ఆంథ్రోపిక్‌తో ఇన్ఫోసిస్ జట్టు
ABN , Publish Date - Feb 18 , 2026 | 02:21 AM
అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీ ఆంథ్రోపిక్‌తో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మంగళవారం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా టెలికాం, ఆర్థిక సేవలు..
టెలికాం, ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాలకు ఏఐ పరిష్కారాల అభివృద్ధి
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీ ఆంథ్రోపిక్‌తో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మంగళవారం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా టెలికాం, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్ కంపెనీలకు ఏఐ పరిష్కారాలను అందించనుంది. తొలుత టెలీకమ్యూనికేషన్స్ రంగ కంపెనీల అవసరాలకు తగినట్లుగా ఏఐ ఏజెంట్ల అభివృద్ధి, డెలివరీ కోసం ఆంథ్రోపిక్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌ను ప్రారంభించి..ఆ తర్వాత ఇతర రంగాలకు విస్తరించనున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. కంపెనీలు తమ సంక్లిష్ట కార్యకలాపాలను యాంత్రీకరించడంతో పాటు వేగంగా సాఫ్ట్‌వేర్ డెలివరీ, నిబంధనలకు లోబడి ఏఐ వినియోగించుకునేందుకు తోడ్పడనున్నట్లు తెలిపింది.ఈ భాగస్వామ్యంలో భాగంగా ఇన్ఫోసిస్ తన టోపాజ్ ఏఐ ఆఫరింగ్స్‌ను ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ కోడ్ సహా అన్ని క్లాడ్ మోడల్స్‌తో అనుసంధానించనుంది. ‘‘ఏఐ వ్యాపారాలను పరివర్తించడంతో పాటు పరిశ్రమల నిర్వహణ, ఆవిష్కరణలను కూడా పునర్‌నిర్వచిస్తోంది. ఆంథ్రోపిక్‌తో మా భాగస్వామ్యం ఎంటర్‌ప్రైస్ ఏఐ పురోగతిదిశగా వ్యూహాత్మక ముందడుగు. సంస్థల విలువ పెంపుతో పాటు మరింత తెలివిగా కార్యకలాపాల నిర్వహణ, స్థితిస్థాపకత, బాధ్యతాయుతంగా పనిచేసేందుకు ఏఐ దోహదపడనుంద’’ని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం