Share News

రూ.1,410 లక్షల కోట్లు

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:01 AM

భారతీయులు సారథ్యం వహిస్తున్న టాప్‌ గ్లోబల్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రెండేళ్లలో 53 శాతం వృద్ధితో ఏకంగా 15 లక్షల కోట్ల డాలర్లకు (రూ.1,410 లక్షల కోట్లు లేదా రూ.14.10 కోట్ల కోట్లు) చేరుకుంది...

రూ.1,410 లక్షల కోట్లు

భారతీయులు సారథ్యం వహిస్తున్న టాప్‌ గ్లోబల్‌ కంపెనీల మొత్తం విలువ ఇది..

  • ఏఐ బూమ్‌తో 53% పెరిగిన సంస్థల సంపద

  • అగ్రస్థానంలో ఆల్ఫాబెట్‌ సారథి పిచాయ్‌

  • మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌ సత్య నాదెళ్ల ఃనం.2

  • హెచ్‌ఎ్‌సబీసీ-హురున్‌ గ్లోబల్‌ ఇండియన్స్‌ లిస్ట్‌ విడుదల

ముంబై: భారతీయులు సారథ్యం వహిస్తున్న టాప్‌ గ్లోబల్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రెండేళ్లలో 53 శాతం వృద్ధితో ఏకంగా 15 లక్షల కోట్ల డాలర్లకు (రూ.1,410 లక్షల కోట్లు లేదా రూ.14.10 కోట్ల కోట్లు) చేరుకుంది. కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ బూమ్‌ ఇందుకు ప్రధాన కారణమని, 2024లో ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ 9.9 లక్షల కోట్ల డాలర్లుగా ఉందని గురువారం విడుదలైన ‘హెచ్‌ఎ్‌సబీసీ హురున్‌ గ్లోబల్‌ ఇండియన్స్‌ లిస్ట్‌ 2026’ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో గూగుల్‌తో పాటు దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు సారథ్యం వహిస్తున్న సుందర్‌ పిచాయ్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఆల్ఫాబెట్‌ మార్కెట్‌ విలువ 4.2 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. కాగా, 2.6 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌ సత్య నాదెళ్లకు రెండో స్థానం దక్కింది. మైక్రాన్‌ టెక్నాలజీ (1.4 లక్షల కోట్ల డాలర్లు)కి చెందిన సంజయ్‌ మెహ్రోత్రా మూడో స్థానంలో ఉన్నారు. ఈ జూన్‌ 25 నాటికి కంపెనీల మార్కెట్‌ విలువ ఆధారంగా ఈ లిస్ట్‌ను రూపొందించినట్లు, కనీసం 250 కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన సంస్థలను పరిగణనలోకి తీసుకున్నట్లు హురున్‌ తెలిపింది. భారత్‌కు వెలుపల ప్రధాన కార్యాలయాలు కలిగిన 200 కంపెనీలను నడిపిస్తున్న 236 మంది భారత సంతతి నాయకులకు ఇందులో చోటు దక్కింది. ఈ జాబితాలోని కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 53 లక్షల మంది పనిచేస్తున్నారని.. 2025లో వీటి మొత్తం ఆదాయం 2.5 లక్షల కోట్ల డాలర్లకు, మొత్తం లాభం 41,600 కోట్ల డాలర్లకు చేరుకుందని రిపోర్టు వెల్లడించింది. హురున్‌ 2024లో తొలిసారిగా గ్లోబల్‌ ఇండియన్స్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇది రెండో విడత జాబితా. మరిన్ని విషయాలు..


  • లిస్ట్‌లోని 200 కంపెనీల్లో 103 ఏఐ రంగ కంపెనీలే. వాటి మొత్తం విలువ 10.7 లక్షల కోట్ల డాలర్లు. అంటే, జాబితాలోని కంపెనీల మొత్తం విలువలో వీటి వాటాయే 71 శాతం.

  • ఈసారి జాబితాలో కొత్తగా 76 కంపెనీలకు చోటు దక్కింది. లిస్ట్‌లోని 200 కంపెనీల్లో 127 పబ్లిక్‌ లిస్టెడ్‌ సంస్థలు. మిగతా 73 ప్రైవేట్‌ కంపెనీలు.

  • జాబితాలో 49 స్టార్ట్‌పలు కూడా ఉన్నాయి. వాటి మొత్తం విలువ 39,800 కోట్ల డాలర్లు.

  • జాబితాలోని సారథుల్లో 53 శాతం మంది పిచాయ్‌, నాదెళ్ల తరహా వృత్తి నిపుణులు కాగా.. 44 శాతం తొలి తరం ఆంత్రప్రెన్యూర్లు. మిగతా మూడు శాతం వ్యాపారాన్ని వారసత్వంగా అందుకున్న రెండో తరం నాయకులు.

  • జాబితాలోని 177 మంది సారథులు అమెరికాలో ఉండగా.. మూడో వంతు మందికి అమెరికాలోని కాలిఫోర్నియా వేదికైంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో 40 మంది ఉన్నారు. దుబాయ్‌ కేంద్రంగా 15 మంది, పాలో ఆల్టో, లండన్‌ కేంద్రంగా సారథ్యం వహిస్తున్న 13 చొప్పున మందికి ఈ లిస్ట్‌లో చోటు లభించింది.

  • లిస్ట్‌లోని వారిలో 15 మంది ఐఐటీ ఢిల్లీ నుంచి అండర్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయగా.. 19 మంది స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మానసిక ఒత్తిడితోనే కుటుంబం ఆత్మహత్య

అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ

Updated Date - Nov 13 , 2026 | 04:01 AM