టారిఫ్‌ల కంటే సేవల విస్తరణపైనే దృష్టి
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:11 AM
ఆదాయ పెంపు కోసం జియో ప్లాట్‌ఫామ్స్.. టెలికాం సేవల కంటే ఇతర సేవలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. టారిఫ్‌ల పెంపు కంటే మరిన్ని సేవలను ప్రవేశపెట్టి...
సమయం వచ్చినప్పుడు చార్జీలూ పెంచుతాం
డిజిటల్ సేవల్లోనూ అధిక వాటానే లక్ష్యం
జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ
ముంబై: ఆదాయ పెంపు కోసం జియో ప్లాట్‌ఫామ్స్.. టెలికాం సేవల కంటే ఇతర సేవలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. టారిఫ్‌ల పెంపు కంటే మరిన్ని సేవలను ప్రవేశపెట్టి.. వాటి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ ఎండీ ఆకాశ్ అంబానీ చెప్పారు. జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఆదాయ పెంపు కోసం మొబైల్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్ప్రైజ్, అంతర్జాతీయ సేవలు తమకు ప్రధాన చోదక శక్తులని చెప్పారు. తమ హోమ్ బ్రాడ్ బ్యాండ్ సేవలకు దేశంలో మంచి ఆదరణ ఉందన్నారు. 2026-31 మధ్య కాలంలో దేశంలో 34 కోట్ల మంది కస్టమర్లు 4జీ, 5జీ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇందులో మెజారిటీ వాటా దక్కించుకోవటమే తమ లక్ష్యమన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి తమ ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల సంఖ్య 2.86 కోట్లకు చేరినట్టు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం దేశం లో కొత్తగా తీసుకున్న ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లలో జియో వాటా 67.5 శాతం వరకు ఉన్నట్టు ఆకాశ్ అంబానీ చెప్పారు.
టారిఫ్‌ల పెంపు తప్పదు
మున్ముందు టెలికాం టారిఫ్‌ల పెంపు తప్పదని ఆకాశ్ అంబానీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ పెంపు ఎప్పుడు అనే ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మన దేశంలో ఉన్నంత తక్కువ టెలికాం, డేటా చార్జీలు మరే దేశంలోనూ లేవన్నారు. 2016లో జియో రంగ ప్రవేశం తర్వాత టెలికాం చార్జీల భారం, భారతీయుల సగటు తలసరి ఆదాయంలో ఒక శాతానికి దిగొచ్చిన విషయాన్ని అంబానీ గుర్తు చేశారు.
6జీ తీసుకొస్తాం
ఆరోతరం (6జీ) టెలికాం టెక్నాలజీ అభివృద్ధిపైనా జియో దృష్టి పెట్టినట్టు అకాశ్ అంబానీ వెల్లడించారు. మరో పదేళ్లలో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. తమ 6జీ టెక్నాలజీ కోసం టెలికాం ఆపరేటర్లు మౌలిక సదుపాయాలపై పెద్దగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు. ఇప్పటికే వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకుంటే సరిపోతుందన్నారు. 2029 నాటికి ప్రపంచవ్యాప్తంగా 6జీకి సంబంధించిన ప్రామాణికాలు ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. ఈ 6జీ టెక్నాలజీ ద్వారా ఇప్పటికే 54 కోట్ల మంది వరకు ఉన్న జియో 4జీ, 5జీ కస్టమర్లకు మరిన్ని సేవలు అందించగలుగుతామని అంబానీ చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా
ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఐడీబీఐ బ్యాంకు