వరుసగా నాలుగో రోజూ ర్యాలీ
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:12 AM
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజూ ర్యాలీ కొనసాగింది. మంగళవారం ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 2 శాతం పెరిగాయి
సెన్సెక్స్ 1,225 పాయింట్లు అప్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజూ ర్యాలీ కొనసాగింది. మంగళవారం ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 2 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో దిద్దుబాటు, విదేశీ నిధులు రావడం ఇందుకు దోహదపడింది. ఫలితంగా బీఎ్‌సఈ సెన్సెక్స్ 1,225.07 పాయింట్లు (1.62శాతం) పెరిగి డే గరిష్ఠ స్థాయి 76,917.85 వద్ద, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 370.05 పాయింట్ల (1.58శాతం) లాభంతో 23,810.85 వద్ద క్లోజైంది. మార్కెట్లలో ర్యాలీ నేపథ్యంలో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.486 లక్షల కోట్లకు చేరుకుంది.
ఎన్‌ఎస్ఈఐఎక్స్ ట్రేడింగ్ సమయం పెంపు: ఎన్‌ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్ఈఐఎక్స్) తన మార్కెట్ ట్రేడింగ్ సమయాన్ని దాదాపు 21 గంటల నుంచి 23.5 గంటలకు పెంచింది. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్కెట్ కార్యకలాపాలు తెల్లవారుజామున 3.15 గంటలకు ప్రారంభమై మర్నాడు ఉదయం 2.45 గంటల వరకు కొనసాగుతాయి. ఇది సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది.
బీఎల్‌ఎస్ పాలిమర్ బంపర్ లిస్టింగ్: బీఎల్‌ఎస్ పాలిమర్స్ షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్లలో నమోదయ్యాయి. బీఎస్ఈలో ఈ షేరు ఇష్యూ ధర రూ.150తో పోల్చితే 62.73శాతం ప్రీమియంతో 244.10 వద్ద లిస్ట్ అయ్యిం ది. ఇంట్రాడేలో ఏకంగా 90.16శాతం లాభపడి రూ.285.25 స్థాయిని తాకింది. చివరకు 79.5శాతం లాభంతో రూ.269.30 వద్ద క్లోజైంది. ఎన్‌ఎస్ఈలో ఇష్యూ ధర కన్నా 79.2శాతం లాభంతో రూ.268.80 వద్ద క్లోజైంది