Share News

ఎల్‌ఐసీ నుంచి రెండు కొత్త పాలసీలు.. సెప్టెంబర్ 7 నుంచి అందుబాటులోకి!

ABN , Publish Date - Sep 01 , 2026 | 08:38 PM

ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త బీమా పథకాలను ప్రకటించింది. బీమా ప్లాటినమ్, జీవన్ రక్ష పేర్లతో తీసుకొచ్చిన ఈ పాలసీలు సెప్టెంబర్ 7, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఎల్‌ఐసీ నుంచి రెండు కొత్త పాలసీలు.. సెప్టెంబర్ 7 నుంచి అందుబాటులోకి!
LIC New Plans 2026

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ తన 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త బీమా పథకాలను తీసుకొచ్చింది. ‘LIC బీమా ప్లాటినమ్‌’, ‘LIC జీవన్ రక్ష’ పేర్లతో వీటిని ప్రకటించింది. ఈ రెండు పాలసీలు సెప్టెంబర్ 7, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి.


LIC బీమా ప్లాటినమ్‌.. పొదుపుతో పాటు బీమా రక్షణ

బీమా ప్లాటినమ్ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత బీమా పథకం. పొదుపు లక్ష్యంతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేలా దీన్ని రూపొందించారు. పాలసీ వ్యవధిలో ముందుగానే నిర్ణయించిన గ్యారెంటీడ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పాలసీలో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి రూ.1,000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ జమ అవుతుంది. ఈ పాలసీని 28 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్నవారు తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు కోసం 7, 10, 12, 15 లేదా 18 ఏళ్ల ఆప్షన్లు ఉన్నాయి. పాలసీ టర్మ్‌ను 17, 20, 22, 25 లేదా 28 ఏళ్లలో ఎంచుకోవచ్చు. కనీస బీమా మొత్తం రూ.3 లక్షలు కాగా, గరిష్ఠ సమ్ అష్యూర్డ్‌పై పరిమితి లేదని సంస్థ పేర్కొంది. పాలసీ గడువు పూర్తయ్యే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే.. బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో పాటు అర్హత కలిగిన గ్యారెంటీడ్ అడిషన్లు అందుతాయి.


పాలసీ కాలంలో పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే.. నిబంధనల ప్రకారం వార్షిక ప్రీమియానికి 11 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లకు సంబంధించిన అర్హత మొత్తాల్లో ఎక్కువదాన్ని డెత్ బెనిఫిట్‌గా చెల్లిస్తారు. అదనంగా ఎల్‌ఐసీ పాలసీదారులకు రిబేట్లు, రుణ సదుపాయం, అవసరానికి అనుగుణంగా రైడర్లను జోడించుకునే అవకాశం ఉన్నాయి. అలాగే బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం చొప్పున రెగ్యులర్ ఇన్‌కమ్‌గా ప్రతి సంవత్సరం పొందే ఆప్షన్ కూడా ఉంది.

LIC జీవన్ రక్ష.. కుటుంబానికి ఆర్థిక రక్షణ

జీవన్ రక్ష నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్యూర్ రిస్క్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీదారుడికి అనుకోని సంఘటన ఎదురైనప్పుడు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పాలసీని 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారు తీసుకోవచ్చు. కనీస బీమా హామీ మొత్తం రూ.5 లక్షలు కాగా.. గరిష్ఠంగా రూ.24 లక్షల వరకు కవరేజ్ తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులో సింగిల్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం వంటి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మహిళలకు ప్రత్యేక ప్రీమియం రేట్లు వర్తిస్తాయని ఎల్‌ఐసీ తెలిపింది. అవసరాన్ని బట్టి అదనపు రక్షణ కోసం రైడర్లను కూడా ఈ పాలసీకి జోడించుకునే అవకాశం ఉంది.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

రక్షాబంధన్‌ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Updated Date - Sep 01 , 2026 | 08:38 PM