పన్నుల తగ్గింపుపైనే ఆశలు..!
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:46 AM
కేంద్ర బడ్జెట్ దగ్గర పడుతోంది. ఇందుకు మరికొద్ది రోజులే సమయం ఉంది. ఆదివారమైనా సరే.. ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. దీంతో ఎప్పటిలానే...
బడ్జెట్‌పై మదుపరుల అంచనాలు
కేంద్ర బడ్జెట్ దగ్గర పడుతోంది. ఇందుకు మరికొద్ది రోజులే సమయం ఉంది. ఆదివారమైనా సరే.. ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. దీంతో ఎప్పటిలానే వచ్చే కేంద్ర బడ్జెట్‌పైనా మదుపరులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు ఏంటో తెలుసుకుందాం.
కేంద్ర బడ్జెట్ అంటే అందరికీ కోటి ఆశలు. అందులోనూ క్యాపిటల్ మార్కెట్ మదుపరుల ఆశల గురించైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తలతో సెన్సెక్స్, నిఫ్టీ ఇప్పటికే ‘బేర్’ పట్టులోకి జారుకున్నాయి. డిఫెన్సివ్ షేర్లుగా ముద్ర పడిన కంపెనీల షేర్లూ ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే కేంద్ర బడ్జెట్ (2026-27)పై మదుపరుల అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ద్రవ్య స్థిరీకరణ
ద్రవ్య స్థిరీకరణ ఎంత బలంగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్ మార్కెట్లకు అంత మంచిది. దాంతో దేశ, విదేశీ మదుపరులకు మన ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పెరిగి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించవచ్చు. అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థలూ మన దేశ పరపతి రేటింగ్‌నూ పెంచే అవకాశం ఏర్పడుతుంది. డాలర్‌తో సహా ప్రధాన కరెన్సీలతో రూపాయి మారకం రేటు పుంజుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) జీడీపీలో ద్రవ్య లోటు 4.8 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) దాన్ని 4.4 శాతం వద్ద కట్టడి చేస్తామని నిర్మలా సీతారామన్ గత ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడుతూ చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) దీన్ని 4.2 లేదా 4.3 శాతానికి తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం జీడీపీలో 58 శాతం వరకు ఉన్న కేంద్ర ప్రభుత్వ రుణ భారాన్నీ 2031 మార్చి నాటికి 50 శాతానికి కుదిస్తామని ప్రకటించారు. ఈ రెండింటికి సంబంధించి వచ్చే కేంద్ర బడ్జెట్‌లో సానుకూల ప్రకటనలు ఉంటే క్యాపిటల్ మార్కెట్‌కు పెద్ద బూస్ట్ లభించినట్టే.
పెట్టుబడులు
ద్రవ్య లోటు, రుణ భారాన్ని కట్టడి చేయడం ఎంత ముఖ్యమో, ఆర్థిక వ్యవస్థకు పెట్టుబడులూ అంతే ముఖ్యం. ఎన్ని రాయితీలు ఇచ్చినా కొవిడ్ తర్వాత ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం లేదు. ఐటీ, డేటా సెంటర్లు, జీసీసీలు, స్టార్ట్‌ప్సలో తప్ప.. ఇతర రంగాల్లో పెద్దగా ప్రైవేట్ పెట్టుబడులు లేవు. నిజం చెప్పాలంటే ప్రభుత్వ పెట్టుబడులే గత కొద్ది సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నాయి. వచ్చే కేంద్ర బడ్జెట్‌లోనూ మౌలిక, రక్షణ, విద్యుత్, తయారీ రంగాలకు ప్రభుత్వం పెద్దఎత్తున కేటాయింపులు చేసే అవకాశం ఉందని మదుపరుల అంచనా.
ఇన్‌ఫ్రా, ఉద్యోగాల కల్పన
సరైన మౌలిక సదుపాయాలు లేకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థా అభివృద్ధి చెందలేదు. చైనా, కొరియా దేశాల అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలే కారణం. దాంతో దేశ, విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తి, ఉద్యోగ అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఆ దేశాలు ప్రధాన ఆర్థిక శక్తులుగా ఎదిగాయి. మన దేశం ఈ విషయంలో ఇటీవల కొద్దిగా ముందంజ వేసినా ఇంకా కుంటి నడక నడుస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు వచ్చే కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల రంగానికి ఆర్థిక మంత్రి మరిన్ని నిధులు కేటాయించాలని మదుపరుల ఆశ. ఇందుకోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్)కు ప్రత్యేక పన్ను రాయితీలు ఇవ్వాలని కోరుతున్నారు. బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తే అది పరోక్షంగా సిమెంట్, స్టీల్, భవన నిర్మాణ సామాగ్రి తయారీ కంపెనీలకూ మేలు చేస్తుంది.
పెట్టుబడుల వ్యూహం
బడ్జెట్ తేదీ దగ్గర పడే కొద్దీ స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మదుపరులు దీర్ఘకాలిక డిఫెన్సివ్ వ్యూహాన్ని అనుసరించడం మంచిది. ప్రస్తుత మార్కెట్ ఆటుపోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి అనేక లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంకులు, ఎంపిక చేసిన కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల (పీఎ్‌సయూ) షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్నాయి. కొద్దిపాటి నష్ట భయాన్ని (రిస్క్) భరించగలిగే మదుపరులు ఈ షేర్లపై ఒక కన్నేయవచ్చు. ఇందులో అనేక పీఎ్‌సయూలు దాదాపు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ) వడ్డీకి సమానమైన స్థాయిలో డివిడెండ్ చెల్లించే కంపెనీలు. రిటైల్ మదుపరులు ప్రస్తుత మార్కెట్ దిద్దుబాటును ఇలాంటి షేర్ల కొనుగోలుకు ఉపయోగించుకోవడం మంచిది.
పెట్టుబడుల ఉపసంహరణ
ప్రభుత్వ రంగ సంస్థల (పీఎ్‌సయూ) పెట్టుబడుల ఉపసంహరణపై వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి చేసే ప్రకటన కోసం రిటైల్ మదుపరులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.47,000 కోట్లు లక్ష్యంగా నిర్ణయించినా ఇప్పటి వరకు రూ.10,000 కోట్లు కూడా వసూలు కాలేదు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ఎంత భారీగా ఉంటే ప్రభుత్వ రుణ సేకరణ అంతగా తగ్గి.. ఆర్థిక వ్యవస్థలో నిధుల లభ్యత అంతగా పెరుగుతుంది. ఆ ప్రభావం క్యాపిటల్ మార్కెట్‌పైనా కనిపిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం కనీసం రూ.50,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లయినా ఈ పద్దు ద్వారా సేకరించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవాలని మదుపరులు కోరుతున్నారు.
పన్నుల హేతుబద్దీకరణ
మదుపరులు మూలధన లాభాల పన్ను, ఆదాయ పన్నుల విధింపులో స్థిరత్వం కోరుకుంటున్నారు. 2024-25 బడ్జెట్‌లో క్యాపిటల్ మార్కెట్లో వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పై 12.5 శాతం పన్ను విధించారు. అప్పటి వరకు ఏడాదికి మించి ఉంచుకుని అమ్మే లిస్టెడ్ కంపెనీల షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల యూనిట్లు అమ్మగా వచ్చిన లాభాలకు పూర్తి పన్ను మినహాయింపు ఉండేది. ఏడాది లోపు అమ్ముకుంటే వచ్చే స్వల్ప కాలిక మూలధన లాభాల (ఎ్‌సటీసీజీ) పై మాత్రమే 12.5 శాతం ఉండేది. ఇప్పుడు దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం, స్వల్పకాలిక మూలధన లాభాలపై 20 శాతం చొప్పున పన్ను విధిస్తున్నారు. దీర్ఘకాలిక లాభాల పన్ను మినయింపు పరిమితిని గత బడ్జెట్ (2025-26) లో రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలకు మాత్రమే పెంచారు. ఈ కొద్దిపాటి మినహాయింపు పెంపు మదుపరులకు పెద్దగా రుచించలేదు. కనీసం వచ్చే కేంద్ర బడ్జెట్‌లోనైనా ఎల్‌టీసీజీని హేతుబద్ధం చేసి రిటైల్ మదుపరులకు ఇచ్చే మినహాయింపు పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..