Share News

ఎగుమతులకు మహా బూస్ట్‌

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:23 AM

భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాని (బీటీఏ)కి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. దీంతో ట్రంప్‌ సుంకాలతో బెంబేలెత్తి పోయిన వాణిజ్య, పారిశ్రామిక రంగాలు హమ్మయ్య అని...

ఎగుమతులకు మహా బూస్ట్‌

  • అమెరికా ట్రేడ్‌ డీల్‌తో ఊపిరి పీల్చుకున్న ఇండియా ఇంక్‌

  • తొలగనున్న వాణిజ్య అడ్డంకులు

  • అమెరికా నుంచి పెరగనున్న ఆర్డర్లు

  • స్వాగతించిన పారిశ్రామిక పెద్దలు

న్యూఢిల్లీ: భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాని (బీటీఏ)కి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. దీంతో ట్రంప్‌ సుంకాలతో బెంబేలెత్తి పోయిన వాణిజ్య, పారిశ్రామిక రంగాలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాయి. ఇక అమెరికా నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు వచ్చిపడతాయని ఆశిస్తున్నాయి. ఈ శుభవార్త వెలువడిన మరుసటి రోజే సెన్సెక్స్‌, నిఫ్టీ రేసుగుర్రాల్లా పరిగెత్తాయి. అమెరికా మార్కెట్‌పై అధికంగా ఆధారపడిన టెక్స్‌టైల్స్‌, జుయెలరీ, ఫార్మా, ఐటీ, ఆటోమొబైల్‌ విడి భాగాలు, ప్రత్యేక రసాయనాలు, ఫార్మా కంపెనీల షేర్లను మదుపరులు ఎగబడి కొన్నారు. దేశ పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి. భారత ఎగుమతులపై ప్రస్తుతం ఉన్న 50 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గించడంతో అమెరికా మార్కెట్లో మన ఎగుమతులు మరింత సమర్ధవంతంగా పోటీపడతాయని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. అమెరికాతో కుదిరిన తాజా బీటీఏ ప్రభావం ఈ రంగాలపై ప్రధానంగా కనిపించనుంది.

ఐటీ, ఐటీ సేవలు: భారత ఐటీ, ఐటీ సేవల కంపెనీలకు అమెరికానే అతిపెద్ద మార్కెట్‌. నిజానికి ట్రంప్‌ సుంకాల ప్రభావం ఈ రంగంపై లేదు. అయితే ముందు ముందు వీటిపైనా సుంకాల పోటు తప్పదని ట్రంప్‌ గతంలోనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఒప్పందంతో ఆ భయాలు పోయాయి అయితే హెచ్‌-1బీ వీసాలపై అమెరికా వెళ్లి అక్కడ పని చేస్తున్న భారత ఐటీ నిపుణులపై మాత్రం ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది.

ఫార్మా, స్పెషాలిటీ కెమికల్స్‌: భారత ఫార్మా ఎగుమతులపైనా ట్రంప్‌ సుంకాల ప్రభావం లేదు. అయితే అమెరికాలో ఉత్పత్తి యూనిట్లు పెట్టి ఉత్పత్తి చేయకపోతే, వచ్చే రెండేళ్లలో వాటిపైనా సుంకాల పోటు తప్పదని ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పుడు ఈ ఒప్పందంతో భారత ఫార్మా రంగం కూడా ఊపిరి పీల్చుకుంది. రెండేళ్ల తర్వాత ట్రంప్‌ సుంకాలు విధించినా అవి 18 శాతమే ఉంటాయి. కాబట్టి పెద్ద ప్రమాదమేమీ లేదని భావిస్తోంది. ఒకవేళ అమెరికా ఫార్మా కంపెనీలు దేశీయంగా ఉత్పత్తి ప్రారంభించినా కనీసం 30 శాతం అధికంగా ఖర్చవుతుంది. కాబట్టి అమెరికా జెనరిక్‌ ఔషధాల మార్కెట్లో మనకి వచ్చే పెద్ద ముప్పేమీ లేదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. స్పెషాలిటీ కెమికల్స్‌దీ ఇదే పరిస్థితి. మనకు ప్రధాన పోటీదారైన చైనా ఉత్పత్తులపై అమెరికాలో 34 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. వారితో పోలిస్తే మన ఎగుమతులపై ఉండే సుంకాలు 18 శాతమే. దీంతో చైనా కంపెనీలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా భారత స్పెషాలిటీ కెమికల్స్‌, కంపెనీలతో పోటీపడడం కష్టమని భావిస్తున్నారు.


టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ: భారత-అమెరికా వాణిజ్య ఒప్పందంతో ఎక్కువగా లాభపడే రంగాల్లో వస్త్ర (టెక్స్‌టైల్స్‌) పరిశ్రమ ఒకటి. ట్రంప్‌ సుంకాల పోటుతో తమిళనాడులోని తిరుపూర్‌తో సహా అనేక చోట్ల వస్త్ర పరిశ్రమ కుప్పకూలింది. వేల మంది రోడ్డున పడ్డారు. కొన్ని కంపెనీలు మూతపడితే, ఉన్న కంపెనీలూ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఉపయోగించుకోలేక పోతున్నాయి. ఈ ఒప్పందంతో వస్త్ర పరిశ్రమ మళ్లీ పుంజుకోనుంది.

జుయెలరీ: ట్రంప్‌ సుంకాల పోటుతో ఆభరణాల పరిశ్రమ బాగా దెబ్బతింది. అమెరికాకు ఎగుమతులు దాదాపు 40 శాతం పడిపోయాయి. ఈ ప్రభావం గుజరాత్‌లోని డైమండ్‌ కట్టింగ్‌, పాలిషింగ్‌ పరిశ్రమపైనా పడింది. చాలా యూనిట్లు మూతపడడంతో దాదాపు లక్షన్నర మంది రోడ్డునపడ్డారు. సుంకాలపై ట్రంప్‌ దిగి రావడంతో ఇప్పుడు ఈ పరిశ్రమ మళ్లీ గత వైభవానికి దగ్గర కానుంది.

ఆటోమొబైల్‌ పరిశ్రమ: మన దేశం నుంచి అమెరికాకు కార్ల ఎగుమతులు దాదాపుగా లేవు. ఆటోమొబైల్‌ విడిభాగాల ఎగుమతులు మాత్రం పెద్దమొత్తంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ వాణిజ్య ఒప్పందంతో ఎగుమతులు మళ్లీ గాడిలో పడనున్నాయి.

మత్స్య ఎగుమతులు: ట్రంప్‌ సుంకాల పోటుతో మన దేశం నుంచి ఆ దేశానికి మత్స్య ఎగుమతులు ముఖ్యంగా రొయ్యల ఎగుమతులు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు సుంకాల పోటు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది.

ఇవి కూడా చదవండి:

హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

బాయ్‌కాట్‌ నష్టం రూ.2200 కోట్లు!

Updated Date - Feb 04 , 2026 | 05:23 AM