Share News

మరింత బలంగా ఎదుగుతాం

ABN , Publish Date - Jun 15 , 2026 | 05:42 AM

పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. జీవిత బీమా రంగంలో తమ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటామని ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రకటించింది...

మరింత బలంగా ఎదుగుతాం

నాయకత్వ స్థానాన్ని నిలబెట్టుకుంటాం

ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ దొరైస్వామి

న్యూఢిల్లీ: పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. జీవిత బీమా రంగంలో తమ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటామని ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రకటించింది. అలాగే ఈ మార్కెట్లో తమ నాయకత్వ స్థానాన్నీ నిలబెట్టుకుంటామని ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ ఆర్‌ దొరైస్వామి చెప్పారు. జీవిత బీమా రంగంలో ప్రైవేటు సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. దేశ అభివృద్ధిలోనూ ఎల్‌ఐసీ పాత్ర కొనసాగుతుందన్నారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థతో పాటే ఎల్‌ఐసీ అభివృద్ధి చెందుతోంది. ఎల్‌ఐసీ అభివృద్ధి దేశ ఆర్థికాభివృద్ధితో ముడిపడి ఉంది’ అన్నారు. ఎల్‌ఐసీ ఉద్యోగులు, అధికారులు తరతరాలుగా ముందు చూపుతో అంకిత భావంతో చేసిన కృషి వల్లే ఎల్‌ఐసీ ఈ రోజు ఈ స్థాయికి చేరిందని దొరైస్వామి చెప్పారు.

రూ.57 లక్షల కోట్ల ఆస్తులు

1956 సెప్టెంబరు 1న దేశంలోని 245 జాతీయ, విదేశీ, జీవిత బీమా సంస్థలు, ప్రావిడెంట్‌ సొసైటీలను జాతీయం చేసి రూ.5 కోట్ల మూలధనంతో ప్రభుత్వం ఎల్‌ఐసీని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పుడు దేశ జీవిత బీమా మార్కెట్లో దాదాపు 60 శాతం మార్కెట్‌ వాటాతో రూ.57 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా సంస్థ కార్యాలయాల రూపంలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల విలువ కూడా రూ.60,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఎల్‌ఐసీ ప్రస్తుతం దేశంలోనేగాక ఆసియా ఖండంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీల్లో ఒకటని దొరైస్వామి చెప్పారు.

ఇవీ చదవండి:

AIADMKకి సినీ నటి గౌతమి రాజీనామా

అన్‌స్టాపబుల్‌గా అమరావతి నిర్మాణం.. మంత్రి లోకేశ్ వీడియో పోస్ట్

Updated Date - Jun 15 , 2026 | 05:42 AM