Share News

మళ్లీ ధరల సెగ

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:25 AM

దేశంలో ధరల సెగ కొనసాగుతోంది. జనవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.75 శాతంగా నమోదైంది. తొలిసారిగా 2024 నాటి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత లెక్కల ప్రకారం జనవరి నెల ద్రవ్యోల్బణ...

మళ్లీ ధరల సెగ

  • జనవరిలో ద్రవ్యోల్బణం 2.75 శాతంగా నమోదు

  • తెలంగాణలో అత్యధికంగా 4.92 శాతం

  • తొలిసారిగా 2024 బేస్‌ ఇయర్‌తో ద్రవ్యోల్బణ గణాంకాలు

న్యూఢిల్లీ: దేశంలో ధరల సెగ కొనసాగుతోంది. జనవరి నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.75 శాతంగా నమోదైంది. తొలిసారిగా 2024 నాటి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత లెక్కల ప్రకారం జనవరి నెల ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా తెలంగాణలో మాత్రం ధరల సెగ దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేని విధంగా 4.92 శాతంగా నమోదైంది. కేరళ, తమిళనాడు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది జనవరిలో నమోదైన 4.26 శాతంతో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో నమోదైన రిటైల్‌ ద్రవ్యోల్బణం 1.51 శాతం తక్కువ. కాకపోతే 2025 జనవరి నాటి రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2012 నాటి సీపీఐ ఆధారంగా లెక్కించారు. ఈ ఏడాది జనవరి నుంచి రిటైల్‌ ద్రవ్యోల్బణ లెక్కింపునకు ప్రభుత్వం 2024 నాటి ధరల ఆధారంగా రూపొందించిన సీపీఐని ప్రామాణికంగా తీసుకుంటోంది. సీపీఐ కోసం పరిగణనలోకి తీసుకునే వస్తు, సేవల సంఖ్యలోనూ మార్పులు చేశారు. గతంలో 259 వస్తువులు, 40 సేవలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటే, 2024 సీపీఐ లెక్కింపు కోసం 308 వస్తువులు, 50 సేవల ధరలను పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే పట్టణ, గ్రామీణ మార్కెట్ల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి నెలలో ఉల్లిగడ్డలు, బంగాళా దుంప, కంది పప్పు, బఠానీ వంటి ఉత్పత్తులు తక్కువ ద్రవ్యోల్బణ విభాగంలో ఉండగా వెండి ఆభరణాలు, టమాటా, కొబ్బరి, బంగారం, వజ్రాలు, ప్లాటినం జువెలరీ, కొబ్బరి నూనె గరిష్ఠ ద్రవ్యోల్బణంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 13 , 2026 | 05:26 AM