ఇన్ఫీ కొత్త సారథి ఆశిష్
ABN , Publish Date - Jul 24 , 2026 | 02:19 AM
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ గురువారం త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కీలక ప్రకటన చేసింది. కంపెనీ భవిష్యత్ సారథిగా ఆశిష్ కుమార్ డాష్‌ను...
2027 మార్చి 31తో ముగియనున్న ప్రస్తుత సీఈఓ పరేఖ్ పదవీకాలం
ఏప్రిల్ 1న ఆశి్‌షకు కంపెనీ పగ్గాలు
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ గురువారం త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కీలక ప్రకటన చేసింది. కంపెనీ భవిష్యత్ సారథిగా ఆశిష్ కుమార్ డాష్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ పదవీకాలం 2027 మార్చి 31తో ముగియనుంది. ఆ తర్వాత పరేఖ్ స్థానాన్ని ఆశిష్ కుమార్ భర్తీ చేస్తారు. అంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం (2027-28) మొదటి రోజు (ఏప్రిల్ 1) నుంచి ఆశిష్ కంపెనీ పగ్గాలు చేపట్టనున్నారు. ‘‘కంపెనీ కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్‌ను నియమించాలని బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం ఐటీ రంగం గణనీయ మార్పులకు లోనవుతోంది. భవిష్యత్ సారథి ప్రస్తుత పరివర్తన కాలంలో కంపెనీని విజయవంతంగా ముందుకు నడిపించడంతో పాటు ఇన్ఫోసి్‌సను ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలబెట్టిన విలువలు, కస్టమర్ల నమ్మకాన్ని కాపాడే వివేకాన్ని కలిగి ఉండాలని బోర్డు కోరుకుంది. అలాంటి సామర్థ్యాలున్న అంతర్గత వ్యక్తే తదుపరి సీఈఓగా కాబోతున్నాడని తెలపడానికి సంతోషిస్తున్నాను’’ అని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని ఈ సందర్భంగా అన్నారు.
9 ఏళ్లుగా సలీల్ పరేఖ్ సారథ్యంలో: 2018 జనవరిలో ఇన్ఫోసిస్ పగ్గాలు చేపట్టిన సలీల్ పరేఖ్‌కు సీఈఓగా ఇది రెండో టర్మ్. గత 9 ఏళ్లుగా కంపెనీకి సారథ్యం వహిస్తున్నారు. కంపెనీ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన వ్యవస్థాపకేతర సీఈఓ ఈయనే. పరేఖ్ నేతృత్వంలో ఇన్ఫోసిస్ క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, కృత్రిమ మేధ (ఏఐ) విభాగాల్లో తన స్థానాన్ని పటిష్ఠపరుచుకుంది. అలాగే, కంపెనీ వార్షికాదాయం 2,000 కోట్ల డాలర్ల మైలురాయిని దాటింది. కాగా, పరేఖ్‌కు ముందు సంస్థ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తొలి సహ వ్యవస్థాకేతర వ్యక్తి విశాల్ సిక్కా. కానీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తితో పాటు ఇతర సహ వ్యవస్థాపకులతో అభిప్రాయ బేధాల కారణంగా 2017 ఆగస్టులో సిక్కా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఎవరీ ఆశిష్..?
ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆశిష్.. 30 ఏళ్లకు పైగా ఇన్ఫోసి్‌సలో పనిచేస్తున్నారు. కస్టమర్ ఆపరేషన్స్, ప్రాజెక్ట్ డెలివరీ, గ్లోబల్ ఆపరేషన్స్ విభాగాల్లో సీనియర్ నాయకుడిగా సేవలందిస్తూ సంస్థలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ప్రస్తుతం సర్వీసెస్, యుటిలిటీస్, రిసోర్స్, ఎనర్జీ అండ్ ఎంటర్‌ప్రైస్ సస్టెయినబిలిటీ విభాగాల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ఈవీపీ) అండ్ గ్లోబల్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫార్చూన్ 500, గ్లోబల్ 2000 కంపెనీలకు ఇన్ఫోసిస్ అందించే డిజిటల్ పరివర్తన సేవలకు ఈయనే నాయకత్వం వహిస్తున్నారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి గ్లోబల్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌తోపాటు లండన్ బిజినెస్ స్కూల్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను కూడా పూర్తి చేసిన ఆశిష్.. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్), ఇతర ఆంతర్జాతీయ సదస్సుల్లో ఇన్ఫోసి్‌సకు ప్రాతినిథ్యం వహిస్తుంటారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు