రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:13 AM
దేశీయంగా తయారైన (మేడ్ ఇన్ ఇండియా) తొలి పౌర విమానం రెండేళ్లలో అందుబాటులోకి రావచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు..
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం
న్యూఢిల్లీ: దేశీయంగా తయారైన (మేడ్ ఇన్ ఇండియా) తొలి పౌర విమానం రెండేళ్లలో అందుబాటులోకి రావచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారంనాడిక్కడ ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (ఏటీఎఫ్‌క్యూఎం) సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశీయ విమానయాన రంగం వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం దేశీయ విమానయాన సంస్థలు 1,600కు పైగా విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయని, వీటి విలువ సుమారు 10,000 కోట్ల డాలర్లు ఉంటుందన్నారు. వచ్చే పదేళ్లలో 100కుపైగా కొత్త విమానాశ్రయాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 165 విమానాశ్రయాలుండగా.. దేశీయ విమానయాన సంస్థల వద్ద దాదాపు 850 విమానాలున్నాయని చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉందన్నారు. దేశంలో జెట్ ఇంజన్ల తయారీకున్న అవకాశాలను కూడా మోదీ ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.
ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధిపై దృష్టి
విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఏటీఎఫ్‌కు సంబంధించిన ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించాలా అన్న అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. అలాగే అధిక ఏటీఎఫ్ వ్యయాల గురించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ), విమానయాన సంస్థలతో చర్చిస్తోంది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా దాదాపు 40 శాతం ఉంటుంది. దేశీయ ఎయిర్‌లైన్స్‌కు మద్దతుగా ఏటీఎఫ్ ధరలను స్థిరీకరించేందుకుగాను ఓఎంసీలకు గరిష్ఠంగా రూ.10వేల కోట్ల వన్‌టైమ్ మద్దతు అందించేందుకు కేంద్ర క్యాబినెట్ గత జూన్‌లో ఆమోదం తెలిపింది. అయితే ఈ నిధిని వినియోగించుకోవడానికి విమానయాన సంస్థలు ఆసక్తి చూపలేదు. దీని గడువు కూడా ముగిసిపోయింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిధిని మళ్లీ పునరుద్ధరించే అవకాశాలున్నాయి.
అదానీ ప్రతిపాదనకు నో...
ముంబై నుంచి నవీ ముంబై విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాలను పాక్షికంగా తరలించాలన్న ప్రతిపాదనను వాయిదా వేయాలని అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం కోరినట్టు తెలుస్తోంది. ముంబై విమానాశ్రయంలో టెర్మినల్-1 పునరుద్ధరణ పనులను చేపట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నెల 25 నాటికి ముంబై నుంచి నవీ ముంబై విమానాశ్రయానికి 33 శాతం అంతర్జాతీయ విమానాలను తరలించాలని లేదా వాటిని నిలిపివేయాలని విమానయాన సంస్థలను అదానీ ఎయిర్ పోర్ట్స్ కోరింది. ఈ ప్రతిపాదనను పలు విమానయాన సంస్థలు వ్యతిరేకించాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన