Share News

రూ.7,000కోట్లతో 1,800 కిలో మీటర్ల ఎల్‌పీజీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌

ABN , Publish Date - Aug 23 , 2026 | 03:02 AM

దేశంలో ఎల్‌పీజీ సరఫరా పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ రానున్నకాలంలో మరింతగా విస్తరించనుంది. దాదాపు రూ.7,000 కోట్ల పెట్టుబడితో సుమారు 1,800 కిలో మీటర్ల మేర కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్ల...

రూ.7,000కోట్లతో 1,800 కిలో మీటర్ల ఎల్‌పీజీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌

3 కొత్త ప్రాజెక్టులకు పీఎన్‌జీఆర్‌బీ గ్రీన్‌సిగ్నల్‌

తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల అనుసంధానం

న్యూఢిల్లీ: దేశంలో ఎల్‌పీజీ సరఫరా పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ రానున్నకాలంలో మరింతగా విస్తరించనుంది. దాదాపు రూ.7,000 కోట్ల పెట్టుబడితో సుమారు 1,800 కిలో మీటర్ల మేర కొత్త ఎల్‌పీజీ పైప్‌లైన్ల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు పెట్రోలియం, సహజవాయువు నియంత్రణ మండలి (పీఎన్‌జీఆర్‌బీ) ఆమోదం తెలిపింది. వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ఈ మూడు ఎల్‌పీజీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, గోవా రాష్ట్రాలను అనుసంధానించనున్నాయి. ఈ ప్రాజెక్టులను ప్రభుత్వ రంగంలోని గెయిల్‌ (ఇండియా) లిమిటెడ్‌ అభివృద్ధి చేయనుంది. వీటితో దేశంలో కామన్‌ క్యారియర్‌ ఎల్‌పీజీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ సుమారు 7,700 కిలో మీటర్ల నుంచి 9,500 కిలో మీటర్ల వరకు (దాదాపు 23.5 శాతం వృద్ధి) విస్తరించనుంది. ఈ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ ఇంధన సరఫరా వ్యవస్థలను మరింత పటిష్టపరచడానికి, రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదపడనుంది. ఇంతకు ముందు 2,757 కిలో మీటర్ల కాండ్లా-గోరఖ్‌పూర్‌ ఎల్‌పీజీ లైప్‌లైన్‌కు ఆమోదం లభించింది. ఇది దేశంలోనే అతిపొడవైనది.

మూడు కొత్త ప్రాజెక్టులు ఇవే..

  • తెలంగాణలోని చర్లపల్లి నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వరకు 556 కిలో మీటర్ల పైప్‌లైన్‌.

  • ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌ వరకు 611 కిలో మీటర్ల పైప్‌లైన్‌.

  • మహారాష్ట్రలోని షిక్రాపూర్‌ నుంచి గోవా, కర్ణాటకలోని హుబ్లీ వరకు 633 కిలో మీటర్ల పైప్‌లైన్‌.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 03:02 AM