ఎగుమతుల్లో 26 శాతం వృద్ధి
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:57 AM
భారత ఎగుమతుల్లో జోరు కొనసాగుతోంది. ఈ ఆగస్టులో వస్తు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 26.12 శాతం వృద్ధితో 4,381 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.20 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి....
ఆగస్టులో రూ.4.20 లక్షల కోట్లకు చేరిక
2022 జూన్ తర్వాత ఇదే అధిక వృద్ధి
ఐదు నెలల కనిష్ఠానికి వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: భారత ఎగుమతుల్లో జోరు కొనసాగుతోంది. ఈ ఆగస్టులో వస్తు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 26.12 శాతం వృద్ధితో 4,381 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.20 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. 2022 జూన్ తర్వాత అత్యధిక వృద్ధి ఇది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో పెరుగుదల ఇందుకు దోహదపడింది. ఇదే నెలలో దిగుమతులు దాదాపు 14.1 శాతం పెరిగి 7,076 కోట్ల డాలర్ల (రూ.6.78 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. వాణిజ్య లోటు ఐదు నెలల కనిష్ఠ స్థాయి 2,686 కోట్ల డాలర్లకు తగ్గింది. బంగారం దిగుమతుల్లో తగ్గుదల ఇందుకు కారణమని మంగళవారం ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏప్రిల్-ఆగస్టు కాలానికి ఎగుమతులు 17.85 శాతం పెరిగి 21,591 కోట్ల డాలర్లకు.. దిగుమతులు 18.21 శాతం పెరిగి 36,300 కోట్ల డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 14,709 కోట్ల డాలర్లకు పెరిగింది.
57.7 శాతం తగ్గిన బంగారం దిగుమతులు
బంగారం దిగుమతులు ఆగస్టులో 230 కోట్ల డాలర్లకు తగ్గాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన దిగుమతులతో (540 కోట్ల డాలర్లు) పోల్చితే 57.7 శాతం తక్కువ. బంగారం భగ్గుమంటున్న నేపథ్యంలో దిగుమతులు తగ్గడాన్ని బట్టి చూస్తే, అధిక ధర భారత్‌లో బంగారంపై ఆసక్తి తగ్గుదలకు కారణమవుతోందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:
అక్టోబర్ 3న ‘పాన్-IIT AP సమ్మిట్ 2026’: సీఎం చంద్రబాబు
తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు లొంగుబాటు