Share News

ఐటీఆర్‌ ఫైలింగ్‌తో లాభాలు బోలెడు..

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:41 AM

ఐటీ ఫైలింగ్స్‌ చివరి తేదీ ఈ నెల 31. ఆడిటింగ్‌ అవసరం లేని ఉద్యోగులు, వ్యాపారులు ఆ లోపు తమ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి. పన్ను పోటు లేకపోయినా ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడం మంచిది. దాని వల్ల...

ఐటీఆర్‌ ఫైలింగ్‌తో లాభాలు బోలెడు..

ఆదమరిస్తే నష్టాలూ ఎక్కువే

ఐటీ ఫైలింగ్స్‌ చివరి తేదీ ఈ నెల 31. ఆడిటింగ్‌ అవసరం లేని ఉద్యోగులు, వ్యాపారులు ఆ లోపు తమ రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి. పన్ను పోటు లేకపోయినా ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడం మంచిది. దాని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం.

ట్యాక్స్‌ రిఫండ్‌

గత ఆర్థిక సంవత్సరానికి (2025 -26) సంబంధించి మీ జీతం, వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయాలపై మూలంలో పన్ను కోత (టీడీఎస్‌) ఎక్కువగా జరిగి ఉండవచ్చు. అధికంగా వసూలు చేసిన ఈ టీడీఎ్‌సను రిఫండ్‌ ద్వారా వెనక్కి తీసుకోవాలంటే ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడం తప్పనిసరి. సాధారణంగా టీడీఎస్‌ ద్వారా వసూలు చేసిన దాని కంటే, మీరు చెల్లించాల్సిన పన్ను తక్కువగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంటుంది. ఐటీఆర్‌ ఫైల్‌ చేయకపోతే ఐటీ శాఖ మీ రిఫండ్‌ చెల్లింపు విషయాన్ని కనీసం పరిశీలించదు.

నష్టాల క్యారీ ఫార్వర్డ్‌

చాలా మంది స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు లేదా వ్యాపారాల్లో నష్టపోతుంటారు. ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడం ద్వారా.. ఈ నష్టాలను క్యారీ ఫార్వర్డ్‌ చేసి, భవిష్యత్‌లో వచ్చే లాభాల నుంచి ఈ నష్టాలను మినహాయించుకుని పన్ను పోటు తగ్గించుకోవచ్చు. నిర్ణీత గడువు లోగా ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడం ద్వారా మాత్రమే ఈ సౌలభ్యం లభిస్తుంది.

వీసా అప్లికేషన్లు

టూరిస్టు, బిజినెస్‌ లేదా స్టూడెంట్‌ వీసాలు ప్రాసెస్‌ చేసేటప్పుడు ఆదాయ వివరాల కోసం చాలా దేశాలు ఐటీ రిటర్నుల అక్‌నాలెడ్జ్‌మెంట్‌ అడుగుతాయి. కనీసం వరుసగా రెండు మూడు సంవత్సరాల ఐటీ రిటర్నులను ప్రూఫ్‌గా పెడితే వీసాలు వచ్చే అవకాశం బాగా మెరుగు పడుతుంది.

లేటు ఫీజు, వడ్డీ తప్పించుకునేందుకు..

ఐటీ రిటర్నులు నిర్ణీత గడువులోగా ఫైల్‌ చేయాలి. లేకపోతే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు లేటు ఫీజుగా చెల్లించాల్సి వస్తుంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000 లేటు ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది. చెల్లించాల్సిన పన్ను కంటే తక్కువ పన్నును ఆలస్యంగా చెల్లిస్తే, ఐటీ శాఖ మిగిలిన పన్నుపై ముక్కు పిండి వడ్డీ వసూలు చేస్తుంది.


ఫైనాన్షియల్‌ రికార్డు..

ఆదాయం, ఫైనాన్షియల్‌ క్రెడిబిలిటీకి మీ ఐటీ రిటర్న్‌ గట్టి సాక్ష్యం. బీమా పాలసీలు, టెండర్లు, స్కాలర్‌షి్‌పల కోసం దరఖాస్తు చేసేటప్పుడు కూడా ఐటీ రిటర్నులు ఆదాయ ప్రూఫ్‌లుగా ఉపయోగపడతాయి. బిజినెస్‌ ఫండింగ్‌, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకునేందుకూ రిటర్నులు ఉపయోగపడతాయి.

ఆదాయం నిర్ణీత పరిధి దాటినప్పుడు..

గత ఆర్థిక సంవత్సరం కనీస మినహాయింపు తర్వాత కూడా మీ వార్షిక ఆదాయం నిర్ణీత పరిధి దాటినట్లయితే ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడం తప్పనిసరి. డిడక్షన్లు, రిబేట్ల కారణంగా పన్ను పోటు ఏ మాత్రం లేకపోయినా రిటర్న్‌ ఫైల్‌ చేయడమే మంచిది.

రుణ అర్హత పెరుగుదల

గృహ, వ్యక్తిగత, విద్య లేదా వ్యాపార రుణాల దరఖాస్తులను పరిశీలించేటప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కనీసం రెండు మూడు సంవత్సరాల వరుస ఐటీ రిటర్నులు అడుగుతాయి. ఆ రిటర్నుల్లోని అంశాల ఆధారంగా మీ ఆదాయాన్ని మీ అర్హత, క్రెడిబిలిటీని అంచనా వేసి.. మీకు ఇచ్చే రుణాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. స్వయం ఉపాధిలో ఉన్న వ్యక్తులు, ఫ్రీలాన్సర్ల రుణ అర్హత నిర్ణయంలో ఐటీ రిటర్నుల చరిత్ర బాగా ఉపయోగపడుతుంది.

కొన్ని కేసుల్లో తప్పనిసరి

మీ ఆదాయం.. ఆదాయ పన్ను పరిధిలోకి రాకపోయినా ఈ కింది సంఘటనల్లో ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయక తప్పదు. అవేమిటంటే?

  • ఒక ఆర్థిక సంవత్సరంలో కరెంట్‌ అకౌంట్‌ ఖాతాలో రూ.కోటికి మించి డిపాజిట్‌ చేసినప్పుడు

  • విదేశీ పర్యటనల్లో రూ.2 లక్షలకు మించి ఖర్చు చేసినప్పుడు

  • ఒక ఆర్థిక సంవత్సరంలో విద్యుత్‌ బిల్లుల కోసం రూ.లక్షకు మించి చెల్లించినప్పుడు.

ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ

శాఖలన్నీ హైడ్రాకు మోకరిల్లాయి

Updated Date - Jul 26 , 2026 | 03:41 AM