ఐటీలో ఏఐ సేవల హవా!
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:59 AM
దేశీయ ఐటీ కంపెనీలకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవల గిరాకీ గణనీయంగా పెరుగుతోంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయంలో...
2-3 ఏళ్లలో కంపెనీ ఆదాయంలో కృత్రిమ మేధ సేవలదే సగం వాటా..
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్
న్యూఢిల్లీ: దేశీయ ఐటీ కంపెనీలకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవల గిరాకీ గణనీయంగా పెరుగుతోంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయంలో ఏఐ సేవల వాటా 8 శాతంగా నమోదైందని.. త్రైమాసిక ప్రాతిపదికన ఇది రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతోందని కంపెనీ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ తెలిపారు. వచ్చే 2-3 ఏళ్లలో కంపెనీ ఆదాయంలో దాదాపు సగం వాటా ఏఐ సేవల నుంచే లభించవచ్చన్నారు. ఏఐ ఏజెంట్ల అభివృద్ధి, కోడింగ్ వర్క్, పాత టెక్నాలజీ ఆధునికీకరణ వంటి పనులు కంపెనీ ప్రస్తుత వ్యాపార సైజులో చాలా తక్కువే అయినప్పటికీ, వేగంగా పెరుగుతున్నాయని, మరికొద్ది త్రైమాసికాల్లో వీటి వాటా 20-30 శాతానికి చేరుకోవచ్చని అన్నారు. ‘బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ 2026’ సదస్సు లో మంగళవారం పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పరేఖ్ ఇంకా ఏమన్నారంటే..
కృత్రిమ మేధ (ఏఐ) సేవల డిమాండ్ భారీగా ఉంది. ఇది ఇన్ఫోసి్‌సతో పాటు టెక్నాలజీ పరిశ్రమకు శుభ పరిణామం
గత ఏడాది ఇన్ఫోసిస్ 20,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకుంది. ఈసారి మరో 20 వేల మంది నియమించుకునే ఆలోచనలో ఉంది. వీరికి ఏఐలో శిక్షణ ఇచ్చి, క్లయింట్ల ఏఐ పరివర్తన పనులను అప్పగిస్తున్నాం
ఇన్ఫోసి్సలోని 3 లక్షల మంది ఉద్యోగుల్లో 80,000 మంది ఇప్పటికే క్లయింట్ల కోసం అభివృద్ధి చేస్తున్న కోడింగ్ టూల్స్‌పై, కొన్ని అంతర్గత ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు.
ఏఐతో ఉద్యోగాలు పోతాయన్నది అబద్ధం: నీలేకని
శరవేగంగా వృద్ధి చెందుతోన్న కృత్రిమ సాంకేతికత కారణంగా దేశీయ ఐటీ సేవల రంగంలో భారీగా ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చన్న భయాలను ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తోసిపుచ్చారు. అది పచ్చి అబద్ధమని, ఈ సాంకేతికతలోకి వస్తున్న భారీ పెట్టుబడుల ప్రయోజనం కోసం జరుగుతున్న మార్కెటింగ్ అని అన్నారు. ఏఐ టెక్నాలజీ వృద్ధితో ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీల సేవలకు డిమాండ్ ఎన్నడూ లేనంతగా పెరిగిందన్నారు. ఎందుకంటే, వ్యాపార కంపెనీల ఏఐ సాంకేతిక పరివర్తనం సంక్లిష్టమైనదని.. అందుకు ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీల అవసరం ఉంటుందన్నారు. కాబట్టి ఐటీ సంస్థలు కొత్త సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు ఉద్యోగులకు ఈ ఆధునిక సాంకేతికతల్లో శిక్షణ ఇవ్వాలని నీలేకని సూచించారు.
ఇవి కూడా చదవండి:
క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్
నాసా–స్పేస్ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ISSకు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక
వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్‌పై చైనాకు భారత్ కౌంటర్