఏను అనుమతిస్తారు.

హౌజ్‌ ప్రాపర్టీ ఆదాయం: సొంత ఇంటి నుంచి అద్దె ఆదాయం ఉంటే, ఇంటి నిర్మాణానికి అప్పు ఇచ్చిన వ్యక్తి లేదా సంస్థ పేరు, చిరునామా, వారి పాన్‌ నంబర్‌ సబ్‌మిట్‌ చేయాలి.

క్రిప్టో ఎక్స్ఛేంజీలు: ఈ ఎక్స్ఛేంజీలు తప్పనిసరిగా తమ ఖాతాదారుల లావాదేవీల సమాచారాన్ని ఐటీ శాఖకు తెలియజేయాలి.

పాన్‌ నంబర్‌: ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంకు లేదా వివిఽధ బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలు లేదా అంతకు మించి డిపాజిట్‌ చేసినా లేదా విత్‌డ్రా చేసినా అతని పాన్‌ నంబర్‌ వెల్లడించాలి.

మోటారు వాహనాల కొనుగోలు: రూ.5 లక్షల కంటే విలువైన బైకులు లేదా మోటారు వాహనాలు కొంటుంటే తప్పనిసరిగా పాన్‌ నంబర్‌ కోట్‌ చేయాలి.

హోటల్‌ బిల్లులు: హోటల్‌, రెస్టారెంట్‌ బిల్లులు లేదా కన్వెన్షన్‌ సెంటర్లు, బాంక్వెట్‌ హాల్స్‌కు చేసే చెల్లింపులు రూ.లక్ష మించినా పాన్‌ నంబరు వెల్లడించాలి. అలాగే కొనుగోలు చేసే స్థిరాస్తి, అందుకునే బహుమతి విలువ రూ.20 లక్షలు మించినా పాన్‌ నంబర్‌ కోట్‌ చేయడం తప్పనిసరి.

Updated Date - Mar 21 , 2026 | 03:42 AM