Share News

వడ్డీ లేని ఈఎంఐలు.. ఆదమరిస్తే ఇక అంతే..

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:24 AM

మధ్య తరగతి జీవికి ఈఎంఐ కొనుగోళ్లంటే ఎక్కడ లేని ఆసక్తి. అది కూడా వడ్డీ లేని ఈఎంఐల చెల్లింపులంటే ఇక చెప్పేదేముంది. అవసరం ఉన్నా లేకున్నా ఎగబడి కొనేస్తుంటారు...

వడ్డీ  లేని  ఈఎంఐలు.. ఆదమరిస్తే ఇక అంతే..

మధ్య తరగతి జీవికి ఈఎంఐ కొనుగోళ్లంటే ఎక్కడ లేని ఆసక్తి. అది కూడా వడ్డీ లేని ఈఎంఐల చెల్లింపులంటే ఇక చెప్పేదేముంది. అవసరం ఉన్నా లేకున్నా ఎగబడి కొనేస్తుంటారు. తమ అమ్మకాలు పెంచుకునేందుకు వ్యాపారులకు ఇదో పెద్ద వ్యూహం. పేరుకు వడ్డీ లేని ఈఎంఐలే అయినా.. లోతుగా పరిశీలిస్తే గానీ అసలు కిటుకు తెలియదు.

పండగల సీజన్‌ మొదలైంది. తమ ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకునేందుకు కంపెనీలు, వ్యాపారులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అందులో వడ్డీ లేని ఈఎంఐల ఆఫర్‌ ఒకటి. చాలా మంది గుడ్డిగా ఈ వడ్డీ రహిత ఈఎంఐ ఆఫర్లు నిజమని నమ్మి అవసరం ఉన్నా, లేకున్నా వస్తువులు కొనేస్తుంటారు. జాగ్రత్తగా పరిశీలిస్తే నిజానికి ఇవేమీ వడ్డీ రహిత ఈఎంఐలు కాదు. ప్రాసెసింగ్‌ ఫీజులు, ఈఎంఐ (నెలవారీ వాయిదా) లేటుగా చెల్లిస్తే భారీ పెనాల్టీలు ఉంటాయి. దీనికి తోడు ఈఎంఐలు చెల్లించడంలో ఏ మాత్రం ఆలస్యమైనా ఆయా వ్యక్తుల క్రెడిట్‌ స్కోరు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఏదైనా వస్తువును వడ్డీ రహిత ఈఎంఐతో కొనే ముందు ఈ కింది విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

మొత్తం ధర

ఏదైనా వస్తువును వడ్డీరహిత ఈఎంఐతో కొనే ముందు ఆ వస్తువు అసలు ధర ఎంతో తెలుసుకోవాలి. వడ్డీరహిత ఈఎంఐతో ఈ వస్తువు కొనుక్కోండి బాగుంటుంది అని కంపెనీలు, డీలర్లు సహజంగానే ఊదరగొడతారు. అయితే ఈ ఆఫర్‌ కింద కంపెనీలు, డీలర్లు ప్రాసెసింగ్‌ ఫీజు, కన్వీనియన్స్‌ చార్జీలు, పన్నులు, ఇతర ఖర్చుల పేరుతో బాగానే గుంజుతారు.

ఉదాహరణకు రూ.30,000 విలువైన ఒక వస్తువుని మీరు మూడు మూడు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లించేలా వడ్డీ రహిత ఈఎంఐతో కొంటున్నారనుకుందాం. అప్పుడు ఒక్కో విడత రూ.10,000 చొప్పున చెల్లిస్తే సరిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. కంపెనీలు అప్‌ఫ్రంట్‌ ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఖర్చుల పేరుతో బాగానే మన దగ్గర నుంచి వసూలు చేస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వస్తువుని కొనే ముందే.. ఒకేసారి చెల్లించి కొంటే ఎంత అవుతుంది? వడ్డీ రహిత ఈఎంఐలతో కొంటే ఎంత అవుతుంది? అనే విషయం పూర్తిగా తెలుసుకోవాలి.


రుణదాత, రుణ మొత్తం

ఎన్‌బీఎ్‌ఫసీలు, బ్యాంకులే ఈ తరహా వడ్డీరహిత ఈఎంఐ రుణాలు ఇస్తుంటాయి. ఇవి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నియంత్రణలోని సంస్థలా? కాదా? అనే విషయాన్ని వినియోగదారులు ముందే తెలుసుకోవాలి. అలాగే వీరి కస్టమర్‌ సపోర్ట్‌, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ విశ్వసనీయత గురించీ తెలుసుకోవాలి.

పై విషయాలతో పాటు వీరు ఇచ్చే వడ్డీరహిత ఈఎంఐ రుణం మీ క్రెడిట్‌ కార్డుతో ముడిపడి ఉంటుందా? లేదా? అనే విషయం కూడా ముఖ్యమే. ఒకవేళ ముడిపడి ఉంటే, ఈ వడ్డీరహిత ఈఎంఐ రుణాలు, మీ భవిష్యత్‌ రుణ పరపతిని పరిమితం చేస్తాయి. అదే జరిగితే ఈ ఈఎంఐల చెల్లింపు కాలంలో ఏదైనా అత్యవసర ఆర్థిక పరిస్థితి ఏర్పడితే, క్రెడిట్‌ కార్డుపై అవసరమైన స్థాయిలో రుణం పుట్టదు.

క్యాన్సిలేషన్‌, రిఫండ్‌ నిబంధనలు

వడ్డీరహిత ఈఎంఐ చెల్లింపు పద్ధతిలో కొన్న వస్తువులు ఒక్కోసారి నాణ్యతా లోపంతో వినియోగదారుడికి సమస్యగా మారవచ్చు. అప్పుడు ఆ వస్తువును, కొన్ని షరతులకు లోబడి కొన్న వ్యాపారికే రిటర్న్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వడ్డీరహిత ఈఎంఐల కింద చెల్లించిన మొత్తాలను బ్యాంకులు లేదా ఎన్‌బీఎ్‌ఫసీలు ఎలా రిఫండ్‌ చేస్తాయి? అనేది పెద్ద ప్రశ్న. ఆ వస్తువును కొనే ముందే ఈ విషయం తెలుసుకుని కొంటే ఈ సమస్య తలెత్తదు.


సౌలభ్యం కంటే ధరే కీలకం

వడ్డీరహిత ఈఎంఐతో వస్తువులను కొనేటప్పుడు చాలా మంది ముందూ వెనకా ఆలోచించరు. ఆ వస్తువు నిజంగా అవసరామా? కాదా? అవసరమైతే వడ్డీరహిత ఈఎంఐ లేకుండా ఎంతకు వస్తుంది? అనే విషయాలు ఆలోచించరు. వడ్డీరహిత ఈఎంఐ కంటే, ఒకేసారి చెల్లింపుతో చౌకగా వస్తుంటే, ఆ మార్గాన్నే ఎంచుకోవడం మంచిది. దానివల్ల అనవసరమైన ఆర్థిక భారం తగ్గుతుంది. క్రెడిట్‌ స్కోరూ బాగుంటుంది.

వడ్డీరహిత ఈఎంఐ రుణాలతో వస్తువులు కొనుగోలు చేసే వారు. రుణాలు తీసుకునే వారు ప్రతి ఒక్కరూ పై విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్లటం మంచిది.

చెల్లింపుల్లో విఫలమైతే?

వడ్డీరహిత ఈఎంఐ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లించాలి. లేకపోతే ఆ వస్తువు కొనుగోలు పెద్ద భారంగా మారుతుంది. ఈఎంఐ ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లింపు ఆలస్యమైతే పెనాల్టీలు ఏ స్థాయిలో ఉంటాయో, ఆ వస్తువు కొనుగోలు చేసే ముందే పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే చెల్లింపుల్లో జరిగే ఆలస్యాన్ని వడ్డీరహిత ఈఎంఐ రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు క్రెడిట్‌ బ్యూరోలకు తెలియజేస్తాయా? లేదా? అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఒకవేళ తెలియజేస్తే అది మీ పరపతి స్కోరును దెబ్బతీస్తుంది. ఈ విషయాలతో పాటు ఈఎంఐల చెల్లింపుల్లో విఫలమైతే పెనాల్టీలు ఎంతో కూడా తెలుసుకున్న తర్వాతే వడ్డీరహిత ఈఎంఐతో ఉత్పత్తులను కొనుగోలు చేయటం లేదా రుణాలను తీసుకోవటం బెటర్‌.

రీపేమెంట్‌ షెడ్యూల్‌

వడ్డీరహిత ఈఎంఐ చెల్లింపులను ఎంచుకుంటే, ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఎంత మొత్తం చొప్పున చెల్లించాలి? ఆ ఇన్‌స్టాల్‌మెంట్లను ఏయే తేదీల్లో చెల్లించాలి? అనే విషయం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. వీలైనంత వరకు స్వల్పకాలంలో చెల్లించేలా మూడు ఇన్‌స్టాల్‌మెంట్స్‌ ఎంచుకోవడం మంచిది. దీనివల్ల చెల్లింపులను ముందుగానే ప్లాన్‌ చేసుకోవచ్చు. అయితే మీరు చెల్లించాల్సిన నెలవారీ అద్దెలు, ఇంటి ఖర్చులు, ఇప్పటికే చెల్లిస్తున్న ఈఎంఐలు, నెలవారీ పొదుపు చేయాల్సిన మొత్తాలు పోను మాత్రమే.. ఈ వడ్డీ రహిత ఈఎంఐల ఇన్‌స్టాల్‌మెంట్లు ఉండాలి. లేకపోతే తీవ్ర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్‌’ నోటీసులు

సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్

Updated Date - Sep 06 , 2026 | 05:28 AM