జియో జిల్ జిగా!
ABN , Publish Date - Oct 22 , 2026 | 06:03 AM
మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) రూ.30,213 కోట్ల తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు...
కంపెనీ ఇష్యూకు తొలి 100 నిమిషాల్లోనే 100% సబ్‌స్ర్కిప్షన్
అత్యంత వేగంగా అమ్ముడైన ఐపీఓల్లో ఇదొకటి..
మొదటి రోజున 3.16 రెట్ల బిడ్లు.. విలువ రూ.69,800 కోట్లు
అన్ని విభాగాల ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.3.20 లక్షల కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) రూ.30,213 కోట్ల తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు అపూర్వ స్పందన లభించింది. రిటైల్, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు బుధవారం అందుబాటులోకి వచ్చిన ఈ ఐపీఓ.. తొలి 100 నిమిషాల్లోనే 100 శాతం సబ్‌స్ర్కిప్షన్‌ను దక్కించుకుంది. భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో అత్యంత వేగంగా అమ్ముడైన ఐపీఓల్లో ఇదొకటి. ముకేశ్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్ 2008లో ఐపీఓ ద్వారా రూ.11,563 కోట్లు సమీకరించింది. ఆ ఇష్యూ తొలి రోజున తొలి నిమిషంలోనే పూర్తిగా సబ్‌స్ర్కిప్షన్ సాధించి రికార్డు సృష్టించింది.
సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి జోరుగా బిడ్డింగ్
జియో ఐపీఓలో అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) కోసం కేటాయించిన షేర్లకు ఏకంగా 9.42 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ లభించింది. 4.90 కోట్ల షేర్ల కేటాయింపునకు గాను వీరు తొలి రోజున 46.15 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలు చేశారు. అందులో బ్యాంకులు, బీమా సంస్థలు సహా దేశీయ ఆర్థిక సంస్థలు 25.02 కోట్ల షేర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 15.14 కోట్ల షేర్లు, మ్యూచువల్ ఫండ్లు 3.19 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు సమర్పించారు. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకు 73 శాతం బిడ్లు వచ్చాయి. అయినప్పటికీ, ఐపీఓలకు మొదటి రోజున రిటైల్ ఇన్వెస్టర్ల డిమాండ్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధికం.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు
జియో ప్లాట్‌ఫామ్స్ ఈ ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రూ.8,110 కోట్ల షేర్లను కేటాయించగా.. గత శుక్రవారం ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల షేర్ల కొనుగోలు కోసం బిడ్లు వేశారు. అంటే, యాంకర్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ షేర్లకు ఏకంగా 30 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ నమోదైంది. కాగా, జియో మొత్తం 212 మంది యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.8,110 కోట్ల షేర్లను ఒక్కొక్కటీ రూ.1,119 చొప్పున కేటాయించింది. యాంకర్ ఇన్వెస్టర్లతోపాటు అన్ని విభాగాల పెట్టుబడిదారుల నుంచి ఇప్పటివరకు ఈ ఐపీఓకు రూ.3.20 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి.
ఎవరు.. ఎంత?
ఇన్వెస్టర్ విభాగం సబ్‌స్ర్కిప్షన్ (రెట్లు)
క్యూఐబీ 9.42
సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 1.68
రిటైల్ ఇన్వెస్టర్లు 0.73
జియో ఉద్యోగులు 1.37
రిలయన్స్ వాటాదారులు 1.46
62.36 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు
స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల సమాచారం ప్రకారం.. జియో ఆఫర్ మొదటి రోజున సాయంత్రం 5 గంటల వరకు 3.16 రెట్ల బిడ్లను దక్కించుకుంది. అంటే, ఐపీఓలో కేటాయించిన 19.75 కోట్ల షేర్లకు గాను ఏకంగా 62.36 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు వచ్చాయి. ఈ ఐపీఓ ధరల శ్రేణిలో గరిష్ఠ స్థాయి రూ.1,119 ప్రకారంగా చూస్తే, ఆ బిడ్ల విలువ దాదాపు రూ.69,800 కోట్లు.
రిలయన్స్‌కు బూస్ట్: మూడీస్
జియో ఐపీఓ తన మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీ్‌సపై రుణభారం, వడ్డీ వ్యయాలను తగ్గించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయనుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. అలాగే, భవిష్యత్ పెట్టుబడులకు అవసరమైన నిధుల సమీకరణకు మార్గాలను విస్తృతం చేయనుంది. మొత్తంగా ఇది రిలయన్స్ పరపతి రేటింగ్‌కు సానుకూల అంశమని మూడీస్ పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
మళ్లీ 110 డాలర్లకు చేరువలో ముడి చమురు.. శాంతి ఒప్పందంపై అనిశ్చితే కారణం..
అమెరికన్ పిల్లలకు మస్క్ బంపరాఫర్