జియో ప్లాట్‌ఫామ్స్ రూ.37,700 కోట్ల ఐపీఓ
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:15 AM
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన డిజిటల్ సర్వీసుల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది...
ఆమోదం తెలిపిన సెబీ.. దేశంలో ఇదే అతిపెద్ద ఇష్యూ.. కంపెనీ విలువ రూ.13 లక్షల కోట్లుగా లెక్కింపు!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన డిజిటల్ సర్వీసుల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ 380 కోట్ల డాలర్లు (సుమారు రూ.37,700 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. భారత్‌లో ఇంత భారీ స్థాయిలో నిధుల సమీకరణతో ఐపీఓకి వస్తున్న తొలి కంపెనీ ఇదే. జియో ప్లాట్‌ఫామ్స్ ఈ ఏడాది జూన్‌లో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించగా శుక్రవారం నాడు సెబీ ఈ ఇష్యూకి ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా జియో ప్లాట్‌ఫామ్స్ 2.9 శాతం వాటాకు సమాన మైన 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయాలని భావిస్తున్నట్లు ముసాయిదా పత్రాల్లో వెల్లడించింది. కాగా జియో ప్లాట్‌ఫామ్స్ విలువను 13,700 కోట్ల డాలర్లు (సుమారు రూ.13 లక్షల కోట్లు)గా లెక్కించినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. 2024లో హ్యుండయ్ మోటార్ ఇండియా పబ్లిక్ ఇష్యూ ఇప్పటి వరకు దేశంలో అతిపెద్ద ఐపీఓగా ఉంది. హ్యుండయ్ ఈ ఐపీఓ ద్వారా 330 కోట్ల డాలర్లు సమీకరించింది. కాగా త్వరలో ఐపీఓకి రానున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) కూడా రూ.30,000 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. 2008 తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న ఐపీఓ ఇదే కావటం విశేషం.
రుణాల చెల్లింపులకు..
ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.27,500 కోట్లను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రుణాలను చెల్లించేందుకు వినియోగించనున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్ ముసాయిదా పత్రాల్లో పేర్కొంది. మిగిలిన మొత్తాలను సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు వెల్లడించింది. కొద్దికాలంగా ఐపీఓ మార్కెట్ చురుగ్గా ఉండటంతో జియో ఐపీఓకి రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థాగత ఇనిస్టిట్యూషన్ల నుంచి భారీ డిమాండ్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ చివరి నాటికి జియో ఇన్ఫోకామ్ సబ్‌స్ర్కైబర్లు 53.3 కోట్లుగా ఉన్నారు. ప్రపంచంలో చైనా మొబైల్ తర్వాత రెండో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా జియో ఇన్ఫోకామ్ ఉంది.
కాగా 2020లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో మెటా రూ.43,574 కోట్ల పెట్టుబడితో 9.9 శాతం వాటాను తీసుకోగా గూగుల్ 7.73 శాతం వాటాను రూ.33,737 కోట్లకు తీసుకుంది. అలాగే సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ జనరల్ అంట్లాంటిక్, కేకేఆర్, ముబాదల, అబుదాబీ ఇన్వె్‌స్టమెంట్ అథారిటీ, టీపీజీ, ఎల్ క్యాటర్‌టన్, ఇంటెల్, క్వాల్‌కామ్ వెంచర్స్‌కు దాదాపు 15.2 శాతం వాటాలున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీ్‌సకు జియో ఇన్ఫోకామ్‌లో 66.4 శాతం వాటా ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు