ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
ABN , Publish Date - Mar 10 , 2026 | 07:35 PM
ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. కొత్త సీఈఓ నియామకం పూర్తయ్యే వరకు ఎండీ రాహుల్ భాటియా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రాహుల్ భాటియా తాత్కాలికంగా సంస్థ బాధ్యతలు చేపట్టారు. భాటియా ప్రస్తుతం ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇండిగో ఫ్లైట్ రద్దు ఉదంతం తరువాత దాదాపు మూడు నెలలకు పీటర్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న పీటర్ రాజీనామాకు ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ బోర్డు ఆమోదం తెలిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాజీనామా తక్షణం అమల్లోకి వచ్చేలా నోటీసు పీరియడ్ నుంచి మినహాయింపు కావాలన్న పీటర్ అభ్యర్థననూ బోర్డు ఆమోదించింది. 2022లో పీటర్ ఇండిగో సంస్థ సీఈఓ బాధ్యతలు చేపట్టారు. ఇక కొత్త సీఈఓ ఎంపిక పూర్తయ్యే వరకూ రాహుల్ భాటియా ఎయిర్‌లైన్స్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.
గతేడాది డిసెంబర్‌లో ఇండిగో కార్యకలాపాల్లో ఆటంకాలు ఏర్పడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ మధ్య దాదాపు 2,507 ఫ్లైట్లు రద్దయ్యాయి. 1,852 విమానాల రాకపోకల్లో జాప్యం చోటుచేసుకుంది. ఈ ఆటంకాల వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది ప్యాసింజర్లు ఇక్కట్ల పాలయ్యారు. ముఖ్యంగా పైలట్‌ల విధులకు సంబంధించి కొత్త నిబంధనల అమలు విషయంలో సంస్థ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయలేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఘటన అనంతరం, డీజీసీఈ ఇండిగో శీతాకాల విమాన షెడ్యూల్‌ను 10 శాతం మేర కుదించింది. ఈ ఏడాది జనవరిలో సంస్థపై రూ.22 కోట్ల జరిమానా విధించింది. వ్యవస్థాగత మార్పుల కోసం రూ.50 కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని కూడా తేల్చి చెప్పింది.
ఇవి కూడా చదవండి..
నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..
ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..