ప్రపంచ ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపే బలమైన సంకేతం
ABN , Publish Date - Feb 08 , 2026 | 02:13 AM
భారత్-అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదరడంపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ ఒప్పందం భారత మార్కెట్‌పై ప్రపంచ పరిశ్రమలు, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని....
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఇండస్ట్రీ వర్గాలు
న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదరడంపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ ఒప్పందం భారత మార్కెట్‌పై ప్రపంచ పరిశ్రమలు, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపే బలమైన సంకేతమని వారు అభిప్రాయపడ్డారు. అలాగే, ఎగుమతి వాణిజ్యంలో మన వస్తువుల పోటీతత్వాన్ని పెంచనుందని, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేనుందని, సరఫరా వ్యవస్థ స్థితిస్థాపకతకు దోహదపడనుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నారు.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల మధ్య ఆర్థిక సమన్వయ పురోగతిలో ఈ ఒప్పందం కీలక అడుగు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సుంకాల తగ్గింపు, నియంత్రణ అవరోధాల తొలగింపుతోపాటు అన్ని రంగాల్లో కొత్త వ్యాపార అవకాశాలకు బాటలు వేయనుంది. ప్రపంచ తయారీ హబ్‌గా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్న తరుణంలో ఈ ఒప్పందం మన వస్తువుల పోటీతత్వాన్ని పెంచడంతోపాటు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేనుంది. సరఫరా వ్యవస్థనూ మెరుగుపరచనుంది.
అనంత్ గోయెంకా, ఫిక్కీ ప్రెసిడెంట్
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) స్వాగతిస్తోంది. రెండు దేశాల మధ్య సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎ్‌ఫటీఏ) కుదరడానికిది సరైన అడుగు. స్వేచ్ఛాయుత, ఊహించదగిన, నిబంధనల ఆధారిత వాణిజ్యానికి ఇరుదేశాల నిబద్ధత, విధానాల అమరిక, విశ్వాసాన్ని ఈ ఒప్పందం ప్రతిబింబిస్తోంది. ఇది ప్రపంచ పరిశ్రమలు, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచే బలమైన సంకేతం.
రాజీవ్ మెమానీ, సీఐఐ అధ్యక్షులు
ఈ ఒప్పందం సాంకేతిక భాగస్వామ్యంలో పురోగతి, తయారీలో నాణ్యత పెంపునకు తోడ్పడటంతోపాటు స్థిరంగా పారిశ్రామిక వృద్ధికి దోహదపడనుంది. ప్రపంచ మార్కెట్లతో మరింత ధీమాగా వాణిజ్యం నెరిపేందుకు కొత్త మార్గాలను తెరవనుంది.
హర్ష్ సింఘానియా, జేకే పేపర్ సీఎండీ
ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతం, తయారీలో సహకారం, రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వస్తు సరఫరా పెంపునకు ఇరు దేశాల నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తోంది. ఇది మా వాహన విడిభాగాల తయారీ పరిశ్రమలకు సానుకూలం. మా ఉత్పత్తుల పోటీతత్వం పెంచడంతోపాటు సాంకేతికత సహకారాన్ని విస్తృతం చేసుకునేందుకు, ప్రపంచ వాహన విడిభాగాల సరఫరా వ్యవస్థలో విశ్వాసమైన భాగస్వామిగా భారత్ పాత్రను బలపరిచేందుకు ఈ అగ్రిమెంట్ తోడ్పడనుంది.
విక్రమ్‌పతి సింఘానియా, ఆటోమోటివ్ కాంపొనెంట్
మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు
అమెరికాకు వజ్రాలు, రంగు రాళ్ల ఎగుమతిపై సుంకాల మినహాయింపు కీలక మలుపు. యూఎ్‌సకు వీటి ఎగుమతులను పునరుద్ధరించడంతోపాటు మన ఉత్పత్తుల పోటీతత్వాన్ని మెరుగుపరచనుంది. అధిక సుంకాలతో ఇనాళ్లూ ఇబ్బందులెదుర్కొన్న భారత జెమ్స్ అండ్ జువెలరీ ఇండస్ట్రీకిది ఊతమివ్వనుంది. సుంకాల మినహాయింపు జాబితాలో ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాలు, సింథటిక్ జెమ్‌స్టోన్స్‌ను కూడా చేర్చాలని ప్రభుత్వాన్ని మా సమాఖ్య కోరడం జరిగింది.
- కిరీట్ భన్సాలీ, జీజేఈపీసీ చైర్మన్
ఔషధ రంగంలో భారత్- అమెరికా భాగస్వామ్యాన్ని బలపరచడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఔషధాల భద్రత జాతీయ భద్రతలో భాగం.
సుదర్శన్ జైన్, ఐపీఏ సెక్రటరీ జనరల్
Also Read:
మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్