Share News

నోయల్‌కు జిమ్మీ షాక్‌!

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:17 AM

టాటాల కుటుంబంలోనూ కలహాలు పెరుగుతున్నాయి. తాజాగా దివంగత రతన్‌ టాటా సోదరుడు జిమ్మీ టాటా కూడా టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయల్‌ టాటాకు వ్యతిరేకంగా గళం విప్పారు. టాటా సన్స్‌ షేర్లను..

నోయల్‌కు జిమ్మీ షాక్‌!

టాటా సన్స్‌ లిస్టింగ్‌, చంద్ర పునర్నియామకాన్ని

సమర్థించిన రతన్‌ టాటా సోదరుడు జిమ్మీ టాటా

టాటా సన్స్‌పై పూర్తి పట్టు కోసం నోయల్‌ ప్రయత్నిస్తున్నారన్న జిమ్మీ

న్యూఢిల్లీ: టాటాల కుటుంబంలోనూ కలహాలు పెరుగుతున్నాయి. తాజాగా దివంగత రతన్‌ టాటా సోదరుడు జిమ్మీ టాటా కూడా టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌ నోయల్‌ టాటాకు వ్యతిరేకంగా గళం విప్పారు. టాటా సన్స్‌ షేర్లను ముమ్మాటికీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదు (లిస్టింగ్‌) చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కంపెనీ చైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ పునర్నియామకాన్నీ ఆయన సమర్థించారు. చంద్రశేఖరన్‌ నిర్వహణలో అనేక టాటా కంపెనీలు అప్పుల భారాన్ని తగ్గించుకుని లాభాల్లో నడుస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు టాటా సన్స్‌ను చిన్న కంపెనీలుగా విభజిస్తే అది టాటా గ్రూపుతో పాటు టాటా కంపెనీల వాటాదారులకూ చేటు చేస్తుందని హెచ్చరించారు. నోయల్‌ టాటా ఇలాంటి ప్రయత్నాలేవీ చేయకుండా ఉండేలా టాటా సన్స్‌ షేర్ల లిస్టింగ్‌ కోసం ఆర్‌బీఐ నిర్ణీత కాలపరిమితిని విధించాలని కోరారు. లిస్టింగ్‌తో టాటా ట్రస్ట్‌ల దాతృత్వ కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందన్న నోయల్‌ వాదనను కూడా జిమ్మీ తోసిపుచ్చారు. నిజానికి లిస్టింగ్‌తో టాటా సన్స్‌, నిర్వహణ మరింత పారదర్శకంగా మారుతుందన్నారు.

నోయల్‌ది అధికార దాహం: టాటా సన్స్‌ను నోయల్‌ దొడ్డిదారిన చేజిక్కించుకోవాలని చూస్తున్నారని, కంపెనీపై పూర్తి పెత్తనం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలనూ జిమ్మీ టాటా తప్పు పట్టారు. తన కుటుంబ సభ్యులను మాత్రమే టాటా ట్రస్ట్స్‌లో సభ్యులుగా చేర్చడం ద్వారా ఆయన ఇందుకోసం పావులు కదుపుతున్నారని దుయ్యబట్టారు. అందులో భాగంగానే ఇటీవల తన కుమారుడు నివెల్లే టాటాను టాటా ట్రస్ట్స్‌లో ట్రస్టీగా నియమించారని అన్నారు. ఇలాంటి చర్యలు టాటా ట్రస్ట్స్‌ వ్యవస్థాపకుల ఆశయాలకే వ్యతిరేకమని జిమ్మీ పేర్కొన్నారు.

టాటా సన్స్‌ను లిస్ట్‌ చేయాల్సిందే.: ఎన్‌బీఎఫ్‌సీ అప్పర్‌ లేయర్‌ నిబం ధనలకు లోబడి టాటా సన్స్‌ను తప్పనిసరిగా లిస్ట్‌ చేయాల్సిందేనని ఆర్‌బీఐ సీనియర్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

కనపడని డాక్టర్‌..ఏఐ

Updated Date - Nov 17 , 2026 | 06:17 AM