Share News

ఆరంభం అధరహో!

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:45 AM

మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు చెందిన టెలికాం, డిజిటల్‌ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్‌ లిమిటెడ్‌ (జేపీఎల్‌) స్టాక్‌ మార్కెట్‌ అరంగేట్రం అదిరింది. గత వారంలో...

ఆరంభం అధరహో!

లిస్టింగ్‌ రోజే 27 శాతం పెరిగిన జియో షేరు

  • బీఎ్‌సఈలో రూ.1,417.35 వద్ద ముగింపు

  • రూ.13.05 లక్షల కోట్లు దాటిన కంపెనీ మార్కెట్‌ విలువ

  • దేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరణ

ముంబై: మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు చెందిన టెలికాం, డిజిటల్‌ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్‌ లిమిటెడ్‌ (జేపీఎల్‌) స్టాక్‌ మార్కెట్‌ అరంగేట్రం అదిరింది. గత వారంలో తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)ను విజయవంతంగా ముగించిన కంపెనీ బుధవారం తన షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.1,119తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు ఏకంగా 21.36 శాతం ప్రీమియంతో రూ.1,358 దగ్గర ట్రేడింగ్‌ ప్రారంభించింది. మరింత పెరిగి ఒక దశలో 27.33 శాతం వృద్ధి రూ.1,423.80 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమో దు చేసింది. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసే సమ యానికి ఈ షేరు 26.67 శాతం లాభంతో రూ.1,417.50 వద్ద స్థిరపడింది. దాంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.13,05,241.98 కోట్లకు ఎగబాకింది. తద్వారా, టెలికాం రంగంలో తన ప్రధాన ప్రత్యర్థి అయిన ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి దేశంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. కాగా, రూ.15.67 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశంలో అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతుండగా.. రూ.12.16 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో ఎయిర్‌టెల్‌ మూడో స్థానానికి జారుకుంది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ (రూ.10.58 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.9.86 లక్షల కోట్లు) వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నాయి. దాంతో టీసీఎస్‌ (రూ.8.89 లక్షల కోట్లు) టాప్‌-5లో స్థానం కోల్పోయి 6వ స్థానానికి పడిపోయింది.

ఇన్వెస్టర్లకు తొలి రోజే రూ.2.75 లక్షల కోట్ల లాభం

ఐపీఓ ధర రూ.1,119 ప్రకారం జియో మార్కెట్‌ విలువ రూ.10.3 లక్షల కోట్లతో పోలిస్తే, స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన తొలిరోజే కంపెనీ తన ఐపీఓ ఇన్వెస్టర్లకు దాదాపు రూ.2.75 లక్షల కోట్ల లాభాలను పంచింది.

ప్రపంచంలో ఏడో అత్యంత విలువైన టెలికాం సంస్థ

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌పరంగా జియో ప్లాట్‌ఫామ్స్‌ ప్రపంచంలో ఏడో అత్యంత విలువైన టెలికాం కంపెనీగా అవతరించింది. చైనా మొబైల్‌ తర్వాత ఆసియాలో రెండో అత్యంత విలువైన టెలికాం ఆపరేటర్‌ కూడా ఇదే.


రిలయన్స్‌ అగ్రస్థానానికి.. టాటా వెనక్కి

జియో ప్లాట్‌ఫామ్స్‌ షేర్ల లిస్టింగ్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ (ఆర్‌ఐఎల్‌, జేపీఎల్‌, జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) మొత్తం మార్కెట్‌ విలువ రూ.30 లక్షల కోట్లకు చేరుకుంది. దాంతో దేశంలో అత్యంత విలువైన కార్పొరేట్‌ గ్రూప్‌ల జాబితాలో టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. రూ.25.28లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో టాటా గ్రూప్‌ రెండో స్థానానికి పడిపోగా..రూ.16.6 లక్షల కోట్ల స్థాయి మార్కెట్‌ విలువతో అదానీ గ్రూప్‌ మూడో స్థానంలో ఉంది.

10-Business.jpg

ముకేశ్‌.. భావోద్వేగం

జియో షేర్ల లిస్టింగ్‌ సందర్భంగా గంట మోగించే కార్యక్రమం ముంబైలోని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ)లో బుధవారం ఘనంగా జరిగింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీతో పాటు తన తల్లి కోకిలాబెన్‌ అంబానీ, పిల్లలు ఆకాశ్‌, ఇషా, అనంత్‌ అంబానీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ, డైరెక్టర్లుగా ఇషా, అనంత్‌ అంబానీలు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు. వారు ప్రసంగిస్తున్న సందర్భంగా ముకేశ్‌ పలుసార్లు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఉద్యోగులకు విందు.. బోనస్‌ బొనాంజా

జియో షేర్ల లిస్టింగ్‌ సందర్భంగా ముంబైలోని రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్క్‌లో బుధవారం మఽధ్యాహ్నం ఉద్యోగులకు ముకేశ్‌ అంబానీ మెగా విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, రిలయన్స్‌ గ్రూప్‌ ఉద్యోగులకు దీపావళికి ముందే భారీ బొనాంజా పంచారు కూడా. అక్టోబరు నెల జీతాన్ని కంపెనీ ఈ నెల 15నే చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 75 శాతం ఉద్యోగుల వార్షిక నగదు బోనస్‌ లేదా పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలను సైతం బుధవారమే చెల్లించినట్లు తెలిసింది.

స్టాక్‌ మార్కెట్లో షేర్ల లిస్టింగ్‌తో కంపెనీ ప్రయాణం ఇప్పుడే ఆరంభమైంది. గడిచిన 50 ఏళ్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన షేర్‌హోల్డర్లకు ఎలాగైతే ప్రతిఫలాలు పంచి పెట్టిందో.. జియో వచ్చే 50 ఏళ్లు దానిని కొనసాగించనుంది.

ఆకాశ్‌ అంబానీ,

ఎండీ, జియో ప్లాట్‌ఫామ్స్‌

ఇవి కూడా చదవండి...

యానాంలో ఆర్నబ్ తుఫాను విలయం

కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 05:45 AM