21 నుంచి జియో ఐపీఓ!?
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:17 AM
దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ నెల 21న...
28న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్!!
రూ.37,700 కోట్ల సమీకరణ.. ఇదే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ
ముంబై: దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ నెల 21న ప్రారంభమై 23న ముగియనుందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ ఇష్యూ 19నే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. అలాగే, ఐపీఓ అనంతరం జియో ప్లాట్‌ఫామ్స్ తన షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో 28న నమోదు చేసే అవకాశం ఉంది. అయితే, స్టాక్ మార్కెట్లో పరిస్థితుల ఆధారంగా ఈ తేదీలు మారే అవకాశాలున్నాయి. ఐపీఓలో భాగంగా జియో 27 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ షేర్ల ధరల శ్రేణిని, ఇష్యూ సైజును కంపెనీ ప్రకటించాల్సి ఉంది. ఐపీఓ ద్వారా జియో రూ.37,700 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. అంటే, భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది. ఐపీఓ నిధుల్లో రూ.27,500 కోట్లను రిలయన్స్ జియో రుణాలను తిరిగి చెల్లించేందుకు ఉపయోగించుకోనున్నట్లు సెబీకి సమర్పించిన పత్రాల్లో (డీఆర్‌హెచ్‌పీ) కంపెనీ వెల్లడించింది. మిగతా సొమ్మును సాధారణ వ్యాపార అవసరాలకు వినియోగించుకోనుంది.
ఈ వార్తలూ చదవండి
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ ఏడు మోసాల పట్ల జాగ్రత్త వహించండి..
క్రిప్టోపై ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నాం: ఆర్బీఐ గవర్నర్